ఫలించిన మూడేళ్ల నిరీక్షణ
ABN, Publish Date - Jun 30 , 2025 | 11:42 PM
గత మూడేళ్లుగా నిరీక్షిస్తున్న సమగ్ర శిక్ష అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మూడేళ్ల తరువాత ఈ-ఫైలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో 201 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరింది.
సమగ్ర శిక్షలో 201 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఊరట
కొత్త జిల్లా ఏర్పడినా ఇప్పటి వరకు ఈ-ఫైలింగ్ జరగని దుస్థితి
ఇన్నాళ్లు ఇన్‌చార్జి ఏపీసీలు ఉండడంతో పట్టించుకోని వైనం
శాశ్వత ఏపీసీ స్వామినాయుడు చొరవతో తాజాగా ఉద్యోగుల ఈ-ఫైలింగ్ పూర్తి
ఆనందం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
గత మూడేళ్లుగా నిరీక్షిస్తున్న సమగ్ర శిక్ష అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మూడేళ్ల తరువాత ఈ-ఫైలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో 201 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరింది.
పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు పేరిట 2022లో జిల్లా ఏర్పడిన తరువాత పాడేరు డివిజన్‌లో 11 మండలాలు, రంపచోడవరం నియోజకవర్గం పరిధిలో 11 మండలాలు జిల్లా పరిధిలోకి వచ్చాయి. దీంతో మొత్తం 22 మండలాల్లో సమగ్ర శిక్ష విభాగంలోని అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు వ్యవహారాలను ఈ-ఫైలింగ్ నమోదు చేయాలని కొత్త జిల్లా ఏర్పడినప్పుడే ఆంధ్రప్రదేశ్ అవుట్‌సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్ ఎండీ.. కలెక్టర్, సమగ్ర శిక్ష విభాగంలోని ఏపీసీలకు ఆదేశాలు జారీ చేశారు. కానీ వాటిని ఉన్నతాధికారులు పట్టించుకోకుండా గత మూడేళ్లుగా పాడేరు డివిజన్‌లోని ఉద్యోగులను విశాఖపట్నం జిల్లా ఉద్యోగులుగా, రంపచోడవరం ప్రాంతంలోని ఉద్యోగులను తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారిగానే పరిగణిస్తూ జీతాలు చెల్లిస్తున్నారు. ఈ సమస్యను గుర్తించిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు తమను అల్లూరి జిల్లా ఉద్యోగులుగానే గుర్తించి ఈ-ఫైలింగ్ చేయాలని, లేకుంటే సర్వీసు వ్యవహారాల్లో సమస్యలు ఏర్పడితే తీవ్ర ఇబ్బందులకు గురవుతామని అధికారులకు తెలిపినా పట్టించుకున్న దాఖలాలు లేవు. వాస్తవానికి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఈ-ఫైలింగ్ జరిగితేనే నామినీ, ఈపీఎఫ్ వంటి సౌకర్యాలు వర్తిస్తాయి. లేకుంటే విధుల్లో ఉన్న ఉద్యోగులు ఏదైనా కారణంతో మృతి చెందితే వారి కుటుంబాలకు ఎటువంటి లబ్ధి చేకూరని పరిస్థితి ఏర్పడుతుంది.
శాశ్వత ఏపీసీలు లేకపోవడంతో పట్టించుకోని దుస్థితి
2022లో కొత్త జిల్లా ఏర్పడినప్పటికీ ఈ ఏడాది జనవరి వరకు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త(ఏపీసీ)గా డీఈవోలనే ఇన్‌చార్జులుగా కొనసాగించారు. వాస్తవానికి జిల్లాలో గత మూడేళ్లుగా డీఈవో పోస్టు సైతం ఇన్‌చార్జులతోనే కొనసాగుతుండగా, ఆ అధికారికే సమగ్ర శిక్ష ఏపీసీ ఇన్‌చార్జి పోస్టు అప్పగించారు. దీంతో జిల్లాలో సమగ్ర శిక్షకు సంబంధించిన ఏ వ్యవహారాలను పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో శాశ్వత ఏపీసీగా డాక్టర్ ఎ.స్వామినాయుడు బాధ్యతలు స్వీకరించిన తరువాత అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన ఈ-ఫైలింగ్ వ్యవహారంపై కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్‌తో చర్చించి సమస్యకు పరిష్కారం చూపాలని నిర్ణయించారు. జిల్లాలోని 22 మండలాలకు చెందిన 201 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పాడేరు రప్పించి, వారికి సంబంధించిన సర్వీసు మేటర్లను ఆన్‌లైన్‌లో పక్కాగా నమోదు చేసి ఈ-ఫైలింగ్ ప్రక్రియను చేపట్టారు. దీంతో జూలై నెల నుంచి వారి జీతాలు పద్ధతి ప్రకారం అల్లూరి సీతామరాజు జిల్లాకు చెందిన వారిగానే అందనున్నాయ. భవిష్యత్తులో ప్రభుత్వపరంగా అందే సౌకర్యాలకు ఎటువంటి అడ్డంకులు ఉండవని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
201 మంది ఉద్యోగులకు లబ్ధి
ఎట్టకేలకు మూడేళ్ల తరువాత ఈ-ఫైలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో సమగ్ర శిక్షలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న 201 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరింది. వారిలో అకౌంటెంట్లు 15 మంది, ఏఎన్ ఎంలు 12, కుక్‌లు 26, హెల్పర్లు 39, అటెండర్లు 17, డే వాచ్‌మన్‌లు 19, నైట్ వాచ్‌మన్‌లు 16, స్వీపర్లు 27, ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్లు 2, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ 1, సీఆర్‌పీలు 12, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్లు 10, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 1, మెసంజర్ 4 ఉన్నారు.
Updated Date - Jun 30 , 2025 | 11:42 PM