ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఫార్మాలో ప్రమాదాల పరంపర

ABN, Publish Date - Jun 13 , 2025 | 01:22 AM

ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు, మరణాలకు అంతుండడం లేదు.

  • కంపెనీలలో అసలేం జరుగుతోంది?

  • తాజాగా ‘సాయిశ్రేయాస్‌’లో ఇద్దరి మృతి

  • మరొకరి పరిస్థితి విషమం

  • సేఫ్టీ అధికారులే మరణిస్తే...సిబ్బంది పరిస్థితి ఏంటి?

  • ఎస్‌ఓపీ పాటించేలా చూడాల్సిన బాధ్యత ఎవరిది?

  • వరుస ప్రమాదాలు జరుగుతున్నా అదే నిర్లక్ష్యం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు, మరణాలకు అంతుండడం లేదు. భద్రతా ప్రమాణాలు ఎవరూ పాటించడం లేదు. అమలు చేయాల్సిన విభాగాలు చోద్యం చూస్తున్నాయి. తాజాగా సాయిశ్రేయాస్‌ ఫార్మా కంపెనీలో ఏకంగా మందుల తయారీ ప్రక్రియను పర్యవేక్షించే భద్రతా విభాగం అధికారులే ప్రాణాలు కోల్పోయారంటే అక్కడి పరిస్థితులు ఏమిటో ఆలోచించాల్సి ఉంది.

పరవాడలోని విశాఖ ఫార్మా సిటీ (రాంకీ)లోని సాయిశ్రేయాస్‌ మందుల తయారీ కంపెనీలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత విషవాయువు పీల్చి ఇద్దరు ఉద్యోగులు మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వారిలో పగిరి చంద్రశేఖర్‌ (32) సేఫ్టీ విభాగంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ కాగా మరొకరు శరగడం కుమార్‌ (25) సేఫ్టీ షిఫ్ట్‌ ఆఫీసర్‌. అంటే ఇద్దరూ భద్రతా విభాగంలో కీలక ఉద్యోగులే. వారే మరణించారంటే...అక్కడ ఏమి జరిగినట్టు..? భద్రతా ప్రమాణాలు ఎంత వరకు పాటిస్తున్నట్టు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏమి జరిగిందంటే...?

కీలకమైన వ్యాధికి సంబంధించిన ఇంటర్మీడియట్‌ మందు తయారుచేస్తుండగా ఆ బ్యాచ్‌ ఫెయిల్‌ అయింది. అది ప్రమాదకరమైన వ్యర్థం కావడం వల్ల ఎఫ్లూయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు (ఈటీపీ)లోకి పంపకుండా వేరే ట్యాంక్‌లోకి గానీ రియాక్టర్‌లోకి గానీ తీసి, దానిని ట్రీట్‌మెంట్‌ చేసి రాంకీ ఫార్మాసిటీలో వ్యర్థాల శుద్ధి కర్మాగారానికి పంపాలి. కానీ సాయి శ్రేయాస్‌ సిబ్బంది అలా చేయలేదు. ఆ వ్యర్థాలను నేరుగా ఈటీపీలోకి పంపించేశారు. అప్పటికే అందులో ఉన్న వ్యర్థాలతో కలిపి దానిని డైల్యూట్‌ చేసే ప్రక్రియ చేపట్టారు. ఆ సమయంలో ఈటీపీకి ఉన్న మ్యాన్‌హోల్స్‌ను మూసివేయాలి. కానీ తెరిచి ఉంచారు. అంటే నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఆ ప్రక్రియ జరుగుతున్నప్పుడు హెచ్‌2ఎస్‌ (హైడ్రోజన్‌ సల్ఫైడ్‌) విడుదలైంది. ఇది కుళ్లిన కోడిగుడ్డు వాసన వస్తుంది. దీనిని ఎక్కువ పీలిస్తే కోమాలోకి వెళ్లి, ప్రాణాలు కూడా పోతాయి. ఇక్కడ అదే జరిగింది. రాత్రి షిఫ్ట్‌లో ఉన్న సేఫ్టీ ఆఫీసర్లు ఇద్దరూ మరో వర్కర్‌ బన్సాల్‌ని తీసుకొని డైల్యూషన్‌ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో చూడడానికి ఈటీపీపైకి వెళ్లారు. అప్పటికే హెచ్‌2ఎస్‌ అక్కడ వ్యాపించి ఉండడంతో ఆ ఘాటైన వాయువు పీల్చి మరణించారు. వర్కర్‌ బన్సాల్‌ స్పృహ కోల్పోయాడు.

ఇవీ లోపాలు

- ఈటీపీ వద్దకు వెళుతున్నప్పుడు అక్కడ ఏ ప్రక్రియ జరుగుతున్నదో తెలుసు కాబట్టి దానికి తగిన రక్షణ పరికరాలు ధరించి వెళ్లాలి. అంటే మంచి మాస్క్‌ కచ్చితంగా ధరించాలి. అది విష వాయువుల నుంచి రక్షణ కల్పించేదై ఉండాలి.

- హెచ్‌2ఎస్‌ను వాసనను బట్టి గుర్తుపట్టవచ్చు. మ్యాన్‌హోల్‌ తెరిచి ఉంది కాబట్టి ఈటీపీ పైకి వెళుతున్నప్పుడే ఆ వాసన వస్తుంది. అంటే దానిని గుర్తు పట్టే స్థితితో సేఫ్టీ అధికారులు ఉండాలి. వారు ఆ వాసన గుర్తు పట్టి కిందికి దిగిపోవాలి. కానీ అలా చేసినట్టు లేదు.

- ప్రతి సంస్థ తయారుచేసే మందులను బట్టి ‘స్టాండర్ట్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)’ పాటించాలి. మందుల తయారీ ప్రాంతంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సిబ్బందికి అవగాహన కల్పించి, తగిన భద్రతా పరికరాలు అందించాలి. అంటే మాస్క్‌లు, గ్లౌజులు, బూట్లు వంటివి అందులో భాగంగా ఉంటాయి.

ఏదో జరిగింది చెప్పడం లేదు

కంపెనీ యాజమాన్యం, పోలీసులు విషవాయువు లీకై దానిని పీల్చి చనిపోయారని చెబుతున్నారు. ఇంకే విషయాలు వెల్లడించడం లేదు.

నిర్లక్ష్యం ఉందని అర్థమవుతోంది

ముకుందరావు, ఈఈ, కాలుష్య నియంత్రణ మండలి

ఈటీపీలోనే వ్యర్థాలను శుద్ధి చేయకూడదు. వేరే ట్యాంకులోకి తీసుకొని చేయాలి. కానీ వారు అలా చేయలేదు. పైగా మ్యాన్‌హోల్‌ తెరిచి ఉంచారు. అది మూసి ఉంటేనే ప్రక్రియ సజావుగా జరుగుతుంది. అక్కడ నిబంధనల ప్రకారం వ్యవహరించలేదు. నిర్లక్ష్యం ఉందని అర్థమవుతోంది. పైగా చనిపోయిన వారిలో ఒకరికి సేఫ్టీ విభాగంలో పదేళ్ల అనుభవం ఉంది.

స్పందించని ఫ్యాక్టరీస్‌ విభాగం

ఈ ప్రమాదంపై వివరాలు తెలుసుకోవడానికి డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ అధికారి పరమేశ్వరరావుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి ఫోన్‌ చేయగా ఆయన స్పందించలేదు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత వారిదే. ఈ విభాగం పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో భద్రతా విభాగంలో పనిచేసే వారికి మళ్లీ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అర్థమవుతోంది.

Updated Date - Jun 13 , 2025 | 01:22 AM