ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కూటమిలో కొలిక్కిరాని కసరత్తు

ABN, Publish Date - Jul 29 , 2025 | 01:21 AM

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికపై ‘కూటమి’ కసరత్తు కొనసాగుతోంది.

  • స్టాండింగ్‌ కమిటీ అభ్యర్థులపై తర్జనభర్జన

  • మేయర్‌, ఎమ్మెల్యేల భేటీ

  • ప్రచారంలో పలువురి పేర్లు

  • నేడు అభ్యర్థుల ప్రకటన, నామినేషన్లు దాఖలు

విశాఖపట్నం, జూలై 28 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికపై ‘కూటమి’ కసరత్తు కొనసాగుతోంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే దానిపై మేయర్‌ పీలా శ్రీనివాసరావు సోమవారం కూటమి ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులతో దసపల్లా హోటల్‌లో సమావేశమయ్యారు. స్టాండింగ్‌ కమిటీలో పది స్థానాలు ఉండగా, వాటిలో బీజేపీకి ఒకటి, జనసేనకు ఒకటి కేటాయిస్తామని మేయర్‌, ఇతర టీడీపీ నేతలు ప్రతిపాదించారు. దీనికి బీజేపీ సమ్మతించినప్పటికీ జనసేన నేతలు మాత్రం తమకు రెండు స్థానాలు కావాలని పట్టుబట్టినట్టు తెలిసింది. మరోవైపు సోమవారం రాత్రి పదకొండు గంటల వరకూ టీడీపీ నుంచి పోటీకి దిగే అభ్యర్థులెవరో ఇంకా నిర్ణయించలేదు. నియోజకవర్గానికి ఒకరి పేరును ఎమ్మెల్యేలు/టీడీపీ ఇన్‌చార్జిలే సూచించాలని మేయర్‌ కోరారు. కాగా, ప్రస్తుతం కూటమి అభ్యర్థులుగా భీమిలి నుంచి ఐదో వార్డు కార్పొరేటర్‌ మొల్లి హేమలత, తూర్పు నియోజకవర్గం నుంచి 17వ వార్డు కార్పొరేటర్‌ గేదెల లావణ్య, దక్షిణ నియోజకవర్గం నుంచి 39వ వార్డు కార్పొరేటర్‌ మహ్మద్‌ సాదిక్‌, గాజువాక నుంచి 79వ వార్డు కార్పొరేటర్‌ రౌతు శ్రీనివాసరావు, పశ్చిమ నియోజకవర్గం నుంచి దాడి వెంకటరామేశ్వరరావు పేర్లు దాదాపు ఖరారైనట్టు తెలిసింది. పెందుర్తి నుంచి శానాపతి వసంత, రాపర్తి కన్నా మధ్య, ఉత్తర నియోజకవర్గం నుంచి ముక్కా శ్రావణి, గంకల కవిత మధ్య పోటీ నెలకొంది. అనకాపల్లి నుంచి ఎవరికి అవకాశం ఇవ్వాలనేదానిపై నేతలు ఇంకా స్పష్టతకు రాలేదు. జనసేనకు మరొకటి ఇవ్వాల్సి వస్తే ఆ పార్టీ నేతలు ఎవరికి అవకాశం ఇస్తారో చూడాల్సి ఉంటుంది. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలు వరకు మాత్రమే నామినేషన్ల దాఖలుకు గడువు ఉండడంతో ఉదయాన్నే అభ్యర్థులను ప్రకటించి, వెంటనే నామినేషన్లు దాఖలు చేయిస్తామని కూటమి నేతలు చెబుతున్నారు.


రెండు రోజుల్లో పి-4 మార్గదర్శుల మ్యాపింగ్‌: కలెక్టర్‌

మహారాణిపేట, జూలై 28 (ఆంధ్రజ్యోతి):

రెండు రోజల్లో పి-4 మార్గదర్శుల మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి కావాలని జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సేవకులు, ఇతర వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే వారిని గుర్తించి, బంగారు కుటుంబాలకు మ్యాపింగ్‌ చేయాలని సూచించారు. సమాజంలో ఆర్థికంగా స్థిరపడినవారు దిగువస్థాయిలో ఉన్న వారిని దత్తత తీసుకునేలా ప్రోత్సహించి తగిన సహకారం అందేలా చూడాలని ఆదేశించారు.


కోడి వ్యర్థాలు చేపల చెరువుకు తరలిస్తే రూ.50 వేలు జరిమానా

ప్రజారోగ్య విభాగం అధికారులకు కమిషనర్‌ ఆదేశం

కాపులుప్పాడ డంపింగ్‌ యార్డు వద్ద కోడి వ్యర్థాల ప్రాసెసింగ్‌ యూనిట్‌

ఏర్పాటుకు ప్రతిపాదన

విశాఖపట్నం, జూలై 28 (ఆంధ్రజ్యోతి):

కోడి వ్యర్థాల అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేయడంపై జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ దృష్టిసారించారు. ప్రతిరోజూ కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఇరువర్గాలు రౌడీషీటర్లను పెట్టుకుని కొట్లాటలకు దిగుతుండడంపై ‘గ్రేటర్‌లో కోడివ్యర్థాల లొల్లి’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ప్రజారోగ్య విభాగం అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డులో కోడి వ్యర్థాలను ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ఆసక్తి చూపిన రాజమండ్రి, మంగళగిరికి చెందిన వారిని పిలిపించాలని ఆదేశించారు. అదేవిధంగా చికెన్‌ వ్యర్థాలను చేపల చెరువులకు తరలింపుపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. పట్టుబడిన వాహనానికి రూ.50 వేలు జరిమానా విధించాలని ఆదేశించినట్టు తెలిసింది. ఇప్పటివరకూ 15 వాహనాలను పట్టుకుని సీజ్‌ చేసినందున వాటి నుంచి ఆ మేరకు జరిమానా వసూలుచేయడంపై అధికారులు దృష్టిసారించారు. కోడి వ్యర్థాల మాఫియా వెనుక ఉన్నవారెవరో గుర్తించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతోపాటు చేపల చెరువులకు తరలిపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ గంధం శ్రీనివాసరావు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో కమిషనర్‌కు ఫిర్యాదు అందజేశారు.

Updated Date - Jul 29 , 2025 | 01:21 AM