దశాబ్దాల నాటి కల నెరవేరుతున్న వేళ
ABN, Publish Date - Jul 23 , 2025 | 12:46 AM
మండలంలోని అంజలి శనివారం ప్రధాన రహదారికి మోక్షం కలిగింది. నిర్మాణానికి అవసరమైన రూ.1.34 కోట్ల పెండింగ్ నిధులను కూటమి ప్రభుత్వం విడుదల చేయడంతో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో తారు రోడ్డు నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. మరో ఐదు రోజుల్లో పనులు పూర్తి కానున్నాయి. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే 28 గ్రామాల ఆదివాసీల రవాణా కష్టాలు తీరనున్నాయి. దశాబ్దాల నాటి కల నెరవేరుతుండడంతో ఈ ప్రాంత గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- అంజలి శనివారం రహదారికి మోక్షం
- పెండింగ్ నిధులు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం
- జోరుగా తారు రోడ్డు నిర్మాణ పనులు
- 28 గ్రామాల ప్రజలకు తీరనున్న రవాణా కష్టాలు
చింతపల్లి, జూలై 22 (ఆంరఽధజ్యోతి): మండలంలోని అంజలి శనివారం ప్రధాన రహదారికి మోక్షం కలిగింది. నిర్మాణానికి అవసరమైన రూ.1.34 కోట్ల పెండింగ్ నిధులను కూటమి ప్రభుత్వం విడుదల చేయడంతో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో తారు రోడ్డు నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. మరో ఐదు రోజుల్లో పనులు పూర్తి కానున్నాయి. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే 28 గ్రామాల ఆదివాసీల రవాణా కష్టాలు తీరనున్నాయి. దశాబ్దాల నాటి కల నెరవేరుతుండడంతో ఈ ప్రాంత గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని శివారు పంచాయతీ అంజలి శనివారం. జాజులపాలెం నుంచి అంజలి శనివారం వరకు 4.8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రహదారిపై అంజలి శనివారం పంచాయతీకి చెందిన 18 గ్రామాలు, జి.మాడుగుల మండలం సొలబం పంచాయతీ పరిధిలోని 10 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రహదారి అత్యంత అధ్వానంగా ఉండడంతో వర్షాకాలం వచ్చిందంటే ఈ ప్రాంతీయుల రవాణా కష్టాలు వర్ణనాతీతం. గ్రామాలకు అంబులెన్సు వచ్చే పరిస్థితి ఉండదు. రోగులు, గర్భిణులను డోలీపై మోసుకు వెళ్లడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఈ సమస్యను గుర్తించిన నాటి తెలుగుదేశం ప్రభుత్వం 2018లో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం ద్వారా రహదారి నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 2019 జనవరిలో రూ.రెండు కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను విడుదల చేసింది. అదే ఏడాది అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ రహదారి పనుల టెండర్‌ను రద్దు చేసింది. స్థానిక గిరిజనులు, ప్రతిపక్షనేతల ఆందోళనలతో 2020-2021లో గత ప్రభుత్వం జాజులపాలెం నుంచి అంజలి శనివారం వరకు రహదారి నిర్మాణానికి రూ.2.84 కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను విడుదల చేసింది. గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో కాంట్రాక్టర్ రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎర్తువర్కు పూర్తి చేసి జీఎస్‌బీ, వెట్‌మిక్స్ వేశారు. కల్వర్టులు నిర్మించారు. అయితే నిర్మాణాలకు సంబంధించిన నిధులు విడుదల చేయడంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేయడంతో కాంట్రాక్టర్ పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. 2023 ఆఖరిలో రహదారి నిర్మాణాలకు సంబంధించి సుమారు రూ.కోటి నిధులను ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు విడుదల చేసింది. అయితే తొలివిడత నిధులు విడుదలకు మూడేళ్లు నిరీక్షించాల్సి వచ్చిందని, మలివిడత పనులు చేపట్టినా నిధులు విడుదలకు ఎంత సమయం పడుతుందోనని కాంట్రాక్టర్ పనులు చేపట్టకుండా చేతులెత్తేశారు. దీంతో అంజలి శనివారం రహదారి నిర్మాణం కలగానే మిగిలిపోయింది.
కూటమి ప్రభుత్వం వచ్చాక కదలిక
2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరులో నిర్మాణాలకు సంబంధించిన రూ.50 లక్షల నిధులు విడుదల చేయడంతో పనుల్లో కదలిక వచ్చింది. రహదారి నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు అప్పగించింది. దీంతో ప్రధానంగా అంజలి శనివారం ఘాట్‌లో కాంట్రాక్టర్‌ను ఒప్పించి 600 మీటర్లు సీసీ రోడ్డు నిర్మించారు. అలాగే 4.2 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణానికి అవసరమైన మలివిడత నిధులు విడుదల చేయాలని పంచాయతీరాజ్‌శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు.
పెండింగ్ నిధులు విడుదలతో తారు రోడ్డు నిర్మాణం
రాష్ట్ర ప్రభుత్వం జాజులపాలెం నుంచి అంజలి శనివారం వరకు 4.2 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి అవసరమైన పెండింగ్ నిధులు రూ.1.34 కోట్లను విడుదల చేసింది. దీంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు నూతనంగా మరో కాంట్రాక్టర్‌కు నిర్మాణ పనుల బాధ్యలు అప్పగించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో సోమవారం తారు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. తొలి రోజు 900 మీటర్ల తారు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేశారు. వర్షం అధికంగా కురవడంతో తారు రోడ్డు నిర్మాణాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు.
Updated Date - Jul 23 , 2025 | 12:46 AM