మోక్షం లేని నాడు-నేడు
ABN, Publish Date - Jun 11 , 2025 | 12:56 AM
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టిన పనులు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. అప్పట్లో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వ పాఠశాలల్లో అసంపూర్తిగా పనులు
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని గత వైసీపీ ప్రభుత్వం
సాధారణ ఎన్నికల ముందే ఆగిన పనులు
ప్రభుత్వం మారినా కలగని మోక్షం
నిధుల కోసం సమగ్ర శిక్ష అధికారులు ప్రతిపాదనలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టిన పనులు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. అప్పట్లో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
పాఠశాలలు బుధవారం పునఃప్రారంభం కానున్నాయి. స్కూళ్లు తెరిచేనాటికి అన్ని యాజమాన్యాల పరిధిలోని విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యా శాఖ, సమగ్ర శిక్ష అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో నాడు-నేడు కార్యక్రమం కింద ఎంపిక చేయని పాఠశాలల్లో భవనాలకు మరమ్మతులు, మౌలిక వసతుల కల్పన పనులకు అధికారులు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే నాడు-నేడు కార్యక్రమం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న వివిధ రకాల పనులు ఇప్పటికీ అలాగే దర్శనమిస్తున్నాయి. జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరంలో 604 పాఠశాలల్లో నాడు-నేడు కింద రూ.250 కోట్ల అంచనా వ్యయంతో 988 పనులు చేపట్టారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అదనపు గదులు, ప్రహరీ గోడలు, మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టారు. వీటిలో సుమారు 60 శాతం పనులకు రూ.132 కోట్లు ఖర్చు చేశారు. అయితే చేసిన పనులకు కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించలేదు. ఫలితంగా గత ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు నాడు-నేడు కింద వివిధ దశల్లో ఉన్న పనులు నిలిచిపోయాయి.
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఆగిన నాడు-నేడు పనులకు నిధులు మంజూరు చేసి 2025-26 విద్యా సంవత్సరంనాటికి పూర్తి చేస్తారని అంతా భావించారు. ఈ మేరకు విద్యా శాఖాధికారులు జిల్లాలో నాడు- నేడు కార్యక్రమం కింద చేపట్టి, మధ్యలో వదిలేసిన పనుల వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. కానీ నిధులు మాత్రం విడుదల కాలేదు. దీంతో సుమారు ఏడాది నుంచి ఎక్కడ పనులు అక్కడే అన్న చందంగా వున్నాయి. కూటమి ప్రభుత్వం గతంలో నాడు-నేడు కార్యక్రమం కింద ఎంపిక చేసిన పాఠశాలలను పక్కనపెట్టి, మిగిలిన పాఠశాలల్లో అదనపు తరగతుల గదులు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నది. దీంతో ఆయా పాఠశాలల్లో పనులు దాదాపుగా చివరి దశకు చేరాయి. నాడు-నేడు కింద చేపట్టి, అసంపూర్తిగా వున్న నిర్మాణాల ఊసెత్తడం లేదు. ఏడాది క్రితం ఆగిన నాడు-నేడు పనులు పూర్తి చేస్తామని అధికారులు రెండు, మూడు నెలల నుంచి ప్రకటనలు చేస్తున్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆయా పాఠశాలల్లో అసంపూర్తిగా వున్న నాడు-నేడు పనుల కారణంగా విద్యార్థులు ఈ ఏడాది కూడా ఇబ్బందిపడాల్సి వస్తున్నది. దీనిపై సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ జయప్రకాశ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి వివరణ కోరగా... నాడు-నేడు కార్యక్రమం కింద గత ప్రభుత్వ హయాంలో చేపట్టి, అసంపూర్తిగా వున్న పనులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపామని, నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తామన్నారు.
Updated Date - Jun 11 , 2025 | 12:56 AM