సేంద్రీయ వ్యవసాయానికి పెద్దపీట
ABN, Publish Date - May 08 , 2025 | 11:05 PM
జిల్లాలో సేంద్రీయ వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో రెండు రోజులు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లాను ఆర్గానిక్ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రతిపాదన చేశారు.
భూసారం పెంపునకు రైతులకు పచ్చిరొట్ట ఎరువులు
గిరిజన రైతులకు 90 శాతం రాయితీ
తొలిసారిగా పది కిలోల కిట్ల రూపంలో పంపిణీ
జిల్లాకు తొలివిడతగా 4,175 కిట్లు
చింతపల్లి, మే 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సేంద్రీయ వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో రెండు రోజులు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లాను ఆర్గానిక్ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రతిపాదన చేశారు. ఈ మేరకు గిరిజన రైతులు సేంద్రీయ పద్ధతుల్లో పంటలను పండించేందుకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. సేంద్రీయ సాగులో భాగంగా గిరిజన రైతులను రసాయనిక ఎరువులకు దూరం చేయడంతో పాటు భూసారం పెంపొందించేందుకు అవసరమైన పచ్చిరొట్ట ఎరువులను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. తొలిసారిగా జనుము, పిల్లిపెసర, జీలుగు కలిపి పది కిలోల కిట్ల రూపంలో రైతులకు పంపిణీ చేస్తున్నారు. జీలుగ నాలుగు కిలోలు, జనుము నాలుగు కిలోలు, పిల్లిపెసర రెండు కిలోలు కిట్‌లో ఉంటాయి. జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా 4,175 కిట్లను పంపిణీ చేసింది. అరకు డివిజన్‌కి 875, పాడేరు 1,100, చింతపల్లి 600, అడ్డతీగల 500, రంపచోడవరం 450, చింతూరు డివిజన్లకు 650 కిట్లను కేటాయించింది. 50 శాతం పచ్చిరొట్ట ఎరువులను ఏపీసీఎన్‌ఎఫ్ పరిధిలో ప్రకృతి వ్యవసాయం చేపడుతున్న రైతులకు, మరో 50 శాతం విత్తనాలు ఇతర రైతులకు అందజేయనున్నారు.
పచ్చిరొట్ట వల్ల బహుళ ప్రయోజనాలు
పచ్చిరొట్ట ఎరువుల వల్ల పంటలకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయి. వ్యవసాయ పంట భూముల్లో మితిమీరిన రసాయన ఎరువుల వాడడం వల్ల నేలలో పంటలకు మేలుచేసే సూక్ష్మజీవులు నశిస్తున్నాయి. నేలలో భూసారం తగ్గిపోయి, భూమిలో పోషకాల లోపం, చీడపీడలు తాకిడి పెరిగిపోతోంది. నేలలో సహజ భౌతిక లక్షణాలు దెబ్బతిని వాతావరణ కాలుష్యం అధికమవుతోంది. ఈ సమస్యలన్నింటిని అధిగమించేందుకు తక్కువ ఖర్చుతో సమగ్ర పోషకాల యాజమాన్యంలో పచ్చిరొట్ట పైరు ప్రధాన భూమిక పోషిస్తోంది. పచ్చిరొట్ట పెంపకం వల్ల భూసారం పెరుగుతుంది. రానున్న ఖరీఫ్‌కి వ్యవసాయ భూములను సిద్ధం చేసుకుంటున్న రైతులు వేసవి దుక్కులు చేసుకుని పచ్చిరొట్ట ఎరువు పైర్లు వేసుకుంటే నాటిన పంటల నుంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు.
నాట్లుకి ఇదే అదును
పచ్చిరొట్ట పైరు కోసం తొలకరి వర్షాలు మొదలైన వెంటనే నాట్లు వేసుకుని పొలాలను ఖరీఫ్ సీజన్‌కి సిద్ధం చేసుకోవాలి. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో ఈ వారంలోనే పచ్చిరొట్ట ఎరువు నాట్లు వేసుకోవాలి. సాధారణ దిగుబడి రావడానికి కనీసం 45 రోజులు సమయం పడుతుంది. పూత దశలో కలియదున్నినప్పుడు అత్యధికంగా పొలాల్లో భూసారం పెరుగుతుంది. పొలంలో నీరు చేరిన వెంటనే పచ్చిరొట్ట పైరును కలియదున్నడం పూర్తిచేయాలి. కలియదున్నేందుకు ట్రాక్టర్లు డిస్క్‌ల ద్వారాగాని, కర్రనాగళ్లతో గాని దుక్కిచేసుకోవచ్చు. నత్రజని వృథాగా పోకుండా ఉండడానికి కనీసం 15 నుంచి 22 సెంటీమీటర్ల లోతులో పచ్చిరొట్ట ఎరువు పైర్లును కలియదున్నుకోవాలి.
Updated Date - May 08 , 2025 | 11:05 PM