విశాఖలో యోగాకు 60 వేల మంది
ABN, Publish Date - Jun 18 , 2025 | 01:40 AM
విశాఖపట్నంలో ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి జిల్లా నుంచి 60 వేల మందిని తరలించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు.
జిల్లా నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలి
జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర
మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష
జిల్లా నుంచి 825 బస్సులు: కలెక్టర్
అనకాపల్లి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నంలో ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి జిల్లా నుంచి 60 వేల మందిని తరలించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, హోం మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ సీఎం రమేశ్, అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ వేదికగా సుమారు ఐదు లక్షల మందితో నిర్వహించే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబునాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి తరలించే వారి కోసం రవాణా సదుపాయం, ఇతర ఏర్పాట్లు చేయాలని సూచించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ, జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలన్నారు. హోం మంత్రి అనిత మాట్లాడుతూ, విశాఖలో నిర్వహించే యోగా దినోత్సవం కోసం నెల రోజుల నుంచి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ, విశాఖకు ప్రజలను తరలించే క్రమంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పారు.
జిల్లా నుంచి 825 బస్సులు
కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ, విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు జిల్లా నుంచి 825 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యార్థులను తీసుకెళ్లే బస్సుల్లో ప్రతి బస్సుకు ఇద్దరు ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని డీఈఓను ఆదేశించారు. విద్యార్థులను విశాఖ తీసుకెళ్లి, కార్యక్రమం ముగిసిన తరువాత తిరిగి ఇళ్లకు చేర్చే బాధ్యత ఉపాధ్యాయులదేనని స్పష్టం చేశారు. అచ్యుతాపురం, పరవాడ పారిశ్రామిక ప్రాంతాల నుంచి 25 వేల మంది ఉద్యోగులు, కార్మికులను యోగా దినోత్సవానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ, యోగా దినోత్సవానికి అనకాపల్లి జిల్లా నుంచి బస్సులు వెళ్లేందుకు రెండు రూట్‌లను కేటాయించామన్నారు. ఒకటి సబ్బవరం, పెందుర్తి మీదుగా, రెండోది గాజువాక, ఎన్‌ఏడీ జంక్షన్ మీదుగా బీచ్ రోడ్డుకు వెళ్లేలా రూట్‌మ్యాప్ రూపొందించామని తెలిపారు. సమావేశానికి ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేశ్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్, బండారు సత్యనారాయణమూర్తి, కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, కార్పొరేషన్ల చైర్మన్లు బత్తుల తాతయ్యబాబు, పీలా గోవింద సత్యనారాయణ, ప్రగడ నాగేశ్వరరావు, మళ్ల సురేంద్ర, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
Updated Date - Jun 18 , 2025 | 01:40 AM