రెండు నెలల్లో 5,000 రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు
ABN, Publish Date - Jul 01 , 2025 | 01:24 AM
ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) మే, జూన్ నెలల్లో పీఎం సూర్యఘర్ పథకం కింద ఐదు వేల సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటుచేసినట్టు సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు.
అపార్ట్టుమెంట్లలో ఉంటున్న వారికి వర్చువల్ నెట్ మీటరింగ్
ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్
విశాఖపట్నం, జూన్ 30 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) మే, జూన్ నెలల్లో పీఎం సూర్యఘర్ పథకం కింద ఐదు వేల సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటుచేసినట్టు సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, డిస్కమ్ పరిధిలో 2024 నుంచి 2025 ఏప్రిల్ వరకూ పది వేల రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటుచేయగా, ఆ తరువాత రెండు నెలల్లో మరో 5 వేలు...మొత్తం 15 వేలు పూర్తి చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పది వేల సోలార్ ప్లాంట్లు పెట్టాలని లక్ష్యం ఇవ్వడంతో ‘వర్చువల్ నెట్ మీటరింగ్’కు కూడా అనుమతిస్తామని చెప్పారు. సాధారణంగా ఈ పథకం కింద సొంత ఇంటి పైకప్పుపై సోలార్ ప్లాంటు ఏర్పాటు చేసుకోవాలని, అయితే అపార్టుమెంట్లలో ఉంటున్నవారు సొంతంగా వీటిని పెట్టుకోవాలని ఆసక్తి చూపుతున్నా మిగిలిన ఫ్లాట్ల వారి నుంచి అభ్యంతరాల వల్ల సాధ్యం కావడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వారికి అదే డివిజన్ పరిధిలో ఎక్కడైనా మరో సొంత ఇల్లు ఉంటే...అక్కడ రూఫ్‌టాప్ సోలార్ ప్లాంటు ఏర్పాటు చేసుకుంటే అక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపించి, అంతే మొత్తం యూనిట్లను అపార్టుమెంట్ ఫ్లాటులో ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. దీనినే ‘వర్చువల్ నెట్ మీటరింగ్’ అంటామన్నారు. రూఫ్ టాప్ సోలార్ ప్లాంటుకు ఒక్కసారి పెట్టుబడి పెడితే ఇరవై ఏళ్ల వరకు దానిని ఉపయోగించుకోవచ్చునని, దానివల్ల విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గుతుందన్నారు.
రాయితీగా రూ.115 కోట్లు
ఇప్పటివరకూ 15,120 సోలార్ ప్లాంట్ల ద్వారా 50,002 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్‌ను ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేయడం వల్ల ఆ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీగా రూ.115 కోట్లు వచ్చిందని సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. విశాఖపట్నంలో జిల్లాలో 2,056 మందికి, శ్రీకాకుళం జిల్లాలో 1,650 మందికి, పార్వతీపురం మన్యం జిల్లాలో 289 మందికి, విజయనగరం జిల్లాలో 1,549 మందికి, అనకాపల్లి జిల్లాలో 1,239 మందికి, అల్లూరి మన్యం జిల్లాలో తొమ్మిది మందికి ఈ రాయితీ వచ్చిందన్నారు. కిలోవాట్ సామర్థ్యం కలిగిన ప్లాంటు ఏర్పాటు చేసుకోవాలంటే కనీసం పైకప్పుపై 100 చ.అ. విస్తీర్ణం కలిగిన స్థలం ఉండాలన్నారు. ఒక కిలోవాట్‌కు రూ.30 వేలు, రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, మూడు కిలోవాట్లకు రూ.78 వేలు రాయితీ వస్తుందన్నారు. మూడు కిలోవాట్లు ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే నెలకు 360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఇంటి అవసరాలకు వాడుకోగా మిగిలిన విద్యుత్ సంస్థకు విక్రయించడం వల్ల అదనపు ఆదాయం కూడా వస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు.
Updated Date - Jul 01 , 2025 | 01:24 AM