ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

3 ఐటీ పార్కులు

ABN, Publish Date - Jul 24 , 2025 | 01:20 AM

ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు జిల్లాలో మూడు ప్రైవేటు కంపెనీలు ఐటీ పార్కులు నెలకొల్పనున్నాయని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ తెలిపారు.

మౌలిక వసతుల కల్పనకు ముందుకొచ్చిన

సిఫీ, సాత్వా, ఏఎన్‌ఎస్‌ఆర్‌ సంస్థలు

ఐటీ కంపెనీలను కూడా అవే తెచ్చుకుంటాయి

త్వరలో భూముల కేటాయింపు

అక్టోబరు నుంచి టీసీఎస్‌ కార్యకలాపాలు

నవంబరులో టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ కార్యాలయాలకు భూమి పూజ

వచ్చే నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా టాటా ఇన్నోవేషన్‌ హబ్‌, హెలికాప్టర్‌ మ్యూజియం ప్రారంభం

వచ్చే నెల 15న బంగారు కుటుంబాలకు సాయం అందించే కార్యక్రమం ప్రారంభం

కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌

విశాఖపట్నం, జూలై 23 (ఆంధ్రజ్యోతి):

ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు జిల్లాలో మూడు ప్రైవేటు కంపెనీలు ఐటీ పార్కులు నెలకొల్పనున్నాయని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ తెలిపారు. పార్కులు నెలకొల్పేందుకు సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్‌ లిమిటెడ్‌, సాత్వా డెవలపర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ఏఎన్‌ఎస్‌ఆర్‌ గ్లోబల్‌ కార్పొరేషన్‌ సంస్థలు ముందుకు వచ్చాయని, వారికి త్వరలో భూములు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బుధవారం తన ఛాంబర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ మధురవాడ ఐటీ పార్కు, వీఎంఆర్‌డీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్‌లు, కాపులుప్పాడల్లో ఆయా సంస్థలకు భూములు కేటాయిస్తామన్నారు. ప్రతి పార్కులో ఐటీ కంపెనీల నిర్వహణకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తారని, సంస్థలు నేరుగా అక్కడకు వచ్చి కార్యకలాపాలు చేపట్టవచ్చునన్నారు. పార్కులు ఏర్పాటుచేసే సంస్థలే ఐటీ కంపెనీలను కూడా తీసుకువస్తాయన్నారు. ఐటీ కంపెనీలు రావడంతో ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయన్నారు. కాపులుప్పాడలో రహేజా సంస్థ కూడా మౌలిక వసతుల కల్పనకు సంసిద్ధత వ్యక్తంచేసిందన్నారు.

టీసీఎస్‌ సంస్థ రుషికొండ ఐటీ హిల్స్‌లో కేటాయించిన భవనంలో వసతులు సమకూర్చుకుంటుం దన్నారు. ఏపీఐఐసీ ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తోందన్నారు. బహుశా ఈ ఏడాది అక్టోబరు నుంచి టీసీఎస్‌ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందన్నారు. నవంబరులో విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సులో టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, మరికొన్ని ఐటీ కంపెనీలకు కేటాయించిన భూముల్లో భూమి పూజ చేయనున్నాయని తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా పలు కంపెనీలు విశాఖ నుంచి ఆపరేషన్స్‌ ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నాయని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఐటీ కంపెనీల కోసం సుమారు 200 ఎకరాలు సిద్ధంగా ఉంచామన్నారు.

ఆర్కే బీచ్‌రోడ్డు సమీపాన లులూ గ్రూపు నెలకొల్పనున్న షాపింగ్‌ మాల్‌ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. వచ్చే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నగరానికి రానున్నారని, ఈ సందర్భంగా రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌, బీచ్‌రోడ్డులో వీఎంఆర్‌డీఎ ఏర్పాటుచేసిన హెలికాఫ్టర్‌ మ్యూజియం, ఇతర ప్రాజెక్టులను ప్రారంభిస్తారన్నారు. జిల్లాలో పీ-4లో భాగంగా గుర్తించిన 73 వేల బంగారు కుటుంబాలను మార్గదర్శకులతో అనుసంధానం చేసే ప్రక్రియ వేగంగా జరుగుతుందన్నారు. ఇప్పటివరకూ 26 వేల కుటుంబాల కోసం 2600 మంది మార్గదర్శకుల ఎంపిక పూర్తయిందన్నారు. బంగారు కుటుంబాలకు ఎటువంటి సాయం కావాలనే దానిపై రూట్స్‌ అనే యాప్‌ ద్వారా సర్వే జరుగుతుందన్నారు. ఎవరికి ఎటువంటి సాయం కావాలి?...అనేది సర్వేలో తేలిన తరువాత ఆయా కుటుంబాలకు చేయూత అందించే ప్రక్రియ మొదలవుతుందన్నారు. వచ్చే నెల 15వ తేదీన బంగారు కుటుంబాలకు సాయం అందించే కార్యక్రమం ప్రారంభించాలని యోచిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. కేజీహెచ్‌లో సీఎస్సార్‌ నిధులతో చేపట్టిన పనులపై అధికారుల పర్యవేక్షణ ఉండేలా ఆదేశాలు ఇస్తామన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 01:20 AM