గుర్రపు స్వారీకి 3 కోట్లు ధారాదత్తం!
ABN, Publish Date - Jun 27 , 2025 | 01:00 AM
జీవీఎంసీ గత పాలకులు తమ వ్యక్తిగత ప్రయోజనం కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు.
జీవీఎంసీలో గత పాలకుల ఇష్టారాజ్యం
ప్రజాధనం దుర్వినియోగం
కౌన్సిల్ అనుమతి లేకుండానే ముడసర్లోవ పార్కులో రూ.ఆరు కోట్లతో ప్రాజెక్టుకు శ్రీకారం
అంతమొత్తం వెచ్చించడంపై విమర్శలు
కూటమి ప్రభుత్వం రాగానే నిలిపివేత
అప్పటికే కాంట్రాక్టర్‌కు రూ.3 కోట్లు చెల్లింపులు
ఆ డబ్బును రికవరీ చేయాలనే డిమాండ్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ గత పాలకులు తమ వ్యక్తిగత ప్రయోజనం కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. కౌన్సిల్ ఆమోదం లేకుండా ముడసర్లోవ వద్ద రూ.6 కోట్ల వ్యయంతో గుర్రపు స్వారీ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. అంతమొత్తం వెచ్చించడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రాజెక్టును నిలిపివేసింది. అయితే అప్పటికే కాంట్రాక్టర్‌కు రూ.3 కోట్లు చెల్లించేసినట్టు బయటపడింది. ఆ మొత్తాన్ని ఇప్పుడు ఎవరి నుంచి రికవరీ చేస్తారనే చర్చ నడుస్తోంది.
నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలంటే పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా గుర్రపు స్వారీని కూడా అందుబాటులో ఉంచాలని జీవీఎంసీ గత కమిషనర్ పి.సాయికాంత్‌వర్మ భావించారు. అందుకోసం ముడసర్లోవ పార్కు వద్ద కొంతస్థలాన్ని కేటాయించారు. దీనికి కౌన్సిల్ నుంచి అనుమతి తీసుకోకుండా రూ.ఆరు కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ఒక కాంట్రాక్టర్‌కు అప్పగించేశారు. పార్కులో కాంక్రీట్ పనులు చేపట్టడంతో కొందరు పర్యావరణవేత్తలు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దాంతో అసలు ఆ ప్రాజెక్టుకు ఎవరు అనుమతి ఇచ్చారనే ప్రశ్నలు తలెత్తాయి. కౌన్సిల్ సమావేశంలో సభ్యులు దీనిపై నిలదీయడంతో అప్పటి కమిషనర్ సాయికాంత్‌వర్మ ప్రాజెక్టు ఎంతో మంచిదని, దీనివల్ల పర్యాటకాభివద్ధి జరుగుతుందని వివరించారు. అసలు కౌన్సిల్ అనుమతి లేకుండా ఎలా పనులు ప్రారంభిస్తారని సభ్యులు నిలదీయడంతో మేయర్ ముందస్తు అనుమతి ఇచ్చారంటూ సమాధానం చెప్పారు. అయితే తాను గుర్రపుస్వారీ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదని అప్పటి మేయర్ గొలగాని హరివెంకటకుమారి వివరణ ఇచ్చారు. ఇద్దరిలో ఎవరు చెప్పింది వాస్తవమో తేల్చాలంటూ మేయర్‌తోపాటు కమిషనర్‌ను సభ్యులు డిమాండ్ చేశారు. ఆ తరువాత ఆ అంశం మరుగునపడిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంత మొత్తంతో గుర్రాలపార్కు ఏర్పాటుచేయాల్సిన అవసరం లేదని సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ప్రాజెక్టును నిలిపివేసింది. అయితే అందుకోసం వెచ్చించిన రూ.3 కోట్ల ప్రజా ధనాన్ని బాధ్యులైన వారి నుంచి రికవరీ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. అప్పటి కమిషనర్ సాయికాంత్‌వర్మ నుంచి ఆ నిధులను రికవరీ చేయాలని కొందరు, మేయర్ నుంచి వసూలు చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఏదిఏమైనా భవిష్యత్తులోనైనా ప్రజాఽధనం దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్టవేయాలంటే చట్ట ప్రకారం అనుసరించాల్సిన ప్రక్రియను పక్కనపెట్టి గుర్రపు స్వారీ కోసం డబ్బును దుర్వినియోగం చేసిన వారి నుంచి రికవరీ చేయాల్సిన అసవరం ఉందని కార్పొరేటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు.
Updated Date - Jun 27 , 2025 | 01:00 AM