115 కిలోల గంజాయి స్వాధీనం
ABN, Publish Date - Apr 24 , 2025 | 01:00 AM
ఒడిశా నుంచి పొరుగు రాష్ట్రానికి ఎగుమతి చేస్తున్న 115 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశామని ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. బు
నలుగురి అరెస్టు
పొరుగు రాష్ట్రానికి తరలిస్తుండగా పట్టివేత
ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా
చింతపల్లి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి పొరుగు రాష్ట్రానికి ఎగుమతి చేస్తున్న 115 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశామని ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు అన్నవరం పోలీసులు మంగళవారం సాయంత్రం సోమవరం గ్రామ శివారులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై, వారి వెనుక మరో ఇద్దరు వ్యక్తులు ఆటోలో వస్తూ పోలీసులను గమనించి వెనక్కి వెళ్లిపోయే ప్రయత్నం చేశారన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకున్నారన్నారు. ఆటోను తనిఖీ చేయగా 115 కిలోల గంజాయి లభ్యమైందని చెప్పారు. గంజాయి, ఆటో, ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టామన్నారు. పట్టుబడిన నలుగురు వ్యక్తులు ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేసి పాడేరు వరకు తరలించి బెంగళూరుకు చెందిన వ్యాపారికి అందజేసేందుకు తరలిస్తున్నట్టు చెప్పారన్నారు. గంజాయి రవాణాపై బెంగళూరు వ్యాపారితో సహా పట్టుబడిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. పట్టుబడిన నలుగురు వ్యక్తులను కోర్టుకు తరలించామని, పరారీలో ఉన్న బెంగళూరు వ్యాపారి కోసం ప్రత్యేక సిబ్బందితో గాలిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సీఐ ఎం.వినోద్‌బాబు, అన్నవరం ఎస్‌ఐ వీరబాబు పాల్గొన్నారు.
పెదబయలులో 65 కిలోల గంజాయి పట్టివేత
పెదబయలు: స్థానిక సీతగుంట ఏవోబీ వంతెన వద్ద బుధవారం ఉదయం 65 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్టు పెదబయలు ఎస్‌ఐ కొల్లి రమణ తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. సీతగుంట ఏవోబీ వంతెన వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అటుగా ఓ ఆటో వచ్చింది. దానిని ఆపి తనిఖీ చేయగా అందులో 65 కిలోల గంజాయి లభ్యమైంది. ఆటోలో ఉన్న ఒడిశా కోరాపుట్ జిల్లా నందపూర్ బ్లాక్ మర్రిపాలెం గ్రామానికి చెందిన లబో కిండంగ్, అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలానికి చెందిన బురిడి అర్జున్‌లను అరెస్టు చేశారు. గంజాయిని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పరిధిలో మల్కరిపుట్ గ్రామంలో జట్టు అనే వ్యక్తి నుంచి తీసుకొని పాడువలో విక్రయించడానికి వెళుతున్నట్టు నిందితులు తెలిపారని ఎస్‌ఐ చెప్పారు.
Updated Date - Apr 24 , 2025 | 01:00 AM