ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jobs Growth: ఉద్యోగాల కల్పనలో విశాఖ టాప్‌

ABN, Publish Date - Jul 16 , 2025 | 04:23 AM

ఉద్యోగాల కల్పన అసాధారణ స్థాయిలో వృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రాంతాల ఆధారంగా తొలిసారి ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌.. లింక్డ్‌ఇన్‌ ‘సిటీస్‌ ఆన్‌ ది రైజ్‌-2025’ నివేదికను రూపొందించింది.

  • ఫార్మా, ఐటీ రంగాల్లో నియామకాల జోరు

  • స్థానిక ప్రతిభకు తోడ్పాటునందిస్తున్న కంపెనీలు

  • ప్రధాన నగరాలకు దీటుగా టైర్‌-2, టైర్‌-3 సిటీలు

  • పెద్ద పెద్ద డేటా కంపెనీలను ఆకర్షిస్తున్న విశాఖ

  • బెజవాడకు పెరిగిన భక్తులు, పర్యాటకుల సంఖ్య

  • టాప్‌-10 నగరాలతో లింక్డ్‌ఇన్‌ జాబితా విడుదల

  • మూడో స్థానంలో బెజవాడ

అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): ఉద్యోగాల కల్పన అసాధారణ స్థాయిలో వృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రాంతాల ఆధారంగా తొలిసారి ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌.. లింక్డ్‌ఇన్‌ ‘సిటీస్‌ ఆన్‌ ది రైజ్‌-2025’ నివేదికను రూపొందించింది. దేశవ్యాప్తంగా మొత్తం పది నగరాల పేర్లున్న ఈ జాబితాలో విజయవాడ మూడోస్థానం దక్కించుకుంది. ఈ నివేదికలోని వివరాల ప్రకారం... మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఊపందుకోవడం, మెరుగైన రహదారులు, విమాన సౌకర్యాలు ఉండటంతో దేశంలోని టైర్‌-2, టైర్‌-3 నగరాలు శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. దీంతో ఈ నగరాల్లో తమ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి అనేక కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న హెచ్‌సీఎల్‌, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, లారస్‌ ల్యాబ్స్‌ లిమిటెడ్‌ వంటి ఐటీ, ఫార్మా కంపెనీలు విశాఖ, విజయవాడల్లో ఉద్యోగ కల్పనలో కీలకంగా ఉన్నాయి. టెక్నాలజీ కంపెనీలతో పాటు పెద్దపెద్ద డేటా, ఫార్మా కంపెనీలను విశాఖపట్నం ఆకర్షిస్తోంది. విశాఖలో మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రభుత్వం చేస్తోన్న కసరత్తు కూడా ఇందుకు దోహదం చేస్తోందని ఆ నివేదిక పేర్కొంది. ఇక విజయవాడకు వస్తున్న పర్యాటకులు, భక్తుల సంఖ్య బాగా పెరిగింది. ఐటీ కంపెనీల రాకతో పాటు, మెట్రో రైలు ఏర్పాటు, ఎయిర్‌పోర్టు విస్తరణ తదితర అభివృద్ధి కార్యకలాపాలు ఉద్యోగావకాశాలను పెంచుతున్నాయి. ఈ ఏడాది ప్రతి ఐదుగురు భారతీయ నిపుణుల్లో నలుగురు తాము చేస్తున్న ఉద్యోగం మారాలని చూస్తున్న నేపథ్యంలో ప్రధాన నగరాలకు దీటుగా టైర్‌-2, టైర్‌-3 నగరాల్లో వస్తున్న అవకాశాలు వారికి దిశానిర్దేశం చేస్తున్నాయని లింక్డ్‌ఇన్‌ తెలిపింది. స్థానికంగా తమ కెరీర్‌ను మార్చుకోవాలని, కొత్త పరిశ్రమలు ప్రారంభించడంతో పాటు ఇప్పటికే ఉన్నవాటిని అభివృద్ధి చేయాలని భావించే వారికి ఈ జాబితా ఉపయోగపడుతుందని పేర్కొంది.

నివేదికలోని ముఖ్యమైన అంశాలివీ...

  • మిరాకిల్‌ సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్‌, ఇంక్‌(విశాఖ), హెచ్‌సీఎల్‌ టెక్‌ (విజయవాడ, మదురై), ఇన్ఫోసిస్‌ (విజయవాడ), డేటామాటిక్స్‌ (నాసిక్‌), బుల్‌ ఐటీ సర్వీసెస్‌ (మదురై) వంటి టెక్‌ కంపెనీలు టైర్‌-2, టైర్‌-3 నగరాల్లో తమ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నాయి. స్థానిక ప్రతిభకు తోడ్పాటు అందిస్తున్నాయి.

  • డాక్టర్‌ రెడ్డీస్‌ లాబోరేటరీస్‌, లారస్‌ ల్యాబ్స్‌ లిమిటెడ్‌, ఆలెంబిక్‌ ఫార్మా లిమిటెడ్‌, సన్‌ఫార్మా వంటి హెల్త్‌కేర్‌, ఫార్మా కంపెనీలు విశాఖ, వడోదరలో అవకాశాలు కల్పిస్తున్నాయి. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు రాయ్‌పూర్‌, ఆగ్రా, జోధ్‌పూర్‌లో ఆర్థిక సేవల వృద్ధిని వేగవంతం చేస్తున్నాయి.

  • విశాఖ, విజయవాడ, మదురైలోని ఇంజనీరింగ్‌ నిపుణులకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. టైర్‌-2, టైర్‌-3 నగరాల్లో విద్య, సేల్స్‌, వ్యాపార రంగాలకు చెందిన నిపుణులు ఉద్యోగాల వేటలో ఉన్నారు.

సిటీస్‌ ఆన్‌ ది రైజ్‌-2025 జాబితా ఇదీ..

1. విశాఖపట్నం, 2. రాంచీ, 3. విజయవాడ, 4. నాసిక్‌, 5. రాయ్‌పూర్‌, 6. రాజ్‌కోట్‌, 7. ఆగ్రా, 8. మదురై, 9. వడోదర, 10. జోధ్‌పూర్‌

Updated Date - Jul 16 , 2025 | 04:24 AM