Kakinada Port : విక్రాంత్‌రెడ్డిదే కీలక పాత్ర!
ABN, Publish Date - Feb 11 , 2025 | 06:08 AM
కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేవీఆర్ గ్రూపునకు చెందిన కర్నాటి వెంకటేశ్వరరావు(కేవీరావు)ను బెదిరించి...
కాకినాడ పోర్ట్, సెజ్‌లలో కేవీరావు వాటాలు అరబిందోకు బదలాయింపులో ప్రణాళిక ఆయనదే
ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తునకు ఆటంకం
పిటిషన్‌ను కొట్టివేయండి.. హైకోర్టులో సీఐడీ కౌంటర్
అమరావతి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్ లోని వాటాలను.. కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేవీఆర్ గ్రూపునకు చెందిన కర్నాటి వెంకటేశ్వరరావు(కేవీరావు)ను బెదిరించి, భయపెట్టి బలవంతంగా అరబిందోకు బదలాయించడంలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని సీఐడీ హైకోర్టుకు నివేదించింది. కేవీరావు ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ విక్రాంత్‌రెడ్డి వేసిన పిటిషన్‌లో ఈ మేరకు తాజాగా కౌంటర్ వేసింది. ‘కేవీరావు ఆరోపించినట్లు అప్పటి సీఎం జగన్ ప్రోద్బలంతోనే విక్రాంత్‌రెడ్డి జోక్యం చేసుకుని వాటాల బదిలీకి ప్రణాళిక రచించినట్లు కనపడుతోంది. షేర్ల బదిలీ విషయంలో తాను చెప్పినట్లు నడుచుకోకుంటే క్రిమినల్ కేసులు పెట్టి, చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తామని, హానితలపెడతామని కేవీరావును ఆయన బెదిరించారు. అప్పటి ముఖ్యమంత్రి తరఫున షేర్లను సేకరిస్తున్నట్లు చెప్పారు. వాటాలను అరబిందోకు బదలాయించడం ద్వారా కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌కు రూ.3,666 కోట్లు, కాకినాడ సెజ్‌కు రూ.1109 కోట్లు మొత్తం రూ.4,775 కోట్ల నష్టం జరిగింది. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.965.65 కోట్ల నష్టం వాటిల్లిందని పీకేఎఫ్ శ్రీధర్ ఆడిట్ సంస్థ తప్పుడు నివేదిక ఇచ్చింది. అరబిందోకు వాటాల బదిలీ అనంతరం రూ.9.03 కోట్లే నష్టం వాటిల్లినట్లు సవరించిన రిపోర్టు ఇచ్చింది. ఎవరు చెబితే తప్పుడు నివేదిక ఇచ్చింది..
ఈ మొత్తం వ్యవహారంలో అంతిమంగా ఎవరు లబ్ధి పొందారో తేల్చేందుకు విక్రాంత్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంది. కేవీరావు వాటాలను బదలాయించుకునేందుకు నిందితులందరూ కలిసి భారీ కుట్ర పన్నారు. పిటిషనర్ పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుంది. ఆయన వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు. సాక్షులను బెదిరించి సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని విక్రాంత్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయండి’ అని సీఐడీ అభ్యర్థించింది.
Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?
Updated Date - Feb 11 , 2025 | 06:08 AM