Ap Police : వంశీ ఇంట్లో సుదీర్ఘ సోదాలు
ABN, Publish Date - Feb 16 , 2025 | 03:35 AM
అరెస్టుకు ముందు పోలీసుల నుంచి నోటీసు అందుకున్న తర్వాత తన సెల్ ఫోన్లను ఆయన మాయం చేశారు వాటి కోసం విజయవాడ...
గచ్చిబౌలి ఇంట్లో సెల్‌ఫోన్ల కోసం గాలింపు
అరెస్టుకు ముందు నోటీసు అందుకోగానే వైసీపీ నేతలు, చానళ్లకు కాల్స్
తర్వాత వాటిని మాయం చేసిన వైనం
మైహోమ్ భూజాలో సీసీటీవీల పరిశీలన
ఇంట్లో కీలక ఆధారాల సేకరణ
సత్యవర్ధన్‌ను విజయవాడ కోర్టు నుంచి ఇక్కడికే తరలించినట్లు గుర్తింపు
విజయవాడ/రాయదుర్గం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ గచ్చిబౌలిలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో విజయవాడ పోలీసులు శనివారం సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు. అరెస్టుకు ముందు పోలీసుల నుంచి నోటీసు అందుకున్న తర్వాత తన సెల్ ఫోన్లను ఆయన మాయం చేశారు వాటి కోసం విజయవాడ పటమట పోలీసులు వేట మొదలుపెట్టారు. ఇన్‌స్పెక్టర్, ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లతో వెళ్లిన బృందం రాయదుర్గం పోలీసుల సహకారంతో గచ్చిబౌలిలోని మైహోమ్ భూజా గేటెడ్ కమ్యూనిటీ 11వ అంతస్తులోని వంశీ ఇంట్లో తనిఖీలు నిర్వహించింది. గంటన్నర సోదాలు జరిపి కీలక ఆధారాలు సేకరించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడి కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న ముదునూరి సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి, బెదిరించి.. ఫిర్యాదుతో తనకు సంబంధం లేదంటూ ఆయనతో న్యాయాధికారికి అఫిడవిట్ ఇప్పించాక.. ఆయన్ను కారులో హైదరాబాద్‌కు తరలించారని పోలీసులు కోర్టుకు ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సత్యవర్ధన్‌ను తీసుకెళ్లిన కారును ఇప్పటికే వారు గుర్తించారు. మైహోం భూజాలోకి ఏ మార్గంలో తీసుకెళ్లారో ఆరా తీస్తున్నారు. అందులో మూడు సెల్లార్లున్నాయి. ఎఫ్ బ్లాక్‌కు సంబంధించిన పార్కింగ్ సెల్లార్‌కు వెళ్లే.. వచ్చే మార్గాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. వంశీ ఇంట్లో ఫోన్లను ఎక్కడ రహస్యంగా ఉంచారో తెలుసుకునేందుకు సోదాలు నిర్వహించారు. ఏడీసీపీ జి.రామకృష్ణ ఈ నెల 13న హైదరాబాద్‌లో వంశీ ఇంటికి వెళ్లి ఆయనకు 47ఏ నోటీసు అందజేసిన విషయం తెలిసిందే. అది అందుకున్నాక.. వంశీ డ్రెస్ మార్చుకొని వస్తానని చెప్పి బెడ్ రూమ్‌లోకి వెళ్లి సుమారు 45 నిమిషాలు ఫోన్‌లో పలువురితో మాట్లాడారు.
తర్వాత దానిని మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వంశీని ఎలాంటి ఆటంకాలు లేకుండా అరెస్టు చేసి విజయవాడకు తరలించాలన్న హడావుడిలో పోలీసులు వంశీ ఫోన్‌ను స్వాదీనం చేసుకోలేదు. విజయవాడ చేరుకున్నాక ఫోన్ ఇవ్వాలని కోరగా.. ఆయన తన వద్ద లేదని చెప్పారు. కేసుకు సంబందించిన కీలక సమాచారం ఫోన్ ద్వారా తెలిసే అవకాశం ఉండటంతో పాటు ఇంకా విలువైన సమాచారం లభించే అవకాశం ఉండడంతో పోలీసులు గచ్చిబౌలిలో తనిఖీలు నిర్వహించారు. ఇంట్లోని సీసీ ఫుటేజ్‌ను స్వాదీనం చేసుకున్నట్లు సమాచారం. ఆయన దాదాపు 5 ఫోన్లు ఉపయోగిస్తున్నట్లు అనుమానిస్తున్నా రు. వాటిని ల్యాబ్‌కు పంపితే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడ్డారు. వంశీ అనుచరుల అరెస్టుకు ఒక బృందం, వంశీవద్ద కీలక సమాచారాన్ని సేకరించే పనిలో ఇంకో బృందం ఉన్నట్లు సమాచారం.
Updated Date - Feb 16 , 2025 | 03:35 AM