ఎంపీ బాలశౌరి పీఏ మోసంపై బాధితుల ధర్నా
ABN, Publish Date - Aug 03 , 2025 | 01:31 AM
మచిలీపట్నం జనసేన పార్టీ ఎంపీ వల్లభనేని బాలశౌరి కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేయడంపై బాధితులు శనివారం ధర్నాకు దిగారు. మచిలీపట్నం మెడికల్ కళాశాల, కృష్ణా యూనివర్సిటీ, విద్యుత సబ్‌స్టేషన్‌లల్లో ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షలు వరకు గోపాల్ సింగ్ వసూలు చేశాడని ఆరోపించారు. తమకు ఉద్యోగాలు వద్దు.. కట్టిన డబ్బులు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
-ఉద్యోగాల పేరుతో రూ.లక్షలు వసూలు చేసిన గోపాల్ సింగ్
- డబ్బు కట్టిన వారికి నకిలీ నియామక పత్రాలు అందజేత
- నేను చెప్పినప్పుడు ఆయా ఆఫీసులకు వెళ్లి ఉద్యోగంలో చేరాలని మెలిక
- పలువురు నిలదీయడంతో విజయవాడ రావాలని చెప్పి పత్తాలేకుండా పరార్
- మీకు డబ్బులు ఇప్పిస్తామని బందరు రావాలని మరో ఉద్యోగి పిలుపు
- వచ్చిన తర్వాత మా వల్ల కాదంటూ పోలీస్ కేసు పెట్టుకోవాలని సలహా
- దీంతో ఎంపీ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన
-ఉద్యోగాలు వద్దు.. కట్టిన డబ్బులు తిరిగి ఇప్పించాలని డిమాండ్
- పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో ధర్నా విరమణ
మచిలీపట్నం జనసేన పార్టీ ఎంపీ వల్లభనేని బాలశౌరి కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేయడంపై బాధితులు శనివారం ధర్నాకు దిగారు. మచిలీపట్నం మెడికల్ కళాశాల, కృష్ణా యూనివర్సిటీ, విద్యుత సబ్‌స్టేషన్‌లల్లో ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షలు వరకు గోపాల్ సింగ్ వసూలు చేశాడని ఆరోపించారు. తమకు ఉద్యోగాలు వద్దు.. కట్టిన డబ్బులు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరికి మచిలీపట్నంలో కార్యాలయం ఉంది. అక్కడ గోపాల్ సింగ్ అనే వ్యక్తి చాలాకాలంగా పనిచేస్తున్నాడు. ఎంపీ కార్యాలయానికి వచ్చేవారితో పరిచయాలు పెంచుకున్నాడు. ఎంపీ సిఫార్సు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని అందరినీ నమ్మించాడు. ఎంపీ సిఫార్సు చేసినా.. అధికారులకు కొంతనగదు ఇవ్వాల్సి ఉంటుందని, ఖర్చులు కొంతమేర ఉంటాయని చెప్పాడు. మచిలీపట్నం మెడికల్ కళాశాలలో కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్, ల్యాబ్ అసిస్టెంట్ తదితర పోస్టులు, విద్యుత సబ్ స్టేషన్‌ల్లో ఎలక్ర్టీషియన్ పోస్టులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వివిధ రకాల ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్‌లు జారీ అయ్యాయని, వీటిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. తనకు తెలిసిన వారి ద్వారా తెర వెనుక బేరాలు కుదుర్చుకున్నాడు. ఒక్కొక్క ఉద్యోగానికి రూ.1.50 లక్షల నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేశాడు. నగదు ఇచ్చే విషయంలో మధ్యవర్తుల వద్దకు వెళ్లవద్దని, నేరుగా తన బ్యాంకు ఖాతాకు, లేదా ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా నగదు జమచేయాలని కోరాడు. గత రెండు సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నగదు వసూలు చేశాడని బాధితులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ వచ్చిందని, ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వరని, కొంతకాలం పాటు వేచి ఉండాలని గోపాల్ సింగ్ చెబుతూ వచ్చాడని తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యాక ఇప్పుడే కదా ప్రభుత్వ ఏర్పడింది, కొంతకాలం వేచి ఉండాలని సాగదీస్తూ వచ్చాడని వారు అంటున్నారు. నగదు చెల్లించినా ఉద్యోగాలు రాకపోవడంతో నగదు చెల్లించిన వారు ఒత్తిడి చేయడంతో వైద్యశాఖలో, మెడికల్ కళాశాలలో, విద్యుత సబ్‌స్టేషన్‌లలో పోస్టులు ఇచ్చినట్లుగా అపాయింట్‌మెంట్ లెటర్లు తయారు చేసి, దానిపై నెలకు ఎంత జీతం ఇస్తారో కూడా రాసి ఇచ్చాడని బాధితులు తమ వద్ద ఉన్న పత్రాలను చూపారు. వీటిని మీ వద్ద ఉంచండి.. నేను చెప్పిన తేదీకి వస్తే ఆ మరుసటి రోజు నుంచే ఉద్యోగంలో చేరవచ్చని చెప్పాడని వాపోయారు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దని, అల్లరి చేయవద్దని, ఉద్యోగాలు ఇప్పించకపోయినా, మీ నగదు మీకు ఇప్పిస్తామని ఎంపీ కార్యాలయంలో పనిచేసే గరికపాటి శివ తమకు హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. శనివారం మచిలీపట్నంలోని ఎంపీ కార్యాలయానికి రావాలని చెప్పడంతో తామంతా వచ్చామని, ఇక్కడ తమకు సమాధానం చెప్పేందుకు ఎవ్వరూ అందుబాటులో లేరని బాధితులు తెలిపారు. ఎంపీ పీఏ శివకు ఫోన్ చేస్తే మిమ్మల్ని మోసం చేసిన గోపాల్ సింగ్ పోలీసుల అదుపులో ఉన్నాడని, మీరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పడంతో బాధితులు ఎంపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎంపీ కార్యాలయం వద్ద బాధితులు ఆందోళన చేస్తున్నారనే సమాచారంతో ఆర్‌పేట సీఐ ఏసుబాబు పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చారు. గోపాల్ సింగ్ మిమ్మల్ని మోసం చేసిన ఘటనపై ఇప్పటికే విచారణ చేస్తున్నామని, మీరు కూడా ఫిర్యాదు చేస్తే కేసు మరింతగా బలపడుతుందని, ఫిర్యాదు చేయాలని బాధితులకు సూచించారు. అయితే బాధితులు మాకు ఉద్యోగాలు వద్దని, తాము ఇచ్చిన నగదును తిరిగి ఇచ్చేవరకు ఆందోళనలు చేస్తూనే ఉంటామని చెప్పారు. ఈ విషయంపై అవనిగడ్డ ఎమ్మెల్యే వద్దకు, జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడే తేల్చుకుంటామని బాధితులు అన్నారు. ఎంపీ బాలశౌరి అంటే మాకు పూర్తి నమ్మకమని, ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళతామని చెప్పారు.
గోపాల్‌సింగ్ ఎంపీ పీఏగా పనిచేయడం లేదు
-జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు
మచిలీపట్నం టౌన్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాల పేరుతో నకిలీ నియామక పత్రాలు సృష్టించి ఇచ్చిన గోపాల్‌సింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి పీఏ కాదని జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు అన్నారు. శనివారం జనసేన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అవనిగడ్డ తదితర ప్రాంతాల్లో ఉద్యోగాలిప్పిస్తామని గోపాల్ సింగ్ చేసిన మోసంపై ఎంపీ వల్లభనేని బాలశౌరి తగిన చర్యలు తీసుకుంటారన్నారు. ఇప్పటికే గరికపాటి సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో గోపాల్‌సింగ్‌పై కేసు నమోదు చేశారన్నారు.
Updated Date - Aug 03 , 2025 | 01:31 AM