Prevention Tips: వణికిస్తున్న పార్కిన్సన్స్..
ABN, Publish Date - Jul 19 , 2025 | 07:08 AM
శరీరంలో మెదడు చాలా కీలకమైనది. అయితే వయస్సు పెరిగే కొద్దీ మన మెదడు పనితీరు తగ్గుతుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం తగ్గుతుంది. ఇలాంటి సమస్యలే పార్కిన్సన్స్‌కు దారితీస్తాయి.
మెదడుపై ప్రభావం చూపే రుగ్మత.. దీర్ఘకాలిక సమస్యగా పార్కిన్సన్స్
స్టేజ్-5లో మంచానికే పరిమితం..సమస్య ముదిరితే చేతులెత్తేస్తున్న వైద్యులు
ముందుజాగ్రత్త అవసరమంటున్న నిపుణులు
ఏపీలో ఇటీవల పెరుగుతున్న బాధితులు
పార్కిన్సన్స్... దీన్నే వణకుడు వ్యాధి లేదా కంపవాతం అని పిలుస్తారు. వృద్ధుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో చురుకుదనం తగ్గుతుంది. నడక నెమ్మదిస్తుంది. కుర్చీలో నుంచి లేవడమూ కష్టమవుతుంది. తేలికైన పనులు కూడా చేయలేరు. కొన్నిసార్లు శరీరంలోని ఒకవైపు భాగాలు వణుకుతుంటాయి. ఇలాంటి లక్షణాలను చాలామంది వయసు పైబడడం వల్ల వస్తుంటాయని భావిస్తుంటారు. కానీ.. ఇవి పార్కిన్సన్స్ లక్షణాలు కావొచ్చు..! పార్కిన్సన్స్ అనేది మెదడుకు సంబంధించిన రుగ్మత. ఇటీవల దీని బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలోనూ ఇది చాపకింద నీరులా విస్తరిస్తోంది..!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
శరీరంలో మెదడు చాలా కీలకమైనది. అయితే వయస్సు పెరిగే కొద్దీ మన మెదడు పనితీరు తగ్గుతుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం తగ్గుతుంది. ఇలాంటి సమస్యలే పార్కిన్సన్స్‌కు దారితీస్తాయి. మానవ శరీరంలో వేగస్ అనే నరం పేగులో ప్రారంభమై మెదడు వరకూ ఉంటుంది. పార్కిన్సన్స్ సమస్య తొలుత ఈ వేగస్ నరంలోనే మొదలవుతుంది. ప్రారంభంలో ఎలాంటి సమస్యా ఉండదు. కానీ.. కొన్నేళ్ల తర్వాత మెదడు ముఖ్యమైన డొపమైన్, ఎపినెప్రిన్ వంటి హార్మోన్లను విడుదల చేయడం తగ్గిస్తుంది. అప్పటి నుంచి పార్కిన్సన్స్ సమస్య మొదలైనట్టే. దీన్ని ముందుగానే గుర్తిస్తే స్టేజ్-5 వరకూ వెళ్లకుండా నయం చేసుకునే అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాప్రాయ స్థితి తప్పదు. మనిషి రోజువారీ పనులు చేసుకునేందుకు సహాయపడే డోపమైన్ హార్మోన్ మెదడు నుంచి తక్కువగా విడుదల కావడం వల్లనే పార్కిన్సన్స్ వ్యాధి వస్తుంది. 60 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. పార్కిన్సన్స్ స్త్రీలకంటే పురుషుల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఎవరైనా పార్కిన్సన్స్ బాధితులు ఉంటే ఇతరులకూ వచ్చే అవకాశం ఉంటుంది. గాలి కాలుష్యంతో పాటు మనం తినే ఆహారం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. ఈ రోజుల్లో వ్యవసాయంలో పురుగు మందుల వాడకం అధికమైంది. ఇలా పండించే ఆహార పదార్థల్లో విషపూరిత రసాయనాలు అధికంగా ఉంటాయి. అలాంటి ఆహా రం తినడం వల్ల కూడా మెదడులో డోపమైన్ రసాయనం ఉత్పత్తి తగ్గి పార్కిన్సన్స్ బారిన పడుతుంటారు.
వ్యాధి లక్షణాలు...
తల, చేతులు వణకడం పార్కిన్సన్స్ ప్రధాన లక్షణం. వీటితోపాటు శరీరంలో వణుకు, మాట తడబడడం, ఆహారం మింగడంలో ఇబ్బంది, వాసన కోల్పోవడం, నడకలో వేగం తగ్గిపోవడం, కదలికలు నెమ్మదించడం, కండరాలు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మూత్ర సంబంధమైన సమస్యలు, మలబద్ధకం, రక్తపోటులో హెచ్చుతగ్గులతో పాటు కుంగుబాటు, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి. ఆరంభ దశలో ఒకవైపు భాగాల్లోనే వణుకు ఉండొచ్చు. వ్యాధి ముదురుతున్న కొద్దీ రెండోవైపు కూడా వణుకు మొదలువుతుంది. శరీరంలో సమన్యయం కొరవడుతుంది. నియంత్రణ తప్పుతుంది. నడుస్తూ నడుస్తూ కిందపడిపోయే ముప్పు పెరుగుతుంది. నడక తీరు మారుతుంది. ముందుకు వంగిపోయి నడవాల్సి వస్తుంది. స్థిరంగా నిలబడడం, పక్కకు తిరగడం కష్టమవుతుంది. చాలా మందిలో పార్కిన్సన్స్ దీర్ఘకాలికంగా ఉంటుంది. కానీ బయటపడడానికి కొంత సమయం పడుతుంది. మరికొందరిలో త్వరగానే బయటపడుతుంది.
ముందుగానే గుర్తిస్తే మేలు..
మొదటి, రెండో దశలోనే 50 శాతం డ్యామేజ్ జరిగిందని నిర్ధారించుకోవాలి. ఇక మూడు, నాలుగు దశల్లో అడ్వాన్స్‌డ్ థెరపీతో 50 శాతం తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ స్టేజ్-5కు చేరుకున్నాక సుదీర్ఘకాలం మందులతో నడిపించడం తప్ప కోలుకోవడం కష్టం. అయితే డీప్ బ్రెయిన్ న్యూక్లియర్ సర్జరీతో స్టేజ్-5కి వెళ్లిన వారిని కూడా కాపాడే అవకాశం ఉంటుంది. 60 ఏళ్లు దాటిన వారిలో 80 శాతం మందికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. 40 ఏళ్లు దాటిన వారిలోనూ 20 శాతం మందికి ఈ సమస్య తలెత్తవచ్చు. వాయు కాలుష్యంలో ఎక్కువగా ఉండేవారికి, బ్యాటరీ, లెడ్ తయారీ కంపెనీల్లో పనిచేసేవారికి రావొచ్చు.
ఏపీలో 2 శాతం మందికి..
మన రాష్ట్రంలో రెండు శాతం మంది పార్కిన్సన్స్‌తో ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. బీపీ, షుగర్‌లాగే ఇదికూడా దీర్ఘకాలిక సమస్య. ఒక్కసారి వస్తే జీవితాంతం మందులు వాడుకోవాల్సిందే. తీవ్రమైన ఒత్తిడితో కూడిన జీవనశైలి, వయస్సు పెరగడం, వంశపారపర్యం, మెదడుకు దెబ్బ తగలడం, మెదడుకు ఇన్ఫెక్షన్ సోకడం, తలకు గాయాలు కావడం వల్ల పార్కిన్సన్స్ బారిన పడే ప్రమాదం ఉంది. అలాగే మెదడుకు రక్తప్రవాహం తగ్గడం, ఆల్కహాల్ వంటి ఇతర దురలవాట్ల వల్ల కూడా పార్కిన్సన్స్ రావొచ్చు. పార్కిన్సన్స్ తీవ్రమైతే బ్రెయిన్ ఫేస్ మేకర్ సర్జరీ చేయించుకోవాలి. లేదంటే ఏఫోమార్ఫిన్ ఇంజెక్షన్స్ ద్వారా కొంత మేరకు నయమవుతుంది. ఏపీలో చాలా తక్కువ మంది న్యూరాలజీ వైద్యులు ఈ వ్యాధికి చికిత్స అందిస్తున్నారు.
బీపీ, షుగర్‌లాగే ఇదీ దీర్ఘకాలిక సమస్యే..
‘‘పార్కిన్సన్ తీవ్రమైన అనారోగ్య సమస్యగా మారుతోంది. ఇది స్వల్ప లక్షణాలతోనే ప్రారంభమవుతుంది. నడస్తున్నప్పుడు, కూర్చుకున్నప్పుడు తెలియకుండానే ఒకవైపు తూలడం వంటివి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే నెమ్మదిగా స్టేజ్‌లు మారుతూ ప్రాణప్రాయ స్థితికి చేరుస్తుంది. ఏపీలో పార్కిన్సన్స్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. షుగర్, బీపీ మాదిరిగానే ఇది కూడా దీర్ఘకాలిక సమస్యే. కాబట్టి ప్రతిఒక్కరూ జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది.’’
- డాక్టర్ నవీన్ తోట, చీఫ్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్,
సెంటిని సిటీ హాస్పిటల్
దశల వారీగా వ్యాధి సంకేతాలు...
స్టేజ్ 1: తేలికపాటి సంకేతాలు, లక్షణాలు ఉంటాయి. నడుస్తున్నప్పుడు శరీరం ఒకవైపు లాగేస్తుంది. వణుకు మొదలవుతుంది. అయితే రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలగదు.
స్టేజ్ 2: శరీరం రెండు వైపులా ప్రభావితమవుతుంది. లక్షణాలు తీవ్రమవుతాయి. నడకలో తేడా వస్తుంది.
స్టేజ్ 3: లక్షణాలు గణనీయంగా పెరుగాయి. శరీరంలో కదలికలు మందగిస్తాయి. బ్యాలెన్స్ కోల్పోతారు.
స్టేజ్ 4: లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. బాధితులు ఒంటరిగా నడవలేరు. కచ్చితంగా ఇతరుల సాయం అవసరం అవుతుంది.
స్టేజ్ 5: నడవలేరు.. నిలబడలేరు. కొన్ని సందర్భాల్లో భ్రాంతితో భయాందోళనకు గురవుతుంటారు. కుంగుబాటుకు లోనవుతారు.
Updated Date - Jul 19 , 2025 | 07:09 AM