Intelligence Security Wing: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి
ABN, Publish Date - Jul 27 , 2025 | 03:53 AM
తెలంగాణలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్న ఇద్దరు డీఎస్పీలు మరణించగా, మరో ఏఎస్పీ, హెడ్‌కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు.
సడన్ బ్రేక్ వేసిన వాహనాన్ని తప్పించబోయి ప్రమాదం
డివైడర్ దాటి వెళ్లడంతో ఎదురుగా వచ్చిన లారీ ఢీ
ఏఎస్పీ, కానిస్టేబుల్‌కు గాయాలు
అందరూ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది
హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం
అమరావతి/చౌటుప్పల్ రూరల్/గొల్లపూడి, జూలై 26(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్న ఇద్దరు డీఎస్పీలు మరణించగా, మరో ఏఎస్పీ, హెడ్‌కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన శాంతారావు(57), పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వాసి చక్రధర్ రావు(52) ఉన్నారు. హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా శనివారం తెల్లవారుజామున విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం స్టేజి వద్దకు వారు ప్రయాణిస్తున్న స్కార్పియో రాగానే ముందుగా వెళ్తున్న వాహనం సడన్‌బ్రేక్ వేసింది. దాన్ని తప్పించబోయిన స్కార్పియో డివైడర్ ముందు భాగాన్ని బలంగా ఢీ కొట్టి, కొద్దిదూరం దూసుకెళ్లి విజయవాడ వెళ్లే రోడ్డులో పడిపోయింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి వస్తున్న సిమెంట్ కాంక్రీట్ లారీ స్కార్పియోను ఢీ కొట్టడంతో నుజ్జయింది. కారు మధ్య సీటులో కూర్చున్న డీఎస్పీలు చక్రధర్‌రావు, శాంతారావుకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ముందు సీటులో కూర్చున్న అడిషనల్ ఎస్పీ రామ్‌ప్రసాద్, హెడ్‌కానిస్టేబుల్ నరసింహరాజు(డ్రైవర్) గాయపడ్డారు. సీటు బెల్టు పెట్టుకోవడం, బెలూన్లు తెరుచుకోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. వారిద్దరినీ చికిత్స కోసం హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. వారిద్దరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
శిక్షణ కోసం వెళ్తుండగా..
ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి వృత్తి పరమైన మెలకువలు నేర్పించే శిక్షణ హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్‌లో ఉంటుంది. అందులో భాగంగానే ప్రీ ప్రమోషన్ ట్రైనింగ్(పీపీటీ) కోసం డీఎస్పీలు శాంతారావు, చక్రధర్ రావు, అడిషనల్ ఎస్పీ రామ్‌ప్రసాద్ శుక్రవారం రాత్రి 9.30 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్ కారులో బయల్దేరారు. రాత్రి నార్కట్‌పల్లి వద్దకు రాగానే కారు మరమ్మతుకు వచ్చింది. దీంతో హైదరాబాద్ ఐఎ్‌సడబ్ల్యూ కార్యాలయం నుంచి మరో స్కార్పియో వాహనాన్ని (ఏపీ 18 పీ 1176) తెప్పించుకొని మళ్లీ బయలుదేరారు. ఘటన స్థలం వద్ద ప్రమాద హెచ్చరిక సూచికలు లేకపోవడంతోనే ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. ఖైతాపురం క్రాసింగ్ అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో పలు ప్రమాదాలు జరిగాయి. సీటు బెల్టు పెట్టుకోకపోవడం కూడా డీఎస్పీల మృతికి కారణంగా తెలుస్తోంది. ముందు సీటులో కూర్చున్నవారు సీటు బెల్టు పెట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. మధ్య సీటులో కూర్చున్న డీఎస్పీలు శాంతారావు, చక్రధర్‌రావు సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. మృతదేహాలను చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చక్రధర్‌రావు, శాంతారావు కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. చక్రధరరావుకు భార్య శ్రీదేవి, ఇద్దరు కుమార్తెలు హాసిని ప్రియ, డింపుల్ ఉన్నారు. శాంతారావుకు భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు బాలగంగాధర్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాగా, చిన్న కుమారుడు శ్రీరామ్ నెదర్లాండ్స్‌లో చదువుతున్నాడు.
మృతదేహాలకు హోం మంత్రి నివాళి
డీఎస్పీలు చక్రధర్‌రావు, శాంతారావుల మృతదేహాలను శనివారం సాయంత్రం గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకువచ్చారు. హోం మంత్రి అనితతో పాటు పోలీసు ఉన్నతాధికారులు మృతదేహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కడసారి వీడ్కోలు పలికి మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించారు. శాంతారావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం డోలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారు
లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..
Updated Date - Jul 27 , 2025 | 03:56 AM