TTD: తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్
ABN, Publish Date - Mar 18 , 2025 | 05:18 AM
తమ సిఫారసు లేఖలకు కూడా గత తరహాలో దర్శనాలు కల్పించాలంటూ తెలంగాణ ప్రజాప్రతినిఽధులు సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా ఏపీ సీఎం చంద్రబాబుకు కొద్ది నెలల క్రితం లేఖ పంపారు. దీనిపై చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు.
24 నుంచి సిఫారసు లేఖలకు అనుమతి
ఏపీ భక్తులకు సిఫారసు లేఖలపై ఆదివారం కూడా బ్రేక్ దర్శనాలు
తిరుమల, మార్చి 17(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 24వ తేదీ నుంచి వారి సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జారీ చేయనున్నట్టు టీటీడీ సోమవారం ప్రకటించింది. తమ సిఫారసు లేఖలకు కూడా గత తరహాలో దర్శనాలు కల్పించాలంటూ తెలంగాణ ప్రజాప్రతినిఽధులు సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా ఏపీ సీఎం చంద్రబాబుకు కొద్ది నెలల క్రితం లేఖ పంపారు. దీనిపై చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. తొలుత ఫిబ్రవరి నుంచే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకుంటామని ప్రకటన చేసినప్పటికీ టీటీడీ మాత్రం తమ లేఖలు తీసుకోవడం లేదంటూ పలువురు తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 24 నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను తీసుకుంటామని టీటీడీ ప్రకటన చేసింది. ఆది, సోమవారాల్లో మాత్రమే (సోమ, మంగళవారాల దర్శనాలకు సంబంఽధించి) స్వీకరిస్తామని, అలాగే రూ.300 దర్శన టికెట్లకు సంబంఽధించిన సిఫారసు లేఖలను బుధ, గురువారాల్లో (ఏరోజు కారోజు కేటాయిస్తారు) తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది. ఒక సిఫారసు లేఖపై ఆరుగురికి మించకూడదనే నిబంధనను పెట్టారు. కాగా, ఇప్పటివరకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనానికిగాను ఆదివారం ఏపీ ప్రజాప్రతినిధుల నుంచి స్వీకరిస్తున్న సిఫారసు లేఖలను ఇకపై శనివారం తీసుకుని ఆదివారం దర్శనం చేయించనున్నారు.
Updated Date - Mar 18 , 2025 | 05:18 AM