Commercial Taxes Dept: బదిలీల్లో బంతాట..
ABN, Publish Date - Jul 05 , 2025 | 04:59 AM
గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దండి. ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలకమైన విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే అధికారులను నియమించండి. సరైన వ్యక్తులు సరైన చోట ఉంటేనే మెరుగైన ఫలితాలు సాధించగలుగుతాం
వాణిజ్య పన్నుల శాఖలో ఇష్టారాజ్యం.. సీఎం ఆదేశాలకూ వక్ర భాష్యం
ఉద్యోగుల బదిలీలకు మార్కుల విధానం
అస్మదీయులకు ఎక్కువ మార్కులు
కావాల్సిన చోట పోస్టింగ్‌లకు రెడీ
ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర విమర్శలు
కోర్టును ఆశ్రయించే దిశగా ఉద్యోగులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దండి. ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలకమైన విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే అధికారులను నియమించండి. సరైన వ్యక్తులు సరైన చోట ఉంటేనే మెరుగైన ఫలితాలు సాధించగలుగుతాం. దీనిపై కసరత్తు చేయండి’... ఇటీవల వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన దిశానిర్దేశమిది. అయితే.. వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల తీరే వేరు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దడంపై దృష్టి పెట్టకపోగా, మరింత అసంబద్ధ విధానాలను అమలు చేస్తున్నారు. ‘ప్రతిభ’ అన్న మాటనే పక్కన పెట్టేశారు. బదిలీలు, పోస్టింగ్‌ల ప్రక్రియలో పారదర్శకతకు తావు లేకుండా చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ‘మార్కులు’ విధానం ప్రవేశపెట్టి అస్మదీయులకు మేళ్లు చేయడానికి సిద్ధమవుతున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి ఆదేశాలకు సైతం వక్ర భాష్యం చెబుతున్నారు. ఉన్నతాధికారుల తీరుపై వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులే అంతర్గతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అసంబద్ధ మార్గదర్శకాలు
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ గత నెల 2వ తేదీతోనే ముగిసింది. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చిపెట్టే వాణిజ్య పన్నుల శాఖ పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. సొంత మార్గదర్శకాలతో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియను సజావుగా పూర్తి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దాంతో తొలుత జూన్ 30లోపు బదిలీల ప్రక్రియను పూర్తి చేస్తామంటూ మార్గదర్శకాలు జారీ చేసిన ఉన్నతాధికారులు.. తర్వాత శుక్రవారం వరకు గడువు పొడిగించారు. పనితీరు ఆధారంగా మార్కులు వేసి బదిలీలు చేస్తామంటున్నారు. అయితే మార్కులు వేసే విధానం శాస్త్రీయంగా లేదని, ఉద్యోగులందరికీ సమన్యాయం పాటించకుండా ఇష్టానుసారంగా బదిలీలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో ఒకేచోట 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారికి తప్పనిసరి బదిలీలు, మిగిలినవారికి అభ్యర్థనల మేరకు బదిలీలు నిర్వహిస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖలో మాత్రం లోపభూయిష్ట విధానాలతో ప్రతి ఏటా దాదాపు అందరికీ బదిలీలు చేస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సంస్కరణల పేరిట 2022, 2023, 2024ల్లో నిర్వహించిన బదిలీలు వివాదాస్పదంగా మారాయి.
ఈ ఏడాదైనా నిబంధనల ప్రకారం బదిలీలు నిర్వహిస్తారనుకుంటే.. అందుకు విరుద్ధంగా ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. ‘పరిపాలనా సౌలభ్యం-ఉద్యోగుల శ్రేయస్సు’ను సమతుల్యం చేసుకుంటూ బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంటే.. వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు మాత్రం తమకు అనుకూలంగా ఉండేవారికి ఎక్కువ మార్కులు వేసి, కావలసిన చోట పోస్టింగ్‌లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. బదిలీల ప్రక్రియలో ఒంటెద్దు పోకడలు పోతున్న ఉన్నతాధికారుల తీరును తీవ్రంగా తప్పుబడుతూ ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ చీఫ్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. తమ అభ్యంతరాలను సీసీఎస్టీ దృష్టికి తీసుకువచ్చారు. అయినా ఉన్నతాధికారుల నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖ పునర్విభజన పేరుతో ఇష్టమొచ్చినట్టుగా సర్కిళ్లను, ఉద్యోగులను తగ్గించేసి, దొడ్డి దారిలో దొంగ వ్యాపారాలు చేసేవారికి రాచబాట పరిచిన ఉన్నతాధికారులే ఈ ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ అంశాలపై దృష్టి సారించి వాణిజ్య పన్నుల శాఖలో కొనసాగుతున్న తప్పుడు విధానాలను సరిదిద్ది, కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులకు న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
చీఫ్ కమిషనర్‌పై పల్లాకు ఫిర్యాదు
బదిలీల విషయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ అహ్మద్‌బాబు వ్యవహరిస్తున్నారని ఆ శాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఏపీఎన్‌జీజీవో రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి చౌదరి పురుషోత్తం నాయుడు నేతృత్వంలో సుమారు 30 మందితో కూడిన ప్రతినిధి బృందం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసింది. బదిలీల ప్రక్రియలో కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. స్పందించిన పల్లా శ్రీనివాసరావు వెంటనే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌తో ఫోన్‌లో మాట్లాడి సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంలో చీఫ్ కమిషనర్ తన మాట కూడా వినడం లేదని మంత్రి నిస్సహాయత వ్యక్తం చేసినట్టు తెలిసింది. దాంతో పల్లా శ్రీనివాసరావు వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ సెక్రటరీ అహ్మద్‌బాబుతోనే ఫోన్‌లో మాట్లాడి బదిలీల విషయంలో ఉద్యోగుల అభ్యంతరాలను ఆయనకు వివరించారు. ఒకే స్థానంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారులు, ఉద్యోగులను బదిలీ చేస్తున్నామని చెప్పినట్లు తెలిసింది.
Updated Date - Jul 05 , 2025 | 05:00 AM