Psycho Attack: తిరుపతిలో సైకో వీరంగం
ABN, Publish Date - Jul 08 , 2025 | 06:40 AM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో సోమవారం ఉదయం 7.15 గంటలకు ఓ సైకో వీరంగం సృష్టించాడు. తమిళనాడుకు చెందిన మతి స్థిమితంలేని వ్యక్తి కొన్ని నెలలుగా తిరుపతిలో తిరుగుతూ వాహనాలపై రాళ్లు రువ్వడం, ఫుట్‌పాత్‌లపై ఉన్న యాచకులపై రాళ్లదాడి చేసేవాడు.
కత్తి, కర్రతో ముగ్గురిపై దాడి, ఒకరి మృతి
తిరుపతి(నేరవిభాగం), జూలై 7(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో సోమవారం ఉదయం 7.15 గంటలకు ఓ సైకో వీరంగం సృష్టించాడు. తమిళనాడుకు చెందిన మతి స్థిమితంలేని వ్యక్తి కొన్ని నెలలుగా తిరుపతిలో తిరుగుతూ వాహనాలపై రాళ్లు రువ్వడం, ఫుట్‌పాత్‌లపై ఉన్న యాచకులపై రాళ్లదాడి చేసేవాడు. ఈ క్రమంలో సోమవారం నంది సర్కిల్ వద్ద దాదాపు 10 మందిపై రాళ్లతో దాడి చేశాడు. ఈ దాడిలో ఐదారుగురు గాయపడ్డారు. అదే సమయంలో అక్కడున్న శేఖర్ అనే యాచకుడితో వాగ్వాదానికి దిగాడు. అది కాస్త కొట్లాటకు దారితీసింది. ఈ క్రమంలో తన చేతిలోని కర్ర, కత్తితో శేఖర్ తలపై బలంగా మోదాడు. అక్కడ ఉన్న యాచకురాలు కల్పన అడ్డుకోగా.. ఆమెనూ కర్రతో కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. అక్కడే పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న సుబ్రహ్మణ్యం సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా, అతన్నీ సైకో గాయపరిచాడు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది వచ్చి శేఖర్‌ను రుయాస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మరో ఇద్దరు రుయాలో చికిత్స పొందుతున్నారు. సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అలిపిరి సీఐ రాంకిషోర్ సైకోపై లునటిక్ యాక్టు కింద కేసు నమోదు చేశారు.
Updated Date - Jul 08 , 2025 | 06:40 AM