Tirumala: జూన్‌లో శ్రీవారి హుండీ ఆదాయం 119.86 కోట్లు
ABN, Publish Date - Jul 02 , 2025 | 03:46 AM
జూన్ నెలలో తిరుమల శ్రీవారికి భారీగా హుండీ ఆదాయం లభించింది. గత నెలలో 24.08 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీకి రూ.119.86 కోట్లు ఆదాయం వచ్చింది.
రోజుకు సగటున 80 వేల మందికి దర్శనం
తిరుమల, జూలై 1(ఆంధ్రజ్యోతి): జూన్ నెలలో తిరుమల శ్రీవారికి భారీగా హుండీ ఆదాయం లభించింది. గత నెలలో 24.08 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీకి రూ.119.86 కోట్లు ఆదాయం వచ్చింది. సగటున రోజుకు 80 వేల మంది స్వామిని దర్శించుకున్నారు. అత్యధికంగా 14వ తేదీన 91,720 మంది శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఐదు రోజులు 90 వేలకు పైగా, పది రోజులు 80 వేల మందికిపైగా శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. వేసవి సెలవులు ముగింపునకు రావడంతో ఈ సంఖ్య భారీగా పెరిగిందని అంచనా. ఇక, హుండీ ద్వారా రోజుకు సగటున రూ.4 కోట్ల కానుకలు రాగా, అత్యధికంగా 30వ తేదీన రూ.5.30 కోట్లు లభించింది. అలాగే జూన్‌లో 10.05 లక్షల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అత్యధికంగా 7వ తేదీన 45,068 మంది తలనీలాలు ఇచ్చారు. ఇలా ఉండగా మే నెలలో 23.77 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.106.83 కోట్లు లభించింది.
Updated Date - Jul 02 , 2025 | 03:47 AM