Tirumala : సప్తవాహనాలపై సప్తగిరీశుడి వైభవం
ABN, Publish Date - Feb 05 , 2025 | 05:02 AM
ఉదయం నుంచి రాత్రి వరకు మలయప్పస్వామి ఏడు వాహనాలపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు.
తిరుమలలో వైభవంగా రథసప్తమి
తిరుమల, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): తిరుమలలో మంగళవారం రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి రాత్రి వరకు మలయప్పస్వామి ఏడు వాహనాలపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా భావించే ఈ ఉత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మంగళవారం వేకువజాముకే మాడవీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. ఉదయం 5.30కు సూర్యప్రభ వాహనంపై కొలువుదీరిన స్వామి, సూర్య కిరణాల స్పర్శ కోసం వాయవ్య దిక్కున 6.48 గంటల వరకు వేచి ఉండాల్సి వచ్చింది. కిరణాలు స్వామిని తాకిన వెంటనే అర్చకులు శాస్త్రోక్త కైంకర్యాలు జరిపించారు. అనంతరం చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై స్వామి దర్శనమిచ్చారు. మధ్యాహ్నం పుష్కరిణిలో చక్రస్నానం వైభవంగా జరిగింది. రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవారి విహారంతో వాహనసేవలు ముగిశాయి.
శ్రీవారి సేవలో న్యాయమూర్తులు
రథసప్తమి రోజున తిరుమల శ్రీవారిని పలువురు న్యాయమూర్తులుదర్శించుకున్నారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.ఆర్.శ్రీరామ్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ స్వామిని దర్శించుకుని, వాహనసేవల్లో పాల్గొన్నారు.
రథసప్తమి విజయవంతం: ఈవో
తిరుమలలో రథసప్తమి విజయవంతంగా ముగిసిందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. దాదాపు 2.50 లక్షల మంది భక్తులు పాల్గొని వాహనసేవలను వీక్షించినట్లు చెప్పారు. టీటీడీ కల్పించిన సౌకర్యాలపై భక్తులందరూ సంతృప్తి వ్యక్తం చేశారని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం
శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Feb 05 , 2025 | 05:04 AM