ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Education Department: చేజారిన ఎంటెక్‌ చాన్స్‌

ABN, Publish Date - Aug 04 , 2025 | 03:38 AM

ఉన్నత విద్యాశాఖ గాడి తప్పుతోంది. ఆ శాఖలో ఎవరి దారి వారిదే అన్నట్టుగా మారింది. ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని ఉన్నత విద్యాశాఖ చెబుతుంటే...

  • అడ్మిషన్లకు ముగిసిన ఆప్షన్ల ప్రక్రియ.. బీటెక్‌ సర్టిఫికెట్లు ఇవ్వని యూనివర్సిటీలు

  • రాష్ట్రవ్యాప్తంగా 600 మంది విద్యార్థులకు నష్టం

  • ప్రైవేటు కాలేజీల్లోనూ సర్టిఫికెట్ల నిలిపివేత

  • మొత్తంగా అడ్మిషన్లు కోల్పోయిన వేలాది విద్యార్థులు

  • ఫీజుల విషయంలో అమలుకాని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు.. పట్టించుకోని అధికారులు

సర్టిఫికెట్ల మంజూరులో యూనివర్సిటీలు, ప్రైవేటు కాలేజీల ఇష్టారాజ్యం! వాటిని నియంత్రించాల్సిన ఉన్నత విద్యాశాఖ అధికారుల మౌనం!! ఫలితంగా వేలాది మంది విద్యార్థులు నష్టపోయారు. బీటెక్‌ పూర్తి చేసుకున్న వారంతా.. ఈ ఏడాది ఎంటెక్‌లో చేరే అవకాశాన్ని కోల్పోయారు. ఫీజుల విషయంలో విద్యార్థులను ఒత్తిడి చేయొద్దన్న ప్రభుత్వ ఆదేశాలను కాలేజీలు పట్టించుకోలేదు. సర్టిఫికెట్లు ఆపేసిన విషయం అధికారుల దృష్టికి వెళ్లినా.. తమకు సంబంధం లేదన్నట్టుగా చోద్యం చూశారు.

అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యాశాఖ గాడి తప్పుతోంది. ఆ శాఖలో ఎవరి దారి వారిదే అన్నట్టుగా మారింది. ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని ఉన్నత విద్యాశాఖ చెబుతుంటే... మీ ఆదేశాలతో తమకు సంబంధం లేదన్నట్లుగా ప్రైవేటు కాలేజీలతో పాటు ఆఖరుకు ప్రభుత్వ పరిధిలోని యూనివర్సిటీలు కూడా వ్యవహరిస్తున్నాయి. ఫీజుల కోసం సర్టిఫికెట్లు ఆపొద్దని స్వయంగా ఆ శాఖ మంత్రి లోకేశ్‌ పలుమార్లు ఆదేశించినా వర్సిటీల అధికారులు ఖాతరు చేయడం లేదు. వర్సిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే.. నియంత్రించాల్సిన విద్యాశాఖ ఉన్నతాధికారులు మౌనం వహిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు నష్టపోతున్నారు. ఇటీవల వందల మంది విద్యార్థులు ఎంబీఏ, ఎంసీఏ అడ్మిషన్లు కోల్పోగా.. ఇప్పుడు బీటెక్‌ పూర్తిచేసి ఎంటెక్‌లో చేరాలనుకున్న వేల మంది విద్యార్థులు సీట్లు కోల్పోయారు. ఎంటెక్‌లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్ల పరిశీలన శనివారంతో ముగిసింది. విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఆదివారం పూర్తయ్యింది. యూనివర్సిటీలు సర్టిఫికెట్లు ఇవ్వని కారణంగా దాదాపు 600 మంది నష్టపోగా.. ప్రైవేటు కాలేజీల్లోనూ సర్టిఫికెట్ల నిలిపివేతతో ఈ సంఖ్య మొత్తంగా వేలల్లోనే ఉంటుంది. దీంతో బీటెక్‌ సర్టిఫికెట్లు చేతికి రాని విద్యార్థులు ఎంటెక్‌లో చేరేందుకు మరో ఏడాది ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆ ఆదేశాలు మాకు వర్తించవు

‘‘ఈ విద్యా సంవత్సరం నుంచి నేరుగా కాలేజీలకే ఫీజులు విడుదల అవుతాయి. ఫీజుల కోసం విద్యార్థులను ఒత్తిడి చేయకూడదు. పరీక్షలు, తరగతులకు హాజరుకాకుండా ఆపడం, హాల్‌టికెట్లు నిలిపివేయడం లాంటి చర్యలు చట్టవిరుద్ధం. అలాంటి యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని గత మార్చిలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఫీజులు చెల్లించిన తర్వాతే సర్టిఫికెట్లు ఇస్తామంటూ వర్సిటీల అధికారులు తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వ పరిధిలోని వర్సిటీల్లోనే విద్యార్థులను ఈ స్థాయిలో ఇబ్బందులకు గురిచేస్తున్నా ఉన్నత విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదు. సర్టిఫికెట్లు ఆపేసిన విషయం వారి దృష్టికి వెళ్లినా పట్టించుకోవడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఆరు క్వార్టర్ల ఫీజులను ప్రభుత్వం విడుదల చేయాలి. అవి రాకపోయినా మాకు ఫీజులు కట్టాలని వర్సిటీల అధికారులు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారు. కట్టని వారికి సర్టిఫికెట్లు నిలిపివేశారు.

ఒక్కరిపైనా చర్యలు లేవు!

విద్యార్థులకు సర్టిఫికెట్లు నిలిపివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తరచూ చెప్పే ఉన్నత విద్యాశాఖ.. ఏడాదిగా ఒక్క యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వం ఫీజులు విడుదల చేస్తామని చెబుతున్నా వినిపించుకోకుండా.. కాలేజీలు బలవంతంగా ఫీజులు కట్టించుకుంటున్నాయి. ప్రభుత్వం తరఫున విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని చెబుతున్న అధికార పార్టీ ఎమ్మెల్సీలకు చెందిన కాలేజీలూ దీనికి అతీతం కాదు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలు విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తుంటే.. ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోగా, కనీసం ఫిర్యాదులను పట్టించుకునే అధికారులు కరువయ్యారు. పైగా యూనివర్సిటీల కాలేజీలే సర్టిఫికెట్లు ఆపేస్తుంటే తామెందుకు ఫీజులు కట్టకుండా సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి.

Updated Date - Aug 04 , 2025 | 11:51 AM