కొటేషన్లలో కొట్టేశారు..!
ABN, Publish Date - Jul 15 , 2025 | 01:38 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో నగరంలోని కొత్త ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్)లో జరిగిన కొనుగోళ్లలో భారీ ఎత్తున గోల్‌మాల్ జరిగిన విషయం బయటపడింది. ఈ వ్యవహారాల మాటున రూ.కోట్ల అవినీతి చోటు చేసుకుందని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వైసీపీ హయాంలో నియమితుడై.. కూటమి ప్రభుత్వంలోనూ కొద్దికాలం పనిచేసిన వైద్యాధికారి కనుసన్నల్లో ఈ భారీ అవినీతి జరిగిందని తెలుస్తోంది. ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ప్రతి కొనుగోలు వెనుక ఈ అవినీతి మూలాలు వెలుగులోకి వస్తున్నాయి.
- వైసీపీ హయాంలో జీజీహెచ్‌లో అవినీతి
- ఓ అధికారి అత్యుత్సాహంతో ప్రతి పనికీ రేటు
- మందులు, ఆక్సిజన్, పరికరాలు, పనిముట్లు ఏది కొన్నా కమీషనే..
- అస్మదీయ సంస్థలు, వాటి డమ్మీలకు కొటేషన్లు ఇచ్చి కొనుగోళ్లు
- రిపేర్ల ముసుగులోనూ కొనసాగిన దందా
- సీసీ కెమెరాల కొనుగోళ్లలో ఇష్టానుసారంగా..
- ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదులు
వైసీపీ ప్రభుత్వ హయాంలో నగరంలోని కొత్త ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్)లో జరిగిన కొనుగోళ్లలో భారీ ఎత్తున గోల్‌మాల్ జరిగిన విషయం బయటపడింది. ఈ వ్యవహారాల మాటున రూ.కోట్ల అవినీతి చోటు చేసుకుందని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వైసీపీ హయాంలో నియమితుడై.. కూటమి ప్రభుత్వంలోనూ కొద్దికాలం పనిచేసిన వైద్యాధికారి కనుసన్నల్లో ఈ భారీ అవినీతి జరిగిందని తెలుస్తోంది. ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ప్రతి కొనుగోలు వెనుక ఈ అవినీతి మూలాలు వెలుగులోకి వస్తున్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ప్రభుత్వాసుపత్రికి అవసరమైన అన్ని రకాల మందులు, ఆక్సిజన్, ఇతర రసాయనాలు, మార్చురీ బాక్స్‌లు, ల్యాబ్, ఎలక్ర్టికల్ ఐటమ్స్, ఏసీలు, బెడ్లు, స్ర్టెచర్లతో పాటు సబ్‌స్టేషన్ రిపేర్లు, సివిల్ వర్క్స్.. ఇలా ప్రతి కొనుగోలు, మరమ్మతులను నిబంధనలకు విరుద్ధంగా అస్మదీయ సంస్థలకు కట్టబెట్టి రూ.కోట్ల ప్రభుత్వ సొమ్మును లూఠీ చేసినట్టు తెలుస్తోంది. ఆసుపత్రిలో రూ.10 వేలకు మించి ఏది కొనాలన్నా కచ్చితంగా కొటేషన్ పిలవాల్సిందే. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలంటే కనీసం పది సంస్థలకు పైగా కొటేషన్స్ పిలవాలి. ఈ కొటేషన్స్‌కు ప్రభుత్వ పోస్టల్ స్టాంప్స్ అంటించి, డిస్పాచ్ రిజిస్టర్‌లో ఏ తేదీన పంపించిందీ ఎంటర్ చేసి, పోస్ట్ ద్వారా ఆయా సంస్థలకు పంపించాలి. అర్జెంట్ అయితే, మెయిల్ ద్వారా అయినా పంపించాలి.
దోపిడీ ఇలా..
పై నిబంధనలను వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన అధికారిగా ముద్రపడిన వైద్యాఽధికారి ఖాతరు చేయలేదు. ఆయన హయాంలో కొనుగోళ్లన్నింటినీ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టారు. కొన్ని సంస్థలతో లాలూచీ పడి అడ్డగోలుగా కొటేషన్స్ పిలిచారన్న ఆరోపణలు ఉన్నాయి. లాలూచీ పడిన సంస్థల ద్వారా మూడు కొటేషన్స్ స్వీకరించేవారని తెలుస్తోంది. ఒకటి అసలు సంస్థ కాగా, రెండు, మూడు.. డమ్మీ కొటేషన్లు తీసుకునేవారు. తమకు కావాల్సిన పర్సంటేజీలు అన్నీ కూడా ముందే మాట్లాడుకునేవారని తెలుస్తోంది. వారికి నచ్చిన సంస్థ మూడు వేర్వేరు రేట్లతో కొటేషన్లు వేయగా, సీన్‌ను మరింత రక్తికట్టించేవారు. ముందుగా అనుకున్న ప్రకారం ఏ సంస్థ ఎంత కోట్ చేయాలన్నది నిర్దేశించుకునేవారు. ఏ సంస్థకు పని అప్పగించాలో కూడా నిర్ణయించుకునేవారు. ఒక్క సంస్థ మాత్రమే రేటును తగ్గించిందని దాని పేరు రాసుకునేవారు. ఆ సంస్థకు కొనుగోళ్ల ఆర్డర్ ఇవ్వాలని నిర్ణయించేవారు. ఆ తర్వాత కొనుగోళ్ల ఆర్డర్ జారీ చే సేవారు. ఆసుపత్రి అవసరాలకు కొన్న, మరమ్మతులు చేసిన ప్రతి అంశలోనూ ఇదే పద్ధతిని అవలంబించారు. ఇలా కావాల్సిన సంస్థలకు తప్ప.. బయటి సంస్థలకు ఆర్డర్లు దక్కేవి కావు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) నిబంధనలను అడ్డుపెట్టుకుని సీసీ కెమెరాల ఏర్పాటులో కూడా భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే జరిగిన అక్రమాలు, అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Updated Date - Jul 15 , 2025 | 01:38 AM