పట్టపగలే చోరీలు
ABN, Publish Date - Jun 25 , 2025 | 11:46 PM
ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లాలంటేనే జిల్లా వాసులు భయపడిపోతున్నారు.
జిల్లాలో పెరుగుతున్న దొంగతనాలు
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
పట్టుకోండి అని పోలీసులకే సవాల్?
భయాందోళనలో జిల్లా వాసులు
కొట్టెచ్చిన నిఘా వైఫల్యం
రికవరీ కూడా అంతంత మాత్రమే?
లబోదిబోమంటున్న బాధితులు
ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లాలంటేనే జిల్లా వాసులు భయపడిపోతున్నారు. అలా తాళం పడిందో.. లేదో ఇలా దొంగలు చొరబడి ఉన్నదంతా దోచేస్తున్నారు. దొంగలు రాత్రిళ్లు కాకుండా పట్టపగలు కూడా ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. తాళాలు వేసిన ఇళ్లు, దేవాలయాలే టార్గెట్‌గా రెచ్చిపోతున్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా రోజురోజుకూ చోరీలు పెరిగిపోతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిఘా వైఫల్యం.. నిర్లక్ష్య ధోరణి వారికి వరంగా మారింది. మేము ఏమైనా చేస్తాం.. చేతనైతే పట్టుకోండి చూద్దాం అంటూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. దొంగల ఆటకట్టించడం కోసం పోలీసుశాఖ అమలు చేస్తున్న ఎల్‌ఎంహెచఎస్(లాక్డ్‌హౌస్ మానటరింగ్ సిష్టమ్) యాప్ పనితీరు ఎక్కడ కనిపించడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈయాప్ సేవలను పోలీసుశాఖే అటకెక్కించింది. గస్తీ కూడా అంతంత మాత్రమే ఉండటంతో దొంగలు యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవలే జరుగుతున్న దొంగతనాలను చూస్తే ఇవన్నీ పాత నేరస్థుల పనేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నంద్యాల, జూన25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో దొంగలు పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల తాళం వేసిన ఇళ్లలో చోరీలు చేయగా మరికొన్ని చోట్ల ఇంటి నుంచి బయటకు వెళ్తే చాలు దోచేస్తున్నారు. దొంగలు దేవాలయాలను సైతం వదలడం లేదు. మొత్తంగా పగలు రాత్రి అనే తేడా లేకుండా దొంగలు బరితెగిస్తుండటం జిల్లా ప్రజలను వణికిస్తోంది. పోలీసులు చోరీల కేసులపై ఆశించిన స్థాయిలో నిఘా ఉంచకపోవడంతో యథేచ్ఛగా దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. మరోవైపు చోరీ కేసుల రికవరీ కూడా అంతంత మాత్రంగానే బాధితులు లబోదిబోమంటున్నారు. ఏది ఏమైనా జిల్లాలో జరగుతున్న దొంగతనాలు చూస్తుంటే పట్టుకోండి చూద్దాం అన్నట్లుగా పోలీసులకు దొంగలు సవాల్ విసురుతున్న పరిస్థితి నెలకొంది.
జిల్లాలో మూడేళ్లలో జరిగిన చోరీలు... రికవరీల వివరాలు
------------------------------------------------------------------------
ఏడాది కేసులు నష్టం(రూ. కోట్లలో) రీకవరీ(రూ. కోట్లలో)
-----------------------------------------------------------------------
2023 34 రూ.2.99 రూ. 2.28
2024 117 రూ.1.11 రూ. 46.62 లక్షలు
2025 240 రూ.2.21 రూ. 1.04
-------------------------------------------------------------------------------------------
మొత్తం 391 రూ.6.31 రూ.3.78
----------------------------------------------------------------
రెక్కీ నిర్వహించి చోరీలకు..
జిల్లాలో రోజురోజుకు దొంగతనాలు సంఖ్య పెరిగిపోతోంది. దుండగులు పథకం ప్రకారం ముందస్తు రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడుతున్నారు. వివిధ పండగులు, ఉత్సవాలు, ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో పోలీసు నిఘా కూడా పూర్తిగా తగ్గిపోయింది. దొంగలు కూడా ఇదే అదనుగా భావించి పల్లె, పట్టణం అనే తేడా లేకుండా తాళం వేసిన ఇళ్లు కనిపిస్తే చాలు దోచుకుపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పట్టపగలే చోరీలకు పాల్పడటం మరింత కలవరం రేపుతోంది. పలుచోట్ల బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. పోలీసుల నిర్లక్ష్యం కాస్త దొంగల పాలిట వరంగా మారుతోంది. ప్రధానంగా నంద్యాల పట్టణంతో పాటు డోన, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లె, నందికొట్కూరు ప్రాంతాల్లో చోరీలు ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారం.
పోలీసుల నిఘా..
జిల్లాలో ఆశించిన స్థాయిలో పోలీసుల నిఘా లేదు. దీంతో దొంగతనాలు, దోపిడీలు పెరిగిపోతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో అక్కడక్కడ పోలీసు నిఘా ఉన్నప్పటీకి దొంగతనాలు ఆగడం లేదు. ఇందుకు ఇటీవల నమోదైన కేసులే నిదర్శనం. పట్టపగలే చోరీలకు పాల్పడుతుండటం కలవరం రేపుతోంది. ఈక్రమంలో వరుస దొంగతనాలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. పైగా దొంగతనాల కేసుల్లో ఆశించిన స్థాయిలో రికవరీ లేదని బాధిత వర్గాలు ఆరోపిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
పాత నేరస్థుల పనేనా?
జిల్లాలో దొంగతనాలు తగ్గించడానికి కొన్నేళ్ల క్రితం జిల్లా పోలీసు యంత్రాంగం ‘ఒక దొంగ- ఒక పోలీసు’ అనే కార్యక్రమానికి చేపట్టింది. సుమారు 1500 మందికి పైగా పాత నేరస్థులను గుర్తించింది. పాత నేరస్థులు భవిష్యత్తులో దొంగతనాలకు పాల్పడకుండా సంబంధిత పోలీసులు నిఘా ఉంచారు. దీంతో చోరీలు చాలావరకు తగ్గుముఖం పట్టాయి. కొవిడ్ నేపథ్యం ఈ కార్యక్రమం అటకెక్కింది. దీంతో తికిగి పాత నేరస్థులు చోరీలకు తెరలేపినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో జిల్లాలో కొంతకాలంగా నమోదైన చోరీలను పరిశీలిస్తే పాత నేరస్థుల పనేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటికితోడు కొందరు నేరగాళ్లు దొంగతనాలు చేయడం.. జైలుకెళ్లడం.. బయటకు రావడం, తిరిగి యథేచ్ఛగా చోరీలకు పాల్పడటం పరిపాటికి మారిందని పోలీసు వర్గాల సమాచారం.
గస్తీ అంతంత మాత్రమే..
దొంగల ఆటకట్టించడం కోసం పోలీసుశాఖ అమలు చేస్తున్న ఎల్‌ఎంహెచఎస్(లాక్డ్‌హౌస్ మానటరింగ్ సిష్టమ్) యాప్ పనితీరు ఎక్కడ కనిపించడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈయాప్ సేవలను పోలీసుశాఖ అటకేక్కించారనే ఆరోపణలు లేకపోలేదు. పోలీసులు కూడా కొన్ని ప్రధాన కూడళ్లు, వీధుల్లో మాత్ర మే రాత్రి 11 గంటల వరకు గస్తీ నిర్వహిస్తూ తర్వాత మిన్నుకుండిపోతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దొంగతనాలకు అనువుగా ఉండే ప్రాంతాల్లో పోలీసు గస్తీ ఏమాత్రం కనిపించడం లేదనే విమర్శలు లేకపోలేదు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు బాధితులు ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే త్వరతిగతిన కేసును పరిష్కారించాల్సి ఉంటుందని కాలయాపన చేస్తున్నారని సమాచారం. మరికొందరు పోలీసులైతే వివిధ పనులతో బిజీగా ఉన్నామని చెప్పి తప్పించుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. జిల్లాలో పోలీసుల నిఘాతో పాటు కేసుల నమోదుపై ఆశించిన స్ధాయిలో స్పందించకపోవడంతోనే జిల్లాలో దొంగలు చెలరేగుతున్నారనే ఆరోపణలు బాధిత వర్గాల నుంచి వినిపించడం కలవరం రేపుతోంది.
నంద్యాల జిల్లాలో కొన్ని..
ఫ మూడు నెలల క్రితం నంద్యాల పట్టణ శివారులోని క్రాంతినగర్‌లోని సుభాన అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి ఉండటంతో దొంగలు చొరబడి రూ. 10లక్షలు విలువ చేసే 12 తులాల బంగారు ఎత్తుకెళ్లారు. నాలుగు నెలల కింద అదే కాలనీలోని ఓ ఇంట్లో 10తులాల బంగారుతో పాటు రూ.15వేలు నగదు ఎత్తుకెళ్లారు.
ఫ నాలుగు నెలల క్రితం ఎస్బీఐ కాలనీలో దశరథ(ఆర్‌ఏఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న) తమ కుటుంబ సభ్యులలో కలిసి ఊరెళ్లాడు. ఇదే అదునుగా భావించి దొంగలు ఇంట్లో చొరబడి 50 తులాల బంగారు, అర్ధ కేజీ వెండి, రూ.30లక్షల నగదును అపహరించారు. అదేరోజు హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఓ ఇంట్లో ఐదు తులాల బంగారుతో పాటు రూ. 5000 నగదును ఎత్తుకెళ్లారు. రెండు నెలల కిందట నంది గ్రీనహోమ్స్‌లోని ఏడు ఇళ్లలో ఒకే రోజు 10 తులాల బంగారు, రూ. 5లక్షలు నగదు దొంగలించారు.
ఫ చాగలమర్రి మండలం నగల్లపాడు గ్రామంలో ఉపాఽధ్యాయుడు మౌళాలి గతేడాది డిసెంబరులో విధులకు వెళ్లారు. ఆయన భార్య సైతం ఇంటికి తాళం వేసి పొలం పనికి వెళ్లింది. గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగల గొట్టి నాలుగు తులాల బంగారు నగలతో పాటు రూ. 25 వేలు నగదును తీసుకెళ్లారు.
ఫ డోనలోని ఇంద్రాగనగర్‌కు చెందిన వ్యాపారి నభిరసూల్ తమ కుటుంబ సభ్యులతో కలిసి రెండేళ్ల కిందట వివాహా కార్యాక్రమానికి వెళ్లారు. ఇదే అదునుగా భావించి అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు తలుపులకు నిప్పు అంటించి లోపలికి చొరబడి బీరవాను పగలకొట్టి 20 తులాల వెండితో పాటు రూ. 30వేల నగదను ఎత్తుకెళ్లారు.
ఫ మార్చి 1వ తేదీన శిరివెళ్ల మండల కేంద్రంలోని కన్యాకారమేశ్వరి (అమ్మవారిశాల) ఆలయం హుండీని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. మండల పరిధిలోని వెంకటాపురంలోను హూండీని ఎత్తుకెళ్లారు. ఆళ్లగడ్డ రూరల్ పరిధిలోని పుట్టాలమ్మ ఆలయంలోని సుమారు 20 కేజీల వెండి నగులు ఈ నెల 11వ తేదీన దొంగలు ఎత్తుకెళ్లారు.
ఫ ఆత్మకూరులోని సాయిబాబానగర్‌లో నివాసం ఉంటున్న ఏఈ శరభారెడ్డి ఈనెల 23వ తేదిన నంద్యాల కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్‌ఎఫ్‌కు హాజరయ్యారు. కుటుంబ సభ్యులు వివాహ పోస్టు వెడ్డింగ్ షూట్ కోసం బయటకు వెళ్లారు. ఇదే అదునుగా భావించి గుర్తు తెలియని దుండగులు పట్టపగలే ఇంటి తాళం పగలకొట్టి 60తులాల బంగారుతో పాటు షూట్ కేసులో ఉన్న రూ. 27లక్షలు నగదును ఎత్తుకెళ్లారు. బాధితులు గమనించి చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రత్యేక నిఘా ఉంచుతాం
జిల్లాలో దొంగతనాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచుతాం. రాత్రి వేళల్లో గస్తీ మరింత పటిష్టం చేస్తాం. అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నాం. పాత నేరస్థులు కనిపించకుండా పోతే వెంటనే ఆరా తీస్తున్నాం. లాక్డ్‌హౌస్ మానటరింగ్ సిస్టమ్ యాప్ సేవలను మెరుగుపరుస్తాం. దొంగతనాలు జరగకుండా ప్రజలు కూడా ఈసేవలను వినియోగించుకోవాలి. పోలీసులు చోరీల కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటాం.
ఫ అధిరాజ్ సింగ్ రాణా, ఎస్పీ, నంద్యాల
Updated Date - Jun 25 , 2025 | 11:46 PM