ఆయుష్షు తీసిన అతివేగం
ABN, Publish Date - Jun 11 , 2025 | 01:23 AM
చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ఆత్కూరు ఫ్లైఓవర్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కారు మెకానిక్‌లు అక్కడి కక్కడే మృతి చెందారు. కారు యజమాని గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.
- ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొన్న కారు
- ఇద్దరు కారు మెకానిక్‌లు అక్కడికక్కడే మృతి
- గాయాలతో ఆస్పత్రిపాలైన కారు యజమాని
- మృతుల్లో ఒకరిది విజయవాడ, మరొకరిది ఉత్తరప్రదేశ
-చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ఆత్కూరు వద్ద ఘటన
-రిపేరుకు వచ్చిన కారు బాగు చేసి యజమాని ఇంటికి తీసుకెళ్తుండగా ప్రమాదం
ఉంగుటూరు, జూన 10 (ఆంధ్రజ్యోతి):
చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ఆత్కూరు ఫ్లైఓవర్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కారు మెకానిక్‌లు అక్కడి కక్కడే మృతి చెందారు. కారు యజమాని గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఆత్కూరు ఎస్‌ఐ చావా సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. బాపులపాడు మండలం హనుమానజంక్షనకు చెందిన లారీ యజమాని దాసరి ఫణి విక్రమ్ తన కారును రిపేరు చేయించడానికి సోమవారం సాయంత్రం విజయవాడ ఆంధ్ర హాస్పటల్ సమీపంలోని నూతక్కి శ్రీనివాస్(37) అనే మెకానిక్ వద్దకు తీసుకెళ్లాడు. స్నేహితుడైన ఉత్తరప్రదేశ నుంచి వలస వచ్చిన సర్ప్‌రాజ్(30) అనే మరో మెకానిక్‌తో కలిసి శ్రీనివాస్ అర్ధరాత్రి వరకు కారు రిపేర్ చేశారు. మంగళవారం ఉదయం ఆరు గంటలకు ముగ్గురు కలిసి అదే కారులో విజయవాడ నుంచి హనుమానజంక్షనలోని కారు యజమాని ఇంటికి బయలుదేరారు. ఆత్కూరు ఫ్లైఓవర్ మీదకు వచ్చేసరికి సిమెంట్ లోడ్‌తో ముందు వెళ్తున్న లారీని అదుపు తప్పి కారు వేగంగా ఢీకొట్టింది. లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న మహమ్మద్ సర్ప్‌రాజ్, వెనుక సీట్లో కూర్చున్న నూతక్కి శ్రీనివాస్‌ల తలకు బలమైన గాయాలు అవడంతో ఇరువురు అక్కడికక్కడే మృతిచెందారు. కారు ముందు సీట్లో ఎడమవైపు కూర్చున్న కారు యజమాని ఫణి విక్రమ్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్రేన సాయంతో కారు డోర్లు తెరచి గాయాలపాలైన ఫణి విక్రమ్‌ను బయటకు తీసి చినవుటపల్లి పిన్నమనేని ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న రెండు మృతదేహాలను కూడా బయటకు తీసి గన్నవరం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కాగా, మృతుడు శ్రీనివాస్‌కు వివాహమై భార్య, కుమారుడు ఉండగా, సర్ప్‌రాజ్‌కు ఇంకా వివాహం కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Jun 11 , 2025 | 01:23 AM