ఇక బైక్ భద్రం!
ABN, Publish Date - May 12 , 2025 | 12:15 AM
మోటారు బైక్... మధ్య తరగతి జీవికి సర్వస్వం. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు దాంతోనే పని. అది అందుబాటులో లేకపోతే ఇక అంతే.. ఒక్కమాటలో చెప్పాలంటే బైక్ మొరాయించినా, ఎవరైనా ఎత్తుకుపోయినా ఆ రోజు పనులన్నీ బందే. రూపాయి రూపాయి పోగేసుకుని కొనుగోలు చేసిన బైక్‌లను దొంగలు ఎత్తుకుపోతున్నారు. దీంతో రికవరీ కోసం బాధితులు పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నగరంలో ద్విచక్ర వాహనాలకు భద్రత కల్పించడానికి పోలీసులు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ద్విచక్ర వాహనదారుల కోసం ఆర్‌ఎఫ్‌ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీతో పోలీసు శాఖ సంప్రదింపులు చేస్తోంది.
ఒక్కో వాహనానికి ఆర్‌ఎఫ్‌ఐడీ సి్ట్రప్
కూడళ్లలో రిసీవర్ బాక్స్‌ల ఏర్పాటు
కొత్త స్కీంపై పోలీసుల కసరత్తు
సాఫ్ట్‌వేర్ కంపెనీతో సంప్రదింపులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
మోటారు బైక్... మధ్య తరగతి జీవికి సర్వస్వం. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు దాంతోనే పని. అది అందుబాటులో లేకపోతే ఇక అంతే.. ఒక్కమాటలో చెప్పాలంటే బైక్ మొరాయించినా, ఎవరైనా ఎత్తుకుపోయినా ఆ రోజు పనులన్నీ బందే. రూపాయి రూపాయి పోగేసుకుని కొనుగోలు చేసిన బైక్‌లను దొంగలు ఎత్తుకుపోతున్నారు. దీంతో రికవరీ కోసం బాధితులు పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నగరంలో ద్విచక్ర వాహనాలకు భద్రత కల్పించడానికి పోలీసులు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ద్విచక్ర వాహనదారుల కోసం ఆర్‌ఎఫ్‌ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీతో పోలీసు శాఖ సంప్రదింపులు చేస్తోంది.
ఎలా పనిచేస్తుందంటే...
సాంకేతిక పరిజ్ఞానం వాహనాల్లోకి ప్రవేశించింది. ఖరీదైన కారులకు సెన్సార్, జీపీఎస్ సదుపాయాలు ఉంటున్నాయి. మార్కెట్‌లోకి వస్తున్న ఎలక్ర్టికల్ వాహనాలకు ఈ రెండూ ఉంటున్నాయి. ఈ సదుపాయాలు లేని వాహనాలకు యజమానులు ప్రత్యేకంగా జీపీఎస్ ట్రాకర్ అమర్చుకుంటున్నారు. ఇప్పటి వరకు మాయమైన బైక్‌ల్లో కొన్నింటిని పోలీసులు ఈ జీపీఎస్ ద్వారా పసిగట్టి పట్టుకున్నారు. ఈ జీపీఎస్ స్థానంలో దానికంటే తక్కువ ఖర్చయ్యే సదుపాయాన్ని నగరంలోని ద్విచక్ర వాహనదారులకు ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు. ఆ స్థానంలో ఆర్‌ఎఫ్‌ఐడీని తీసుకురావాలని నిర్ణయించారు. ఈ ఆర్‌ఎఫ్‌ఐడీ టోల్‌గేట్ల వద్ద ఉండే ఫాస్ట్‌ట్యాగ్ మాదిరిగా పనిచేస్తుంది. కారు టోల్‌గేటు వద్దకు వెళ్లగానే ఎదురుగా ఉండే సీసీ కెమెరా ఆ వాహనంపై ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ స్టిక్కర్(సెన్సార్)ను స్కాన్ చేస్తుంది. ఇది స్కాన్ కాగానే ఫాస్ట్‌ట్యాగ్ నుంచి నగదు టోల్‌ప్లాజాకు జమ అవుతుంది. దీని మాదిరిగానే ఆర్‌ఎఫ్‌ఐడీ పనిచేస్తుంది. సెన్సార్ కలిగిన ఒక సి్ట్రప్‌ను నగరంలో ఉన్న ద్విచక్ర వాహనాలకు అతికిస్తారు. నగరంలో ఉన్న అన్ని కూడళ్లలో ఆర్‌ఎఫ్‌ఐడీకి అనుసంధానంగా ఉండే రిసీవర్ బాక్స్‌లను అమర్చుతారు. ఒకవేళ ఎవరిదైనా బైక్‌ను దొంగిలించినప్పుడు అది ఏయే మార్గాల్లో ఎక్కడిడెక్కడ తిరిగిందన్న వివరాలు ఇట్టే పోలీసులకు తెలుస్తాయి. దీనితోపాటు బైక్ ఎక్కడుందన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆర్‌ఎఫ్‌ఐడీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తారు. ఈ ఆర్‌ఎఫ్‌ఐడీ సి్ట్రప్‌ను పోలీసులు వాహనదారులకు అందజేస్తారు. ఒక్కో సి్ట్రప్‌కు నాలుగైదు రూపాయల ధర నిర్ణయించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది జీపీఎస్ పరికరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నప్పటికీ దాని ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఒక్కో జీపీఎస్‌కు బయట రూ.1500 నుంచి రూ.2వేలు వసూలు చేస్తున్నారు. దీని కంటే చౌకగా ఆర్‌ఎఫ్‌ఐడీని అందజేయాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
Updated Date - May 12 , 2025 | 12:15 AM