ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: జన్మభూమిని మరవొద్దు

ABN, Publish Date - Jul 28 , 2025 | 04:19 AM

విదేశాల్లో స్థిరపడి.. సంపద సృష్టిస్తున్న తెలుగు వాళ్లు జన్మభూమిని మర్చిపోకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపిచ్చారు. ఐదు రోజుల సింగపూర్‌ పర్యటనలో భాగంగా ఆదివారం అక్కడి వన్‌ వరల్డ్‌ ఇంటర్నేషనల్‌...

  • తెలుగుజాతి ఎక్కడైనా వెలుగుజాతే: చంద్రబాబు

  • కర్మభూమిలో ఎదగండి..జన్మభూమి కోసమూ నిలవండి!

  • సింగపూర్‌ గడ్డపై ప్రవాసులకు సీఎం పిలుపు

  • 5 రోజుల పర్యటన కోసం సింగపూర్‌ చేరిక

  • సంప్రదాయబద్ధంగా తెలుగువారి స్వాగతం

  • ఆయనకు, లోకేశ్‌కు మహిళల హారతులు

  • నీతి, నిజాయితీలతో ఎదిగిన దేశం సింగపూర్‌

  • అందుకే అమరావతిలో భాగస్వామిని చేశా

  • గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దడం నా బాధ్యత

  • ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వానికీ చెబుతాను

  • పీ4కు సహకరించండి.. పెట్టుబడులతో రండి

  • ‘ప్రవాస’ పరిశ్రమలకు ప్రోత్సాహం

  • ‘గ్లోబల్‌ ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ సెల్‌’ఏర్పాటుకు యోచన: ముఖ్యమంత్రి

  • మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్‌,థాయ్‌ నుంచీ సమావేశానికి వచ్చిన ప్రవాసులు

తెలుగువాళ్లు స్థిరపడిన దేశం వారికి కర్మభూమి. అవకాశాలు కల్పించిన ఆ దేశాభివృద్ధి కోసం పనిచేయాలి. అదే సమయంలో పుట్టిన గడ్డను మరువకూడదు. ఆంధ్రప్రదేశ్‌ వారి జన్మభూమి. దాని అభివృద్ధి కోసమూ పనిచేయాలి. పెట్టుబడులు పెట్టాలి.

- సీఎం చంద్రబాబు

అమరావతి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో స్థిరపడి.. సంపద సృష్టిస్తున్న తెలుగు వాళ్లు జన్మభూమిని మర్చిపోకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపిచ్చారు. ఐదు రోజుల సింగపూర్‌ పర్యటనలో భాగంగా ఆదివారం అక్కడి వన్‌ వరల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ (ఓవిస్‌) డిజిటల్‌ క్యాంప్‌సలో జరిగిన ‘తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్‌ ఈస్ట్‌ ఏషియా కార్యక్రమంలో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నాన్‌-రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్నార్టీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సింగపూర్‌తో పాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్‌, థాయ్‌లాండ్‌లలోని ప్రవాసాంధ్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచంలో మారుతున్న పరిణామాలను తెలుగు ప్రజలు అందిపుచ్చుకున్నారని తెలిపారు. ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు వారి జీవితాలను మార్చాయని.. దాని ఫలితమే నేడు 120కిపైగా దేశాల్లో తెలుగు ప్రజలు ఉన్నారని చెప్పారు.

చాలా దేశాల్లో స్థానికుల కంటే ఎక్కువగా తెలుగువారు సంపాదిస్తున్నారని అన్నారు. అమెరికాలో ఉండే స్థానికుల కంటే మనవాళ్ల తలసరి ఆదాయం రెట్టింపు ఉందని చెప్పారు. సత్య నాదెళ్లలాంటి వాళ్లు మైక్రోసాఫ్ట్‌ వంటి ప్రముఖ కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారని గుర్తుచేశారు. తాను ముఖ్యమంత్రిని కాకముందు ఉమ్మడి ఏపీలో ఇంజనీరింగ్‌ కాలేజీలు సింగిల్‌ డిజిట్‌లో ఉండేవని.. మూడేళ్లలో 300 ఇంజనీరింగ్‌ కళాశాలలు ఏర్పాటుచేశామని తెలిపారు. దీనిపై చాలా మంది విమర్శించారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు బహుళ జాతి సంస్థల సీఈవోలుగా పనిచేస్తున్న ప్రవాస తెలుగు ప్రముఖుల నైపుణ్యాన్ని వినియోగించుకునేందుకు ‘సీఎక్స్‌వో(చీఫ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఆఫీసర్‌) క్లబ్‌’ను ఆయన ప్రారంభించారు. సభలో ఇంకా ఏమన్నారంటే..

పుట్టినగడ్డను మరవొద్దు..

1991లో పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థకు, దశ, దిశ రూపకల్పన చేసిన వ్యక్తి ఆయన. అదే సమయంలో ఇంటర్నెట్‌ విప్లవం మొదలైంది. ఈ పరిణామాలను గుర్తించి భవిష్యత్‌ అంతా ఐటీ, నాలెడ్జ్‌ ఎకానమీకి ఉంటుందని నమ్మాను. నాలెడ్జ్‌ ఎకానమీలో తెలుగుజాతి అగ్రగామిగా ఉండాలంటే ఐటీని ప్రమోట్‌ చేయాలని ఆలోచించాను. సింగపూర్‌లో వేల మంది తెలుగు ప్రజలు ఉన్నారంటే ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఆలోచనలే కారణం. ఒకప్పుడు మహిళలకు విద్య, ఉద్యోగాలు ఎందుకనేవారు. నేను సీఎం అయిన తర్వాత విద్య, ఉద్యోగాల్లో 33శాతం రిజర్వేషన్‌ అమలు చేశాను. విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు.. పుట్టిన గడ్డను మరువొద్దు. జన్మభూమిలో ఉన్న పేదలకు చేయూతనివ్వాలి. ఏపీ ప్రజలు కట్టిన పన్నులతో మీరు ఈ స్థాయికి ఎదిగారు. అవకాశాలు పొందారు. కాబట్టి జన్మభూమి అభివృద్ధికి కృషి చేయడం.. పెట్టుబడులు పెట్టడం అనేది బాధ్యతగా తీసుకోవాలి.

క్రమశిక్షణ కలిగిన దేశం..

ఒక మత్స్యకార గ్రామమైన సింగపూర్‌ నేడు ప్రపంచంలోనే గొప్ప దేశంగా ఎదిగింది. అందుకే ఈ దేశమంటే నాకు గౌరవం. నీతి నిజాయితీతో ఒక వ్యక్తి వేసిన పునాదితో గౌరవప్రదమైన దేశంగా ఎదిగింది. ఇక్కడ అవినీతి చాలా తక్కువ. గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు ఏపీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆయన్ను తీసుకుని సింగపూర్‌ వచ్చాను. ఆయన సిగరెట్లు బాగా తాగేవారు. కానీ ఇక్కడ సిగరెట్లు తాగలేదు. ఎందుకని అడిగితే.. పొరపాటున సిగరెట్‌ తాగితే 500 డాలర్లు జరిమానా వేస్తారని చెప్పారు. అంతటి క్రమశిక్షణ ఉన్న దేశం సింగపూర్‌. ఈ దేశం చాలా కాలం క్రితమే చెత్తను ఎనర్జీగా మార్చే విధానం తీసుకొచ్చింది. ఇక్కడ రాత్రి అంతా రోడ్లను శుభ్రం చేస్తారు. తెల్లారితే రోడ్డుపై ఒక్క కాగితం ముక్క కూడా కనిపించదు. ఈ పరిస్థితిని చూసి ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌లో అమలు చేశాను. ఇప్పుడు ఏపీలో చెత్త సంపద కేంద్రాలు ఏర్పాటు చేశాం. సింగపూర్‌పై ఉన్న ఆ గౌరవంతోనే అమరావతిని సింగపూర్‌ మాదిరి చేస్తానని 2014 ఎన్నికలకు ముందు చెప్పా. చాలా మంది రాజకీయ నేతలు ఇక్కడకు వచ్చి ఎంజాయ్‌ చేసి వెళ్తారు. చంద్రబాబు మాత్రం ఇక్కడకు వచ్చి మనం చేసిన మంచి పనులను తెలుసుకుని వాళ్ల రాష్ట్రంలో అమలు చేస్తున్నారని సింగపూర్‌ దేశ మాజీ ప్రధాని లీ క్వాన్‌ యూ నా గురించి చెప్పారు. అలాంటి సింగపూర్‌లో 40 వేల మంది తెలుగువారు ఉన్నారంటే గర్వంగా ఉంది. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను సింగపూర్‌ ప్రభుత్వం ఉచితంగా తయారుచేసి ఇచ్చింది. సీడ్‌ క్యాపిటల్‌లో సింగపూర్‌ను భాగస్వామిని చేస్తే ప్రపంచంలోని మంచి కంపెనీలను తీసుకొస్తారని భావించా. 2019 తర్వాత సింగపూర్‌ ప్రభుత్వాన్ని తప్పుబట్టే పరిస్థితి తెచ్చారు. పెట్టుబడులైతే తీసుకురాగలను కానీ ప్రభుత్వ బ్రాండ్‌ పోతే ఏపీ నష్టపోతుందని సింగపూర్‌ ప్రభుత్వానికి చెప్పా. గతంలో జరిగిన తప్పులు సరిదిద్దాలని ఇక్కడ పర్యటనకు వచ్చా. సింగపూర్‌ వాళ్లు తిరిగి రాష్ట్రానికి రాకపోవచ్చు. కానీ నాపై నైతిక బాధ్యత ఉంది. మీకు జరిగిన ఇబ్బందికి బాధపడుతున్నాను. దానిని సరిదిద్దడానికే వచ్చానని వారికి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది.

ఏపీలో అపార అవకాశాలు..

గతంలో పోల్చుకుంటే ఇప్పుడు సాంకేతికంగా చాలా అంశాలు అందుబాటులోకి వచ్చాయి. అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీని అభివృద్ధి చేస్తున్నాం. గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీ ప్రకటించాం. పోర్టులు ఎక్కువగా నిర్మించుకోవచ్చు. పోర్టు ఆధారిత పరిశ్రమలు పెద్ద ఎత్తున నెలకొల్పవచ్చు. దేశానికే లాజిస్టిక్స్‌ హబ్‌గా ఏపీ ఉంటుంది. ఆరోగ్య రంగంలో గేట్స్‌ ఫౌండేషన్‌, టాటా సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. చాలా మంది తెలుగు వాళ్లు విదేశాల్లోని ప్రముఖ సంస్థల్లో కీలక స్థానాల్లో ఉన్నారు. ఇలాంటి వారు తమ అనుభవాన్ని ఏపీకి అందించవచ్చు. పెట్టుబడులు పెట్టేలా.. సర్వీస్‌ ప్రొవైడర్లుగా ఉండొచ్చు. మీరు ఏం చేయాలనుకున్నా.. పూర్తిగా సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఆంధ్రలో పరిశ్రమలు స్థాపించేందుకు వీలుగా ‘గ్లోబల్‌ ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ సెల్‌’ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. వివిధ దేశాల్లోని పారిశ్రామికవేత్తలతో తెలుగు పారిశ్రామికవేత్తలను భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తాం. వారితో ఎంవోయూలు కుదుర్చుకునేలా చొరవ తీసుకుంటాం. విదేశాల్లో స్థిరపడిన తెలుగువాళ్లు పీ-4లో భాగస్వాములైతే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. ప్రవాసాంధ్రులు ఏటా రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల వరకు పంపుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ మొత్తం మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాను.

వారి మేలు మరువను..

విదేశాల్లో ఉన్న తెలుగువారు 2024 ఎన్నికల్లో మా కోసం పనిచేశారు. చేయని తప్పునకు 53 రోజులు జైల్లో ఉన్నాను. దేశవిదేశాల్లో స్ధిరపడిన తెలుగువారు నా కోసం పనులు వదిలిపెట్టి ఆందోళనలు చేశారు. నా గురించి వాళ్లు పడిన ఆందోళన, తపన ఎన్నటికీ మరచిపోలేను. ఎన్నికల్లో స్వచ్ఛందంగా వచ్చి పార్టీ కోసం పనిచేశారు. వారి రుణం తీర్చుకోలేను. దేశానికి సరైన నాయకుడిగా ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తున్నారు. రైట్‌ టైం.. రైట్‌ ప్లేస్‌.. రైట్‌ లీడర్‌ మోదీ. ఆయన మనకు పెద్ద వరం. అమెరికాకు చెందిన ఓ సంస్థ చేసిన సర్వేలో ఆయన ప్రపంచంలోనే పాపులర్‌ లీడర్‌గా నంబర్‌ 1 స్థానంలో నిలిచారు. ప్రధానికి 75 శాతం అప్రూవల్‌ రేటింగ్‌ ఉంది. దేశానికి గుర్తింపు, సుస్థిరత ఆయన వల్లే వచ్చింది. ఇలాంటి సమయంలో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లాలి.

నేడు సింగపూర్‌ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ

  • సీఎం చంద్రబాబు రెండో రోజు సోమవారం సింగపూర్‌ ప్రభుత్వ ప్రతినిధులతో పాటు పలు ప్రైవేటు సంస్థల అధిపతులతోనూ సమావేశం కానున్నారు. నగరాల అభివృద్ధి, క్రీడలు, పోర్టు ఆధారిత పరిశ్రమలపై చర్చిస్తారు.

  • ఉదయం 7 గంటలకు ట్రెజరీ బిల్డింగ్‌లో సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్‌ టాన్‌ సీలెంగ్‌తో భేటీ. విద్యుత్‌, సైన్స్‌-టెక్నాలజీ, పారిశ్రామిక సహకారంపై చర్చలు.

  • 8.30 గంటలకు ఎయిర్‌బస్‌ సంస్థ ప్రతినిధులు కృతీవాస్‌, వెంకట్‌తో భేటీ

  • 9 గంటలకు హనీవెల్‌ సంస్థ ప్రతినిధులతో సమావేశం. తర్వాత బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌ భేటీలో పాల్గొంటారు. ‘నైపుణ్యాల నుంచి సామర్థ్యాల వైపు మళ్లడం.. కార్మిక శక్తిని వేగవంతం చేయడం’ అనే అంశంపై చర్చ.

  • 11 గంటలకు ఎవర్వోల్ట్‌ చైర్మన్‌ సైమన్‌తో భేటీ. 11.30కి సింగపూర్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ సందర్శన.

  • మధ్యాహ్నం ఒంటిగంటకు టుయాస్‌ పోర్టులో పర్యటన. ఏపీలో పోర్టు ఆధారిత స్మార్ట్‌ లాజిస్టిక్స్‌, భారీగా తయారీ, ఎగుమతి మౌలిక సదుపాయాలపై ఓడరేవులకు చెందిన ప్రముఖ సంస్థ పీఎ్‌సఏ సీఈవో విన్సెంట్‌తో చర్చలు.

  • సాయంత్రం 4.30కి ఏపీ-సింగపూర్‌ బిజినెస్‌ ఫోరం నిర్వహించే రోడ్‌షోకు హాజరు. సింగపూర్‌, అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమక్షంలో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై సీఎం ప్రసంగం

  • సాయంత్రం 6 గంటలకు అదానీ పోర్ట్స్‌ ఎండీ కరణ్‌ అదానీతో సమావేశం.

కూచిపూడి, కోలాటంతో స్వాగతం

తెలుగు ప్రవాసుల కార్యక్రమం ఐదుగంటలపాటు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. సీఎం సభాప్రాంగణానికి రాగానే సభకు హాజరైన వారంతా లేచి నిలబడి హర్షధ్వానాలు చేశారు. కార్యక్రమం ప్రారంభంలో ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలాపన’ చేశారు. సీఎం రావడానికి రెండు గంటల ముందే సమావేశ ప్రాంగణం మొత్తం నిండిపోయింది. మొత్తం 1,500 మంది కూర్చునే ఓవిస్‌ క్యాంపస్‌ ప్రాంగణం నిండిపోవడంతో పక్కనే ఉన్న మరో ప్రాంగణంలో కూడా కూర్చునే ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి భార్యాపిల్లలు, స్నేహితులతో ప్రవాసులు తరలివచ్చారు. కార్యక్రమం అనంతరం సుమారు 2,500 మందితో చంద్రబాబు ఫొటోలు దిగారు. రెండున్నర గంటలపాటు ఓపిగ్గా నిలబడి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరించారు. మంత్రి లోకేశ్‌ వేదికపైనే ఉండి ప్రతి కుటుంబం సీఎంతో ఫొటోలు దిగేలా పర్యవేక్షించారు. పిల్లలతో వచ్చిన మహిళలను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సింగపూర్‌లో భారత్‌ హైకమిషనర్‌ శిల్పక్‌ అంబులే, మంత్రులు పి.నారాయణ, టీజీ భరత్‌ పాల్గొన్నారు. కార్యక్రమం ఆద్యంతం తెలుగుదనం ఉట్టిపడింది. అంతకుముందు ఆదివారం ఉదయాన్నే సింగపూర్‌ చేరుకున్న చంద్రబాబుకు స్థానిక తెలుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చిన తెలుగు కుటుంబాలు సీఎం, లోకేశ్‌కు హారతులిచ్చి.. నుదుట కుంకుమ దిద్ది ఆహ్వానించారు. కూచిపూడి నాట్యం, కోలాటాలతో స్వాగతించారు.

ప్రవాసులకు వెంకన్న ప్రత్యేక దర్శనం..

తిరుమల బాలాజీ మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం. ఎన్ని కష్టాలున్నా వేంకటేశ్వరస్వామిని తలుచుకుని సంకల్పం తీసుకుంటే సమస్య పరిష్కారమై పని అయిపోతుంది. ఎన్నార్టీలకు తిరుమల వెంకన్న దర్శనం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తాం. ప్రతి దేశ రాజధానిలో స్వామి ఆలయం ఉండాలి. సింగపూర్‌ నుంచి విజయవాడ, తిరుపతి, విశాఖకు నేరుగా విమానాలు వచ్చేలా చూస్తాను. ఈమేరకు కేంద్రంతో మాట్లాడతాను.

ద్వితీయ భాషగా తెలుగు..

సింగపూర్‌లో మొత్తం నాలుగు అధికార భాషలు (మలయ్‌, ఆం గ్లం, మాండరిన్‌, తమిళం) ఉన్నాయి. ఇక్కడి స్కూళ్లలో హిందీ, పంజాబీని కూడా మాతృభాషగా బోధిస్తున్నారు. తెలుగును కూడా వాటిలో ద్వితీయ భాషగా ప్రవేశపెట్టాలి. ఈ మేరకు సింగపూర్‌ ప్రభుత్వాన్ని కోరేందుకు ఇక్కడే ఉన్న భారత హైకమిషనర్‌ చొరవ తీసుకోవాలి.

ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ గ్రీన్ సిగ్నల్.. ప్రధానంగా ఈ రంగాల్లో

బద్వేల్‌లో ఉప ఎన్నిక‌.. ఆదినారాయణరెడ్డి ఏమన్నారంటే..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 28 , 2025 | 08:00 AM