AP P-4 Scheme: మార్గదర్శకులుగా టీచర్లా
ABN, Publish Date - Jul 28 , 2025 | 03:27 AM
పేదలను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన పీ-4 పథకం అమలులో కొందరు అధికారులు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు.
హెచ్‌ఎంలు, ఎస్‌ఏలను ఈ జాబితాలో చేర్చాలని ఒత్తిడి
ఏలూరు డీఈవో ఆదేశాలు.. మండిపడుతున్న ఉపాధ్యాయులు తమనే దత్తత తీసుకోవాలని ఆక్రోశం
అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): పేదలను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన ‘పీ-4’ పథకం అమలులో కొందరు అధికారులు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానోపాధ్యాయులు(హెచ్‌ఎం), స్కూల్ అసిస్టెంట్ల(ఎ్‌సఏ)ను మార్గదర్శులుగా నమోదు చేయాలని తాజాగా ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో) జారీ చేసిన ఆదేశాలపై విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో 190 మంది టీచర్లను మార్గదర్శులుగా నమోదు చేయించాలని డీఈవో ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు లేదా స్కూల్ అసిస్టెంట్లను మార్గదర్శులుగా నమోదు చేయాలని అది కూడా శనివారం సాయంత్రానికి పూర్తిచేయాలని స్పష్టంచేశారు. దీనిపై ఉపాధ్యాయ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వాస్తవానికి పీ-4 పథకం అనేది స్వచ్ఛందంగా అమలుచేయాలి. ఏదైనా కుటుంబాన్ని దత్తత తీసుకునేందుకు ఆసక్తి ఉన్నవారు ముందుకొస్తే వారిని మార్గదర్శులుగా నమోదుచేయాలి. అప్పటి నుంచి ఆ కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడే వరకు మార్గదర్శి బాధ్యత తీసుకుంటారు. కానీ, ప్రభుత్వ ఉద్యోగులైన టీచర్లను బలవంతంగా మార్గదర్శులను చేయాలని ప్రయత్నించడాన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించే ఉపాధ్యాయులు కూడా దీనిని తప్పుబడుతున్నారు. బాగా డబ్బున్నవారు కుటుంబాలను దత్తత తీసుకుంటారుగానీ తమలాంటి చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగులకు అంతస్థాయి ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు. పీఆర్‌సీ, ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నామని తమనే ఎవరైనా దత్తత తీసుకోవాలంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి ఈ ఉత్తర్వులను ఖండించారు. పలు జిల్లాల్లో అధికారులు టీచర్లను మార్గదర్శులుగా నమోదుచేయాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. బలవంతంగా నమోదు చేయిం చే విధానాన్ని విరమించుకోవాలన్నారు.
Updated Date - Jul 28 , 2025 | 03:31 AM