Education Department: బదిలీలు సంపూర్ణం
ABN, Publish Date - Jun 17 , 2025 | 04:29 AM
రాష్ట్రంలో పెద్దఎత్తున ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. ఏకంగా 67,732 మంది టీచర్లు పాఠశాలలు మారారు. భారీ సంఖ్యలో చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ 25 రోజుల వ్యవధిలోనే పూర్తిచేసింది.
67,732 మంది టీచర్ల బదిలీ
అత్యధికంగా 31 వేల ఎస్జీటీలు .. 4,477 మందికి పదోన్నతులు
కొత్త టీచర్లు వస్తే కొరత లేనట్టే.. 25 రోజుల్లో పూర్తి చేసిన విద్యాశాఖ
అమరావతి, జూన్ 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెద్దఎత్తున ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. ఏకంగా 67,732 మంది టీచర్లు పాఠశాలలు మారారు. భారీ సంఖ్యలో చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ 25 రోజుల వ్యవధిలోనే పూర్తిచేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. విజయరామరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. టీచర్ల బదిలీ ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. 4,477 మంది టీచర్లకు పదోన్నతి కల్పించినట్లు పేర్కొన్నారు. గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు 1,494 మంది బదిలీ అయ్యారు. అదేవిధంగా గ్రేడ్-2 హెచ్‌ఎంలుగా 1,375 మందికి పదోన్నతి లభించింది. మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా 5,717 మంది నియామితులయ్యారు. 1,592 మందికి మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎంలుగా పదోన్నతి లభించింది. 5,717 మంది స్కూల్ అసిస్టెంట్లు బదిలీ కాగా, ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా 1,510 మందికి ప్రమోషన్ దక్కింది. 31,174 మంది ఎస్జీటీలు, 1,199 మంది భాషా పండితులు, 344 మంది వ్యాయామ ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు.
అభ్యంతరాల స్వీకరణ
బదిలీలు, పదోన్నతులపై ఏవైనా అభ్యంతరాలుంటే జిల్లా లేదా జోనల్ స్థాయి సమస్యల పరిష్కార కమిటీని సంప్రదించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. తగిన ఆధారాలతో అభ్యంతరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ కమిటీలు తగిన పరిష్కారాలు చూపుతాయని పేర్కొంది.
వారు బదిలీ అయినా వెనక్కి
మెగా డీఎస్సీలో వచ్చే టీచర్ల సంఖ్యను కూడా కలిపి పాఠశాల విద్యాశాఖ టీచర్ల రేషనలైజేషన్ చేసింది. మెగా డీఎస్సీలో 16,347 మంది టీచర్లు భర్తీ అవుతారు. ఈ నేపథ్యంలో ఆయా స్థానాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. దీంతో టీచర్ బదిలీ అయినా ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో ఆ ఖాళీని ఎవరూ భర్తీ చేయకపోతే తిరిగి ఇక్కడే పనిచేయాలని ఆదేశించారు. బదిలీ ఆర్డర్ పొందినవారు కొత్త పాఠశాలలో చేరి, వెంటనే రిలీవ్ అయ్యి తిరిగి పాత పాఠశాలకు రావాల్సి ఉంటుంది. డీఎస్సీ ప్రక్రియ పూర్తయి కొత్త టీచర్లు వస్తే ఈ సమస్య తీరనుంది.
Updated Date - Jun 17 , 2025 | 04:30 AM