Teacher Transfers: టీచర్ల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
ABN, Publish Date - May 21 , 2025 | 02:44 AM
ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చలు విజయవంతం కావడంతో బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుందని, మే 31 వరకు పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు.
చర్చలు సఫలం.. నేడు షెడ్యూల్
విద్యార్థుల సంఖ్య 49కి మించితే
రెండో సెక్షన్ ఏర్పాటుకు ఓకే
ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్
ఉద్యమానికి ఉపాధ్యాయుల స్వస్తి
అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన చర్చలు సఫలం కావడంతో టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. పలు డిమాండ్లపై ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఉద్యమానికి పిలుపునివ్వడంతో ఇటీవల చేపట్టాల్సిన బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ వ్యవహారంపై సోమ, మంగళవారాల్లో సంఘాల నేతలతో అధికారులు చర్చలు జరిపారు. మంగళవారం సచివాలయంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌తో చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. ఈ క్రమంలో బదిలీలకు షెడ్యూలు జారీ చేయాలని నిర్ణయించారు. టీచర్ల బదిలీల వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా, సంఘాలతో జరిగిన చర్చల్లో పలు డిమాండ్లపై అధికారులు సానుకూలంగా స్పందించారు. ఉన్నత పాఠశాలల్లో 45మంది విద్యార్థులు దాటితే రెండో సెక్షన్ ఇవ్వాలని సంఘాలు కోరగా 49 దాటితే రెండో సెక్షన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రతి 40 మంది విద్యార్థులకు అదనంగా సెక్షన్లు కేటాయిస్తారు. అలాగే, సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్ విధానంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అంగీకరించారు. ఫౌండేషనల్ పాఠశాలల్లో 1:20 నిష్పత్తిలో టీచర్లను కేటాయిస్తామన్నారు. 20 మంది దాటితే రెండో టీచర్ పోస్టు కేటాయిస్తారు. 1,382 మంది ఎస్జీటీలకు పదోన్నతి కల్పించి మోడల్ ప్రైమరీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా నియమిస్తారు. ‘తెలుగు మీడియం’ అంశాన్ని మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్తామని అధికారులు హామీ ఇచ్చారు. కాగా, టీడీపీ ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, కంచర్ల శ్రీకాంత్‌లు రంగంలోకి దిగి.. సంఘాల ప్రతినిధులతో మాట్లాడి.. ఉద్యమాన్ని విరమించేలా చేశారు.
రేపటి నుంచి బదిలీల ప్రక్రియ
ఉపాధ్యాయులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బదిలీల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గురువారం విడుదల చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ఉపాధ్యాయ బదిలీల చట్టం ప్రకారం ఇవి జరుగుతాయని తెలిపింది. మే 31 బదిలీలకు తుది గడువుగా నిర్ణయించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్
Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే
Read Latest AP News And Telugu News
Updated Date - May 21 , 2025 | 02:44 AM