Palnadu violence: కాపుకాచి కాళ్లూ చేతులు నరికారు
ABN, Publish Date - Apr 26 , 2025 | 04:35 AM
పల్నాడు జిల్లా గుండ్లపాడులో టీడీపీ లోపలి వర్గాల మధ్య విభేదాల వల్ల కార్యకర్త ఉప్పుతోళ్ల శ్రీనుపై దాడి జరిగింది. ఫ్లెక్సీ వివాదంతో చోటుచేసుకున్న ఈ దాడిలో శ్రీను తీవ్రంగా గాయపడ్డాడు.
ఫ్లెక్సీ వివాదంలో పట్టపగలే టీడీపీ కార్యకర్తపై దాడి
ఇరువర్గాలవారూ వైసీపీ నుంచి వచ్చినవారే
‘తోట చంద్రయ్య’ గ్రామంలో మరో దారుణం
వెల్దుర్తి, ఏప్రిల్ 25 (ఆంరధజ్యోతి): గతంలో టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య హత్యోదంతంతో సంచలనం సృష్టించిన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో మరో దారుణం చోటుచేసుకుంది. ఫ్లెక్సీ వివాదం నేపథ్యంలో టీడీపీ కార్యకర్త ఉప్పుతోళ్ల శ్రీనుపై శుక్రవారం అదేపార్టీలోని మరో వర్గంవారు కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. గతంలో వారంతా ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారైనా ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నారు. అయినా గత మనస్పర్థలు వీడకుండా తరచూ గొడవలకు దిగుతున్నారు. వివరాలివీ.. గతంలో వైసీపీలో క్రియాశీలకంగా ఉన్న చల్లా ఏడుకొండలు, ఉప్పుతోళ్ల వెంకటేశ్వర్లు, గురవయ్య, మశయ్యలతోపాటు మరికొందరు ఎన్నికల సమయంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా గుండ్లపాడులో శ్రీను వర్గానికి చెందిన వారు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 30 ఏళ్లుగా ఈ బజారులో టీడీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయలేదని, మీరెందుకు పెట్టారంటూ వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారు శ్రీను వర్గీయులతో వాగ్వాదానికి దిగారు. మూడు రోజుల క్రితం ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా ఇరువర్గాలను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి బైండోవరు చేశారు.
ఈ క్రమంలో శ్రీను తన తల్లి అలివేలమ్మ మాచర్ల బయలుదేరగా, ఆమెను బస్సు ఎక్కించేందుకు ఇంటికి అతి సమీపంలోనే ఉన్న బస్టాండుకు శ్రీను బైకుపై తీసుకెళ్లాడు. తల్లి ఏదో వస్తువు మరిచిపోవపోవడంతో దాన్ని తెచ్చి ఇచ్చేందుకు తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా కాపు కాచిన ప్రత్యర్థులు రాడ్లు, గొడ్డళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో శ్రీను రెండు కాళ్లూ పూర్తిగా విరిగిపోయాయి. అలాగే రెండు చేతులకూ కూడా గాయాలయ్యాయి. సమీప ఇంటి నుంచి భార్య అంజమ్మ, మరికొందరు వచ్చి అడ్డుకున్నా అప్పటికే శ్రీను తీవ్రంగా గాయపడ్డాడు. ఆటోలో మాచర్లలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకురాగా పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు నరసరావుపేటకు రిఫర్ చేశారు. పోలీసులు మాచర్ల రూరల్ ఆస్పత్రికి వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. కాగా, సంచలనం కలిగించిన తోట చంద్రయ్య హత్య తర్వాతి నుంచి ఈ గ్రామంలో పోలీసు పికెటింగ్ కొనసాగుతోంది. అయినప్పటికీ మారణాయుధాలతో దాడులకు తెగబడడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 26 , 2025 | 04:35 AM