Chandrababu: తోక కట్ చేస్తా
ABN, Publish Date - Jun 17 , 2025 | 04:23 AM
గంజాయి, డ్రగ్స్ బ్యాచ్‌కు వత్తాసు పలుకుతూ రాజకీయం చేస్తే సీరియ్‌సగా ఉంటుంది. మంచిగా ఉంటే ఏమైనా సమాధానం చెబుతా. దారితప్పి పులివెందుల మార్క్ రాజకీయం చేయాలని చూస్తే తోక కట్ చేస్తా. లా అండ్ ఆర్డర్ చేతుల్లోకి తీసుకుంటే సీరియ్‌సగా ఉంటుంది. ఎవ్వరినీ వదిలిపెట్టను...అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.
అధికారంలో ఉన్నప్పుడు రౌడీయిజం చేశారు.. ఇప్పుడూ చేస్తానంటే కుదరదు
ఇక్కడున్నది సీబీఎన్ అని గుర్తుంచుకోండి.. జగన్‌కు ముఖ్యమంత్రి హెచ్చరిక
పరామర్శలు చేసుకోండి.. పోలీసులపై నోరుపారేసుకోవడం సరికాదు
నోరు మూయించే సత్తా టీడీపీకి ఉంది.. వ్యవస్థలు నాశనం.. ఆర్థికం ఛిన్నాభిన్నం
విశాఖ సహజసిద్ధ నగరం.. ముంబైకి దీటుగా అభివృద్ధి చేస్తా: చంద్రబాబు
విశాఖపట్నం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): ‘గంజాయి, డ్రగ్స్ బ్యాచ్‌కు వత్తాసు పలుకుతూ రాజకీయం చేస్తే సీరియ్‌సగా ఉంటుంది. మంచిగా ఉంటే ఏమైనా సమాధానం చెబుతా. దారితప్పి పులివెందుల మార్క్ రాజకీయం చేయాలని చూస్తే తోక కట్ చేస్తా. లా అండ్ ఆర్డర్ చేతుల్లోకి తీసుకుంటే సీరియ్‌సగా ఉంటుంది. ఎవ్వరినీ వదిలిపెట్టను’...అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. జగన్ తెనాలి వెళ్లి రౌడీ, గంజాయి బ్యాచ్‌కు వత్తాసు పలుకుతూ రాజకీయం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలోని వీ కన్వెన్షన్ హాల్‌లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్తలతో సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతోమందితో రాజకీయంగా పోరాటం చేశానన్నారు. కానీ, ప్రస్తుతం రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థులతో పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. అటువంటివారి రాజకీయ ముసుగు తొలగించాలని, నేరస్థులను నేరస్థులుగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. తానెక్కడా రాజీపడనన్నారు. తనకెవరిపైనా కక్ష లేదంటూ.. రాష్ట్రంపై ప్రేమ, పేదలపై అభిమానం మాత్రమే ఉన్నాయన్నారు. తప్పు చేసినవారు ఎవరైనా శిక్షార్హులేనని.. ఎప్పుడైనా తప్పకుండా శిక్ష అనుభవిస్తారని తెలిపారు. జగన్ పొగాకు రైతులను పరామర్శించేందుకు పొదిలి వెళ్లి.. ఎదురొస్తే తొక్కేస్తామంటూ ప్లకార్డులు ప్రదర్శించారని, మీకు ఎదురు ఎవరొస్తున్నారని చంద్రబాబు నిలదీశారు. ‘పరామర్శలు చేసుకోండి. ఆ పేరుతో రౌడీయిజం, రుబాబు చేస్తామంటే కుదరదు. పోలీసులపై దాడి చేయడం, ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడం సరికాదు. నోరు మూయించే సత్తా టీడీపీకి ఉంది’ అని స్పష్టంచేశారు. ఇంకా ఏమన్నారంటే..
వ్యవస్థలన్నీ విధ్వంసం..
కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేను గతంలో ఎన్నడూ చూడని పరిస్థితులు చూస్తున్నా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసానికి గురైంది. అన్ని వ్యవస్థలనూ నాశనం చేసేశారు. విశాఖతోపాటు అనేక ప్రాంతాల్లోని తహశీల్దార్ కార్యాలయాలు, కలెక్టర్ ఆఫీసులు, ఆస్పత్రులు, ఐటీఐలు.. ఇలా కనిపించిన ప్రభుత్వ ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టేసి అప్పులు చేసేశారు. మద్యపానం నిషేధిస్తామని చెప్పి.. వచ్చే 25 ఏళ్లకు మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారు.
అమరావతికి అభ్యంతరం లేదని..
రాజధానిగా అమరావతి ఎంపికపై అభ్యంతరం లేదని చెప్పిన వ్యక్తి మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. రాజకీయాల్లో ఉన్న ఏ వ్యక్తి కూడా ఇటువంటి పనులకు పాల్పడరు. శ్మశానమని, అవసరం లేదని, కేసులు పెట్టి నాశనం చేసే ప్రయత్నం చేశారు. మూడు ముక్కలాట ఆడిన వ్యక్తికి విశాఖ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. విశాఖ సహజసిద్ధమైన నగరం. రాష్ట్రంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరం. రానున్న రోజుల్లో ముంబైకి దీటుగా అభివృద్ధి చేస్తా. విశాఖ అంటే నాకెంతో ఇష్టం. ఇక్కడి ప్రజలు మంచి వాళ్లు. అన్ని వేళల్లో టీడీపీకి అండగా నిలిచారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి నీతి ఆయోగ్ ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఎకనామిక్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. ఈ క్రమంలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు పరుగులు పెట్టిస్తున్నాం. సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు కాబోతోంది. దీనివల్ల విమానాల సంఖ్య పెరగడంతోపాటు మన పిల్లలే అందులో పని చేసే పరిస్థితి వస్తుంది. రాష్ట్రం నుంచి ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో సీట్లను ఇవ్వడం వల్ల ఢిల్లీలో పరపతి పెరిగింది. దీనివల్ల అనేక సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నాం.
రాజకీయ భూతంపై ఆందోళన
రాష్ట్రానికి రూ.9.5 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. పెట్టుబడుల కోసం ఎక్కడకు వెళ్లినా.. మీరున్నారు కాబట్టి వస్తాం.. కానీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది. మళ్లీ వస్తే పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. ఆ భూతాన్ని రాజకీయంగా శాశ్వతంగా భూస్థాపితం చేశానని.. భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నాను. రాజకీయం అంటే తమాషా కాదు. మోసాలు, నేరాలు చేసి ఎదుటి వాళ్లపై వేయకూడదు. బాబాయిని లేపేసి సాక్షి పేపర్, టీవీలో గుండెపోటు అని స్ర్కోలింగ్ వేశారు. నేను కూడా నమ్మేశా. అయితే ఆరోజు నేను కరెక్ట్‌గా వ్యవహరించి ఉంటే ఓడిపోయే వాళ్లం కాదు. సాక్షిలో నారాసుర పేరుతో కథనాలు వండి వార్చారు. కోడి కత్తి డ్రామాలు ఆడాడు.
సూపర్ సిక్స్‌పై జనంలోకి వెళ్లాలి..
ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నాం. ఈ విషయాన్ని ప్రజలకు కార్యకర్తలు తెలియజేయాలి. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని చెప్పాం. చెప్పినట్లుగానే ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ డబ్బులు జమచేశాం. రైతుల కోసం మూడు విడతల్లో అన్నదాతా సుఖీభవ కింద సాయం అందిస్తాం. ప్రతినెలా 1న పెన్షన్లు అందిస్తున్నాం. డీఎస్సీపై తొలి సంతకం పెట్టి 16 వేలకుపైగా పోస్టులను భర్తీ చేస్తున్నాం. దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు అందిస్తున్నాం. టైట్లింగ్ యాక్ట్ తోపాటు కబ్జాలు, సెటిల్‌మెంట్లకు చెక్ పెట్టాం. ]
రిపోర్టు బాగా లేకుంటే పక్కకే
ఎమ్మెల్యేలకు బాబు వార్నింగ్
ప్రజలకు మేలు చేస్తూ 2029 విజయానికి రూట్ మ్యాప్ క్లియర్ చేద్దాం. ఎమ్మెల్యేల పనితీరుపై మొన్న సర్వే చేయించా. ప్రజల్లో రిపోర్టు బాగుంటే జిందాబాద్. లేదంటే నమస్కారం పెట్టి పక్కనపెట్టేస్తా. కార్యకర్తే అధినేత.. దీనిని సాధ్యం చేయడానికి ఎమ్మెల్యేలు పనిచేయాలి. కార్యకర్తల నుంచీ నివేదిక తెప్పించుకుంటా. వాళ్ల మద్దతు లేకపోతే పక్కనపెడతా. మనకు దేశంలో ఏ పార్టీకీ లేనంత సంస్థాగత బలముంది. కోటి సభ్యత్వం ఉంది. 60 ఓట్లు, 20 కుటుంబాలకు ఇద్దరు మనుషులను పెట్టుకున్నాం. కొత్తగా బూత్, యూనిట్, క్లస్టర్ కమిటీలు వేసుకుంటున్నాం. ఇప్పటికే కార్యకర్తలకు పదవులు ఇచ్చాం. ఇంకా ఇస్తాం. రోజులో సగం ప్రజల కోసం, మిగిలిన సగం పార్టీ కార్యకర్తల కోసం పని చేస్తున్నా. గడచిన ఎన్నికల్లో పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేయడానికి వారు ఎంతగానో కృషిచేశారు. వారికి అండగా ఉంటాం.
Updated Date - Jun 17 , 2025 | 04:25 AM