TDP Ministers and MPs: రహదారుల అభివృద్ధి పనులను చేపట్టండి
ABN, Publish Date - Jul 31 , 2025 | 05:27 AM
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లోని రహదారుల అభివృద్ధి పనులు చేపట్టాలని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రి గడ్కరీకి మంత్రి సత్యకుమార్, ఎంపీ కేశినేని వినతి
2న రాష్ట్రానికి రానున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ, జూలై 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వివిధ జిల్లాల్లోని రహదారుల అభివృద్ధి పనులు చేపట్టాలని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. బుధవారం పార్లమెంటులో కేంద్ర మంత్రి కార్యాలయంలో ఆయనతో మంత్రి సత్యకుమార్, ఎంపీ కేశినేని చిన్ని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వివిధ రహదారుల విస్తరణ, కొత్త రహదారుల నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతూ వారు వినతిపత్రాలు అందించారు. కాగా, ఏపీలో రూ.9,500 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్థి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కోసం ఆగస్టు 2న కేంద్ర మంత్రి గడ్కరీ రాష్ట్రానికి వస్తున్నారని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
గడ్కరీని కలిసిన టీడీపీ ఎంపీలు
ఏపీలో ప్రాంతీయ అనుసంధానాన్ని పెంచడానికి ముఖ్య జాతీయ రహదారి, పట్టణ రవాణా ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని మంత్రి నితిన్ గడ్కరీకి టీడీపీ ఎంపీలు విన్నవించారు. బుధవారం పార్లమెంటులో కేంద్రమంత్రితో ఆయన కార్యాలయంలో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. ఎన్‌హెచ్-65 (కానూరు-మచిలీపట్నం వరకు) విస్తరణ పనులు చేపట్టాలని, ఎన్‌హెచ్-65లో హైదరాబాద్ నుంచి అమరావతికి నిరంతరాయ రాకపోకల కోసం సదుపాయాలు కల్పించాలని, విశాఖపట్నం, విజయవాడలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు నిర్మించాలని ఎంపీలు కోరారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయలు, తెన్నేటీ కృష్ణప్రసాద్, కలిశెట్టి అప్పలనాయుడు, జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ ఉన్నారు.
సాగునీటి ప్రతిపాదనల అమలుకు సహకరించండి
కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు టీడీపీ ఎంపీల వినతి
ఏపీ ప్రభుత్వం సమర్పించిన జల, సాగు నీటి సంబంధిత ప్రతిపాదనల అమలుకు సహకారం అందించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు టీడీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు నేతృత్వంలో టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయులు, కలిశెట్టి అప్పలనాయుడు, సానా సతీశ్... బుధవారం సీఆర్ పాటిల్‌తో భేటీ అయ్యారు. ఇటీవల కేంద్రం పునరుద్ధరించిన జల్ జీవన్ మిషన్‌ను రాష్ట్రంలో అమలు చేసేందుకు సహకారం అందించాలని కోరారు. పీఎంకేఎస్‌వైలోని ‘హర్ ఖేత్ కో పానీ’ కింద ఉపరితల చిన్న నీటిపారుదల పథకంలో ఏపీని చేర్చాలని కోరారు.
Updated Date - Jul 31 , 2025 | 05:31 AM