Kadapa Mahanadu: కార్యకర్తకు జై
ABN, Publish Date - May 28 , 2025 | 05:29 AM
టీడీపీ అధినేత చంద్రబాబు కార్యకర్తల త్యాగాలు, పోరాటాలను స్మరించి గౌరవపూర్వకంగా అభినందించారు. కడప మహానాడు సందర్భంగా పార్టీ ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేయనున్నట్లు, కడపలో క్లీన్స్వీప్ చేయాలని చెప్పారు.
వారి త్యాగాలతోనే ఈ అధికారం: చంద్రబాబు
వారి పోరాటాలతోనే నేటి ఈ స్థానం.. మహానాడు వేదికగా పాదాభివందనం చేస్తున్నా
చంద్రయ్య స్ఫూర్తి అజరామరం
వైసీపీ పాలనలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టారు. ప్రశ్నించిన గొంతుల్ని నొక్కడానికి గ్రామ స్థాయి నాయకుల గొంతులను కోశారు. మన పసుపు సింహం.. మన చంద్రయ్య పీక కోస్తుంటే కూడా ‘జై టీడీపీ’ అంటూ ప్రాణాలు వదిలారు. అలాంటి స్ఫూర్తి మన పార్టీని నడిపిస్తోంది. అది శాశ్వతంగా ఉంటుంది. మహానాడు వేదికగా మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. మీ త్యాగాలను వృథా కానివ్వకుండా తగిన గుర్తింపు, సంక్షేమం అమలు చేసి చూపిస్తాం. -చంద్రబాబు
త్యాగాలను వృథా కానివ్వం.. గుర్తింపు ఇస్తాం.. సంక్షేమం అమలు తథ్యం
టీడీపీ విధానాలు, ఆలోచనలు.. అన్ని పార్టీలకూ బ్లూప్రింట్
ప్రజల వద్దకు పాలన, జవాబుదారీని దేశానికి పరిచయం చేశాం
తెలుగు రాష్ట్రాల్లోని నాయకులంతా టీడీపీ వర్సిటీలో చదివిన విద్యార్థులే
11 నెలల్లో 4.95 లక్షల కోట్ల పెట్టుబడులు.. సూపర్ 6 అమలు బాధ్యత మాది
విధ్వంస పాలకుల స్కాముల్ని లెక్కిస్తున్నాం.. ఎవరు అవినీతి చేసినా వదిలిపెట్టం
పెద్ద నోట్లు రద్దు చేయాలి.. డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలి
అప్పుడే దేశంలో అవినీతి అంతం.. ప్రధానికి నివేదిక ఇచ్చా: సీఎం
(మహానాడు ప్రాంగణం నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
‘మీరు చేసిన పోరాటాలే నేటి ఈ అధికారం. మీ త్యాగాలే నేటి ఈ స్థానం’ అని టీడీపీ కార్యకర్తలనుద్దేశించి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ ‘చైతన్య రథం’ నుంచి తాను చేపట్టిన ‘వస్తున్నా మీ కోసం’, లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి ఉందని చెప్పారు. గత ప్రభుత్వంలో పాలన అంటే హత్యా రాజకీయాలు, కక్ష సాధింపులుగా మార్చేశారని మండిపడ్డారు. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెలిపారు. టీడీపీ నాయకులపైనా, కార్యకర్తలపైనా అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టారని.. అయినా ఎత్తిన జెండా దించకుండా పోరాడారని వారిని ప్రశంసించారు. టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా మూడ్రోజులు నిర్వహించే పసుపు పండుగ మహానాడు మంగళవారం కడప శివార్లలో ప్రారంభమైంది. ఈ పండుగ ఇక్కడ జరుగడం ఇదే మొదటిసారి. ప్రాంగణంలోని ప్రతినిధుల నమోదు కౌంటర్‌లో చంద్రబాబు తన ఐడీ కార్డుతో పేరు నమోదు చేసుకుని వేదికను అధిరోహించారు.ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యాతగా మహానాడు ప్రతినిధుల సభ మొదలైంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో అకృత్యాలకు అసువులు బాసిన కార్యకర్తలు, నాయకులతో పాటు పహల్గాం ఉగ్రదాడి మృతులకు, ఆపరేషన్ సిందూర్‌లో అమరులైన వీర సైనికులకు సంతాపం ప్రకటించారు.
వేదిక మీద 2నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం చంద్రబాబు సుదీర్ఘంగా ప్రసంగించారు. 1947లో దేశ ప్రజలకు స్వాతంత్య్రం, స్వేచ్ఛ వచ్చాయని.. 2024లో వైసీపీని చిత్తుగా ఓడించిన తర్వాత రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్రం మరోసారి వచ్చిందని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..
టీడీపీ బ్రాండ్ అంటే అదీ..!
ప్రజల జీవితాలను ప్రభావితం చేసిన ఏకైక పార్టీ టీడీపీ. అభివృద్ధి అంటే మన పార్టీ ఆవిర్భావానికి ముందు, తర్వాత అని చెప్పుకోవచ్చు. నాతో సహా అందరం రాజకీయ పాఠశాలలో నిత్య విద్యార్థులమే. నేను నిరంతరం పోరాటం చేసే సైనికుడిని. నా శక్తి, నా ఆయుధాలు మీరే. మీరు, నేను కలిస్తే ఆకాశమే హద్దుగా ఏ పనైనా చేయగలుగుతాం. పాజిటివ్ పాలిటిక్స్‌తో రాజకీయాల్లో విలువలు పెంచిన ఏకైక పార్టీ టీడీపీ. తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీలో చూసినా టీడీపీ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారంటే అదీ టీడీపీ సత్తా. ఒక ప్రాంతీయ పార్టీగా కోటి సభ్యత్వాలను 45రోజుల్లో పూర్తి చేసిన ఏకైక పార్టీ టీడీపీ. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న అనేక నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించింది. పార్టీ విధానాల్లో నూతనత్వాన్ని తీసుకొద్దాం. ఈ మహానాడులో అనేక నిర్ణయాలు చర్చించి భావితరాల భవిష్యత్ కోసం రూపొందిస్తాం.
కడపలో క్లీన్‌స్వీప్ చేయాలి..
ఇన్నాళ్లూ రాయలసీమలో మహానాడు అంటే తిరుపతే గుర్తొచ్చేది. కానీ కడపలో తొలిసారి జరుగుతున్న ఈ మహానాడు చరిత్ర సృష్టించనుంది. ఇప్పటివరకు 34 పసుపు పండుగలు జరుపుకొన్నాం. గతంలో అవి నిర్వహించే సమయాల్లో ఎండ, వేడి ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు కడపలో చల్లటి వాతావరణంలో జరుగుతోంది. ఉమ్మడి కడపలో 10కి 7 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి సత్తా చాటాం. ఈసారి 10కి 10 గెలిచి క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించాలి.
సూపర్ సిక్స్ అమలు చేసి తీరతాం
ఎవరెన్ని మాట్లాడినా సూపర్ సిక్స్ హామీలను అమలుచేసి తీరతాం. ఆ బాధ్యత మేం తీసుకుంటాం. తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ పథకాలను అమలు చేయనున్నాం. ఆగస్టు 10 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం. అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చాం. గత ఐదేళ్లలో ఇరిగేషన్‌కు ఒక్కపైసా ఖర్చు చేయలేదు. హంద్రీనీవాను ఈ ఏడాది పూర్తి చేసి చివరి ఎకరాకు నీళ్లిస్తాం. రాజకీయ అవినీతిని ప్రజలు పట్టించుకోరనేది నిజం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ‘రాజా ఆఫ్ కరెప్షన్’ అనే పేరుతో రూ.లక్షల కోట్ల అవినీతిపై టీడీపీ చేసిన పోరాటం నిజమని సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు తేల్చాయి. అదే మన విశ్వసనీయత. వాస్తవాలతో అవినీతిపై పోరాడిన పార్టీ టీడీపీ. హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డు, వ్యాన్‌పిక్, ఇందూ, లేపాక్షి భూములపై పోరాడాం. ఓబుళాపురం అక్రమ మైనింగ్‌పై మనం చేసిన ఉద్యమం ఒక సంచలనం. మన ప్రతి పోరాట ఫలితం నేడు కళ్ల ముందు కనపడుతోంది. కూటమి అధికారంలోకి వచ్చాక విధ్వంస పాలకుల స్కాముల్ని లెక్కిస్తున్నాం. ఎవరు అవినీతి చేసినా వదిలిపెట్టం. రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం లేకుండా ప్రజలకు సేవ చేయాలి. డిజిటల్ కరెన్సీ పెట్టాలని ప్రధానికి నివేదిక ఇచ్చాను. దీనివల్ల అక్రమార్కులను తేలిగ్గా పట్టుకోవచ్చని చెప్పాను. పెద్దనోట్లు రద్దు చేస్తేనే అవినీతి పోతుంది.
పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగించి..
11 నెలల్లో 6 రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశాలు పెట్టి 76 ప్రాజెక్టులకు క్లియరెన్సు ఇచ్చాం. వీటివల్ల రూ.4.95 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4.57 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగించి పెట్టుబడులు తెస్తున్నాం. ప్రపంచంలో తెలుగు జాతి నం-1గా ఉండేందుకు కృషి చేస్తా. కడప జిల్లా కొప్పర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లును పారిశ్రామికవాడలుగా తీర్చిదిద్దుతాం. రాష్ట్రంలో 5 రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్‌లను ప్రారంభిస్తున్నాం. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురం కేంద్రాలుగా 5 జోన్లు పెట్టి కుటుంబానికో ఒక పారిశ్రామికవేత్తను ప్రమోట్ చేసేలా ముందుకెళ్తు న్నాం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 78 ఏళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో.. రాబోయే 22 ఏళ్లలో అంతకంటే రెట్టింపు అభివృద్ధి జరిగే అవకాశముంది. విజన్-2047తో జీరో పావర్టీ సాధించి దేశానికి దశ-దిశను నిర్దేశిస్తాం. పీ-4 ద్వారా ఆర్థిక అసమానతలను తగ్గిస్తాం.
సంక్షేమం, అభివృద్ధికి టీడీపీ ట్రెండ్ సెట్టర్. బడుగు బలహీన వర్గాలకు అధికారం చూపించిన పార్టీ టీడీపీ. బీసీలు అడిగే పరిస్థితి నుంచి శాసించే పరిస్థితికి తెచ్చిన పార్టీ టీడీపీ.
టీడీపీ కూటమి పాలనతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. చీకటి తొలగి భవిష్యత్‌పై ఆశలు పెరిగాయి. తమ జీవితాలను బాగు చేస్తామని ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా పాలన సాగిస్తున్నాం.
టీడీపీ విధానాలు, ఆలోచనలు దేశంలోని రాజకీయ పార్టీలకు బ్లూప్రింట్‌గా నిలిచాయి. ప్రజల వద్దకు పాలన, జవాబుదారీ వ్యవస్థను దేశానికి పరిచయం చేశాం. సామాజిక న్యాయం అనేది టీడీపీ తెచ్చిన అతిపెద్ద సామాజిక విప్లవం.
- చంద్రబాబు, టీడీపీ అధినేత
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News
Updated Date - May 28 , 2025 | 05:59 AM