Political Coordination: ఆ స్థానాల్లో టీడీపీ ఇన్‌చార్జులు
ABN, Publish Date - Jul 09 , 2025 | 05:28 AM
గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీలకు కేటాయించిన నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై టీడీపీ అధిష్ఠానం దృష్టి సారించింది. ఆ రెండు పార్టీల నాయకులతో సమన్వయం చేసుకుంటూనే టీడీపీని పటిష్ఠం చేసే నాయకులను నియోజకవర్గ ఇన్‌చార్జులుగా...
‘జనసేన, బీజేపీ’ నియోజకవర్గాలపై నాయకత్వం కసరత్తు
విభేదాలకు తావివ్వని నేతలకు అవకాశం
పిఠాపురం బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే వర్మకే!
విజయవాడ పశ్చిమకు బుద్దా వెంకన్న?
అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీలకు కేటాయించిన నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై టీడీపీ అధిష్ఠానం దృష్టి సారించింది. ఆ రెండు పార్టీల నాయకులతో సమన్వయం చేసుకుంటూనే టీడీపీని పటిష్ఠం చేసే నాయకులను నియోజకవర్గ ఇన్‌చార్జులుగా నియమించేందుకు కసరత్తు చేస్తోంది. ఆయాచోట్ల ప్రస్తుతం పార్టీ సమన్వయకర్తలు ఉన్నా.. వారు పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలు చేపట్టకపోవడం.. మిత్రపక్షాలతో సమన్వయలోపం వంటి కారణాలతో కొత్త ఇన్‌చార్జులను నియమించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా టీడీపీ 21 అసెంబ్లీ స్థానాలను జనసేనకు, 10 సీట్లను బీజేపీకి కేటాయించింది. జనసేన పోటీచేసిన అన్ని స్థానాల్లో.. తిరుపతి, రైల్వే కోడూరు, తెనాలి, అవనిగడ్డ, పోలవరం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరం, నిడదవోలు, రాజానగరం, పి.గన్నవరం, రాజోలు, పిఠాపురం, కాకినాడ రూరల్, అనకాపల్లి, విశాఖపట్నం దక్షిణం, యలమంచిలి, పెందుర్తి, పాలకొండ, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో విజయం సాధించింది. బీజేపీ 10 స్థానాలకు గాను 8 స్థానాల్లో.. విశాఖ ఉత్తరం, విజయవాడ పశ్చిమ, ఆదోని, ధర్మవరం, జమ్మలమడుగు, ఎచ్చెర్ల, అనపర్తి, కైకలూరుల్లో గెలిచింది. బద్వేలు, అరకు సీట్లలో ఓడిపోయింది. ఈ 31 స్థానాల్లో ఇప్పుడు టీడీపీ సమన్వయకర్తలున్నా పార్టీ కార్యకర్తలను పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో కేడర్ బలహీనపడే ప్రమాదం ఉందని భావించిన నాయకత్వం పూర్తిస్థాయి ఇన్‌చార్జుల నియామకంపై దృష్టిపెట్టింది.
సమన్వయంతో నడిచే నాయకులకే పెద్దపీట
టీడీపీ ఇన్‌చార్జుల నియామకంపై టీడీపీ పెద్దలు ఆచితూచి అడుగు వేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఉన్న జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ విభేదాలకు తావు లేకుండా పనిచేసే నాయకులను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్ వర్మకు అప్పగించాలని నిర్ణయించారు. వర్మ తనకు ఎమ్మెల్సీ ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉండడంతో ఆయన్ను ఇటీవల చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు. నియోజకవర్గంలో జనసేన శ్రేణులతో సమన్వయం చేసుకుంటూనే టీడీపీని బలోపేతంపై దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. కాకినాడ రూరల్‌లో ప్రస్తుతం సమన్వయకర్తగా పిల్లి అనంతలక్ష్మి, సహాయ సమన్వయకర్తగా కటకంశెట్టి బాబీ ఉన్నారు. పిల్లి వర్గంపై స్థానికంగా టీడీపీ శ్రేణుల్లో వ్యతిరేకత ఉందని.. దీంతో బాబీకి బాధ్యతలు అప్పగించే అవకాశముందని అంటున్నారు. అనపర్తి ఇన్‌చార్జిగా ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనయుడు మనోజ్‌ను నియమించనున్నారు. రాజోలు ఇన్‌చార్జిగా గుబ్బల శ్రీనివాస్, విజయవాడ పశ్చిమ-మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, తిరుపతి-సుగుణమ్మ, అవనిగడ్డలో బొబ్బా గోవర్ధన్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మిగతా నియోజకవర్గాలపై కసరత్తు జరుగుతోంది.
Updated Date - Jul 09 , 2025 | 05:28 AM