Panchayat Raj Reforms: గ్రామాల్లో.. స్వచ్ఛరథం
ABN, Publish Date - Aug 04 , 2025 | 04:01 AM
గ్రామాలను ప్లాస్టిక్ వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ రథం పేరుతో ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా ప్లాస్టిక్ వస్తువులు సహా ఐరన్, అట్టపెట్టెలు ఇతర పనికిరాని వస్తువులను తీసుకుని..
వ్యర్థాల సేకరణకు వినూత్న విధానం
ప్లాస్టిక్ వస్తువులు, అట్టపెట్టెలు వంటివి తీసుకుని నిత్యావసర సరుకుల పంపిణీ
గుంటూరు.. లాలుపురంలో పైలట్ ప్రాజెక్టు
అంచలంచెలుగా అన్ని గ్రామాలకూ విస్తరణ
ప్రాజెక్టుకు ఎండీయూ వాహనాల వినియోగం
ప్లాస్టిక్ రహిత గ్రామాలే లక్ష్యంగా అడుగులు
అమరావతి/గుంటూరు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): గ్రామాలను ప్లాస్టిక్ వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘స్వచ్ఛ రథం’ పేరుతో ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా ప్లాస్టిక్ వస్తువులు సహా ఐరన్, అట్టపెట్టెలు ఇతర పనికిరాని వస్తువులను తీసుకుని.. దానికి బదులుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ రథా’లను ప్రస్తుతం గుంటూరు గ్రామీణ ప్రాంతం లాలుపురంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. వాటర్ బాటిళ్లు, పాలిథీన్ సంచులు, పాడైన ప్లాస్టిక్ వస్తువులు.. ఇలా ఇంట్లో పనికిరాని వాటిని బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా.. స్వచ్ఛరథం ద్వారా సేకరిస్తున్నారు. వ్యర్థాలు తీసుకుని ఇచ్చే నిత్యావసరాల్లో.. పప్పు, ఉప్పు, చింతపండు, సబ్బులు వంటివి ఉంటున్నాయి. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆదేశాలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కృష్ణతేజ లాలుపురంలో ‘స్వచ్ఛరథం’ స్కీంకు శ్రీకారం చుట్టారు.
గతంలో కూడా..
గత టీడీపీ ప్రభుత్వంలో ఘన వ్యర్థాల నిర్వహణ కోసం షెడ్డుల నిర్మాణాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేలకు పైగా ఘన వ్యర్థాల షెడ్డులను నిర్మించారు. తెచ్చిన చెత్తను వేరు చేసి వర్మికంపోస్టుగా మార్చి రైతులకు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, వైసీపీ హయాంలో ఈ ప్రక్రియను పక్కన పెట్టేశారు. తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చాక.. వినూత్న ఆలోచనతో ముందుకు సాగాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తడి, పొడి చెత్తతో పాటు నిరుపయోగమైన ప్లాస్టిక్ తదితర వేస్టు సేకరణ కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గత వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్(ఎండీయూ)లను రద్దు చేసి రేషన్ షాపుల నుంచి సరుకులు తీసుకునే విధానం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆ వాహనాల ఆపరేటర్లకు ఉపాధి కల్పించడంతో పాటు ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను సేకరించేందుకు వాటిని వినియోగించాలని నిర్ణయించారు. ఈ వాహనాలకు నెలకు రూ.25 వేల చొప్పున చెల్లించి వ్యర్థాలను తరలించేలా చర్యలు తీసుకున్నారు. ప్రజల నుంచి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను బయట మార్కెట్‌లో విక్రయించి.. దానికి సరిపడా నిత్యావసర వస్తువులు తెచ్చుకునే బాధ్యత ఎండీయూ ఆపరేటర్లపై ఉంచారు. ఈ ప్రాజెక్టు వల్ల పంచాయతీలకు, ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉండదు. 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలు స్వచ్ఛరథం కోసం వాడుకోవచ్చు.
గుంటూరులో పైలట్ ప్రాజెక్టు
స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని గుంటూరు రూరల్ మండలంలోని లాలుపురంలో ప్రారంభించారు. మొదట ఏడాది పాటు జడ్పీ సాధారణ నిధులుగాని, 15వ ఆర్థిక సంఘం టైడ్ గ్రాంటు గాని దీనికోసం వినియోగించుకోవచ్చని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గుంటూరు జడ్పీ సీఈవోకు అనుమతిచ్చారు. పైలట్ ప్రాజెక్టును విజయవంతం చేసి మిగిలిన గ్రామాలకు కూడా అంచలంచెలుగా విస్తరించాలని నిర్ణయించారు. ఏడాదిలో రూ.10 లక్షలలోపు నిధులను ఈ ప్రాజెక్టుకు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాతో పాటు కృష్ణా జిల్లా రామవరప్పాడు వంటి గ్రామ పంచాయతీల్లో కూడా స్వచ్ఛరథాలను సిద్ధం చేశారు. ముఖ్యంగా మేజర్ పంచాయతీలు, జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న పంచాయతీల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొదట జిల్లాకో గ్రామ పంచాయతీని ఎంపిక చేసుకుని స్వచ్ఛరథం ఏర్పాటు చేసి.. తర్వాత అంచలంచెలుగా మండలానికో పంచాయతీలో స్వచ్ఛ రథం ఏర్పాటు చేయనున్నారు.
చెత్త తీసుకుని ఇచ్చేవి ఇవే..
‘స్వచ్ఛ రథం’ వద్ద పాత ఇనుము, పేపర్లు, పుస్తకాలు, అట్టపెట్టెలు, ప్లాస్టిక్, గాజు సీసాలు, స్టీల్, అల్యూమినియం వస్తువులను తీసుకుంటారు. వీటికి విలువ కట్టి.. నిత్యావసరాలైన కొబ్బరినూనె, సర్ఫ్ ప్యాకెట్, బట్టలసబ్బులు, ఒంటి సబ్బులు, టీ, కాఫీ పౌడర్లు, లేస్ ప్యాకెట్లు, పేస్ట్, షాంపూ ప్యాకెట్లు, ఉల్లిపాయలు, టూత్ బ్రష్‌లు, పెన్నులు, పెన్సిళ్లు, గోధుమపిండి, వేరుశనగ గుళ్లు, మినపగుళ్లు, కందిపప్పు తదితర నిత్యావసరాలు ఇస్తున్నారు. కేజీ ప్లాస్టిక్‌కి రూ.20 చొప్పున లెక్క కట్టి సరుకులు ఇస్తున్నారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని స్వచ్ఛరథం ఆపరేటర్లు తెలిపారు. కాగా, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ఇటీవలే వెంగళాయపాలెం గ్రామానికి వచ్చి పైలట్ ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించారు.
Updated Date - Aug 04 , 2025 | 04:06 AM