పోలీసుల అదుపులో నిందితులు..?
ABN, Publish Date - Mar 17 , 2025 | 12:30 AM
టీడీపీ నాయకుడు సంజన్న హత్య కేసులో నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం.
ఫ టీడీపీ నేత హత్య కేసులో పురోగతి ఫ నిందితులను పట్టించిన ఫోన కాల్
ఫ ఎస్పీ సీరియస్‌తో జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్
కర్నూలు క్రైం, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): టీడీపీ నాయకుడు సంజన్న హత్య కేసులో నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. రెండు రోజుల కిందట షరీననగర్‌లో సంజన్నను కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అంజి అతని కొడుకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నాలుగు ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ దర్యాప్తులోని బృందం అంజి అతని ముగ్గురు కొడుకులతోపాటు అశోక్ అనే మరో వ్యక్తిని జగన్నాథగట్టు కొండల్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
ఫ పోలీసుల కళ్లు గప్పేందుకు కారు వదిలేసి..
హత్య చేసిన తర్వాత అంజి అతని కొడుకులు హత్యా ఘటన ప్రాంతం నుంచి ఓ కారులో పరారయ్యారు. ఆ కారును గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని ఓ హోటల్ వద్ద వదిలేసి మరో కారులో పరారయ్యారు. పోలీసు కళ్లు గప్పేందుకే ఆ కారును అక్కడే వదిలేసి మరో కారులో పరారైనట్లు తెలిసింది. ఆ తర్వాత చిన్నటేకూరు వెళ్లి అక్కడి నుంచి జగన్నాథగట్టు ప్రాంతంలో ఉన్న ఓ కాలనీకి వెళ్లినట్లు సమాచారం. హత్య ఘటనకు కొన్ని గంటల ముందే అంజి తన భార్యను, కోడళ్లను ఎమ్మిగనూరు ప్రాంతంలోని ఓ గ్రామానికి పంపినట్లుగా సమాచారం. తన కుటుంబ సభ్యులపై సంజన్న వర్గీయులు దాడి చేస్తారని భావించి ఈ ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. ఆధిపత్య పోరు కోసమే ఈ హత్య చేసినట్లుగా పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ రోజు ఉదయమే ఇమ్రాన అనే వ్యక్తి కూడా తనతో గొడవకు దిగడంతో సంజన్నను చూసుకునే ఇలాంటి వారందరూ తనపై కాలు దువ్వుతున్నారని భావించి ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత ఓ అడ్వకేట్ ద్వారా ఓ పోలీసుతో బేరసారాలు మాట్లాడేందుకు పురమాయించడాని సమాచారం. అయితే ఈ ఘటనపై పోలీసు ఉన్నతాఽధికారులు చాలా సీరియస్‌గా ఉన్నారని, రాష్ట్ర స్థాయిలో డీజీపీ ఈ కేసుపై సమీక్షిస్తున్నారని, అలాంటివేమీ కుదరదన్నట్లు చెప్పినట్లుగా తెలిసింది. ఆ తరువాత డబ్బుల కోసం ఓ వ్యక్తికి ఫోన చేసేందుకు అంజి ఫోన ఆన చేయడంతో పోలీసులకు దొరికిపోయినట్లుగా తెలుస్తోంది. రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నట్లుగా సమాచారం. హత్య చేసేందుకు వెనుక ఎవరి ప్రోద్బలమైనా ఉందా.. ఎవరివైనా అండదండలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఫ హత్య ఘటనపై ఎస్పీ సీరియస్
ఈ హత్య ఘటనపై నాలుగో పట్టణ పోలీసుల పని తీరుపై ఎస్పీ విక్రాంత పాటిల్ సెట్ కాన్ఫరెన్సలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంజిని ఎన్నిసార్లు స్టేషనకు పిలిపించి కౌన్సోలింగ్ ఇచ్చారని అడిగినట్లు సమాచారం. కొద్ది కాలంగా అంజి ఆ ప్రాంతంలో హల్‌చల్ చేస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని, ఆయన కదలికలపై ముందుగా నిఘా పెట్టి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఈ ఘటన విషయంలో ఒకరిద్దరు పోలీసులపై ఉన్నతాధికారులు కొరఢా ఝుళిపించే అవకాశం ఉంది. ఎస్పీ సీరియస్ కావడంతో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు రౌడీషీటర్లకు ఆదివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. రౌడీషీటర్లను స్టేషనకు పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
Updated Date - Mar 17 , 2025 | 12:30 AM