Election Code Violation: మోహన్‌బాబు కేసులో తీర్పు రిజర్వ్
ABN, Publish Date - Jul 23 , 2025 | 06:46 AM
సినీ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.
కోడ్ అమల్లో ఉండగా ధర్నాపై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు
న్యూఢిల్లీ, జూలై 22(ఆంధ్రజ్యోతి): సినీ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. తన విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ 2019లో తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారిపై విద్యార్థులతో ఆయన ధర్నా నిర్వహించారు. అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో మోహన్‌బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై కేసు కొట్టివేయాలని కోరుతూ ఈ ఏడాది మార్చి 30న మోహన్‌బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట ఆ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ప్రభుత్వం నుంచి విద్యాసంస్థలకు అందాల్సిన బిల్లులు రావడం లేదని నిరసన తెలిపితే, కోడ్ ఉల్లంఘన కేసు పెట్టారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది ప్రేరణ సింగ్ బదులిస్తూ.. ఆ ధర్నా వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిందన్నారు. నిరసనలో ఎంతమంది పాల్గొన్నారని జస్టిస్ నాగరత్న ప్రశ్నించగా.. కొంతమందని ప్రేరణ సింగ్ చెప్పారు. దీంతో జస్టిస్ నాగరత్న అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుందని, ఏవేవో సెక్షన్ల కింద కేసులెలా నమోదు చేస్తారని అన్నారు. తీర్పును రిజర్వ్ చేశారు. ఇదే కేసులో తిరుపతిలోని ట్రయల్ కోర్టుకు మోహన్‌బాబు తప్పనిసరిగా విచారణకు హాజరవ్వాలని గత విచారణలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా, ఆ కేసు విచారణ ఎప్పుడుందని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. గురువారమే ఉందని న్యాయవాది బదులిచ్చారు. దీంతో ఇరుపక్షాలూ ఏమైనా ఉంటే ఈ నెల 25లోపు రాతపూర్వకంగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.
Updated Date - Jul 23 , 2025 | 06:46 AM