Supreme Court: మూడు నెలల్లోగా తేల్చండి
ABN, Publish Date - Aug 01 , 2025 | 05:20 AM
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సాధ్యమైనంత త్వరగా లేదా మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై నిర్ణయం తీసుకోండి
హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం.. డివిజన్ బెంచ్ తప్పిదం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సాధ్యమైనంత త్వరగా లేదా మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనర్హత పిటిషన్‌లో పేర్కొన్న ఎమ్మెల్యేలు ఎవరూ విచారణను ఆలస్యం చేయడానికి అనుమతించకూడదని, ఎవరైనా ఆ దిశగా ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణించాలని స్పీకర్‌కు సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీ్‌హలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పును వెలువరించింది. రాజకీయ ఫిరాయింపుల నిలువరించకపోతే ప్రజాస్వామ్యానికే అవి నష్టం తేగలవని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆ అధికారం స్పీకర్‌కే ఉందని స్పష్టం చేసింది. అదే సమయంలో అనర్హత పిటిషన్లు సమర్పించి దాదాపు ఏడు నెలలు గడిచినా నోటీసులు జారీ చేయకపోవడం, కోర్టులో కేసు దాఖలు చేసిన తర్వాతే నోటీసులు జారీ చేయడంపై స్పీకర్‌ను తప్పుబట్టింది.
డివిజన్ బెంచ్ జోక్యం ఎందుకు?
ఈ కేసుపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. అనర్హత పిటిషన్లపై విచారించేందుకు సమయాన్ని నిర్ణయించమని స్పీకర్‌ను కోరారని, పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. అయినప్పటికీ.. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడం ద్వారా డివిజన్ బెంచ్ తప్పిదానికి పాల్పడిందని స్పష్టం చేసింది.
ఇదీ నేపథ్యం...
ఎమ్మెల్యేలు దానంనాగేందర్, తెల్లంవెంకట్రావ్, కడియం శ్రీహరి బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్(సివిల్) దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు పరిగి శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టీ ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ కూడా ఇదే విధంగా పార్టీ ఫిరాయించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింత ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ తదితరులు కూడా జనవరి 15వ తేదీనే సుప్రీంలో రిట్ పిటిషన్(సివిల్) వేశారు. మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మరో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. నాగేందర్‌ని ప్రతివాదిగా చేర్చారు. ఈ పిటిషన్లన్నింటినీ కలిపి బెంచ్ విచారించి తాజాగా తీర్పు వెలువరించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సీ ఆర్యమ సుందరం, దామా శేషాద్రినాయుడు, గండ్ర మోహన్‌రావు, ఏవోఆర్‌మోహిత్‌రావు; ప్రతివాదుల తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, అభిషేక్ మను సింఘ్వి, రవిశంకర్ జంధ్యాల, గౌరవ్ అగర్వాల్ వాదనలు వినిపించారు.
Updated Date - Aug 01 , 2025 | 05:21 AM