Fertilizer Supply: ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: సీఎస్
ABN, Publish Date - Jul 27 , 2025 | 05:37 AM
రాష్ట్రంలో రైతులకు ఎక్కడా యూరియా, ఇతర ఎరువుల కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులను సీఎస్ విజయానంద్ ఆదేశించారు.
అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులకు ఎక్కడా యూరియా, ఇతర ఎరువుల కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులను సీఎస్ విజయానంద్ ఆదేశించారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. శనివారం కలెక్టర్లు, వ్యవసాయ, జలవనరుల శాఖల అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంప్లెక్స్ ఎరువులు తీసుకుంటేనే డీఏపీ విక్రయిస్తామంటూ పలుచోట్ల వ్యాపారులు రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అలాంటి వారిపై ఈసీ, పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని సీఎస్ ఆదేశించారు. ఎరువుల విషయంలో అనుమానాలు రేకెత్తేలా సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోందని, దీనిపై కలెక్టర్లు వాస్తవాలు తెలియజేయాలన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రోజూ నిల్వలు, సరఫరా వివరాలను మీడియా ద్వారా వివరించాలని, గోడౌన్లు, ఎరువుల దుకాణాలను కలెక్టర్లు తనిఖీ చేసి, రైతులతో మాట్లాడాలని సూచించారు. రైతుసేవా కేంద్రాల్లో అవసరమైన మేరకు స్టాక్ ఉంచాలన్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ‘వరద నీటిని ముందుగా సాగునీటి కాలువలకు మళ్లించాలి. సముద్రంలోకి వృధాగా పోకుండా సాధ్యమైనంత వరకు అన్ని ప్రాజెక్టులు నింపాలి. అన్ని సమ్మర్ స్టోరేజ్ చెరువులను నింపాలి. చెరువు గట్లు, కాలువల గట్లకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని సీఎస్ ఆదేశించారు.
Updated Date - Jul 27 , 2025 | 07:10 AM