రూ.13.56 లక్షల విలువైన స్టాంప్ పేపర్ల అపహరణ
ABN, Publish Date - Jul 04 , 2025 | 12:43 AM
గన్నవరం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో బుధవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రూ.13.56 లక్షల విలువైన స్టాంపు పేపర్లను అపహరించుకుపోయారు.
-గన్నవరం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో భారీ చోరీ
-ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
- సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఉండటంపై అనుమానాలు
గన్నవరం, జూలై 3 (ఆంధ్రజ్యోతి):
గన్నవరం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో బుధవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రూ.13.56 లక్షల విలువైన స్టాంపు పేపర్లను అపహరించుకుపోయారు. వివరాల్లోకి వెళితే... గన్నవరం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు విధులు నిర్వర్తిస్తున్నారు. రోజు మాదిరిగానే అక్కడ పనిచేసే ప్రైవేటు వ్యక్తి ఖాజా రాత్రి 8.30 గంటలకు సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లాడు. గురువారం ఉదయం కార్యాలయం తాళాలు తీసేందుకు మరో ప్రైవేటు వ్యక్తి హరి వచ్చాడు. మెయిన్ డోర్ తాళాలు పగులకొట్టి ఉండటంతో వెంటనే సబ్ రిజిస్ర్టార్ ప్రసాద్‌కు సమాచారం ఇచ్చాడు. ఆయన వచ్చి కార్యాలయంలోకి వెళ్లి చూడగా, బీరువాను పగులకొట్టి అందులోని రూ.13,56,300 విలువ చేసే స్టాంప్ పేపర్లు అపహరించుకుపోయినట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు, సీఐలు శివప్రసాద్, గోవిందరాజు, స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ డీఐజీ రవీంద్రనాథ్, జిల్లా రిజిస్ర్టార్ మూర్తి తదితరులు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాన్ని పరిశీలించారు. రూ.50 నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్లు 3600, రూ.100 స్టాంప్ పేపర్లు 900, తోక బిళ్లలు రూ.50 విలువ చేసేవి 1,250, రూ.100 స్టాంప్‌లు 4,609 చోరీకి గురైనట్లు గుర్తించారు. సబ్ రిజిస్ర్టార్ ప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిసరాల్లోని సీసీ కెమెరాల పుటేజ్‌లను పరిశీలించారు. సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలోని సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఉన్నట్టు గుర్తించారు. ఎందుకు ఆఫ్ చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రైవేటు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Updated Date - Jul 04 , 2025 | 12:43 AM