Ration mafia: రేషన్ మాఫియాకు చెక్ పడేనా?
ABN, Publish Date - Jul 13 , 2025 | 11:46 PM
Ration subsidy scam జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతూనే ఉన్నాయి. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి.. సన్నబియ్యం పేరిట వాటిని విక్రయిస్తూ రూ.కోట్లు సంపాదిస్తున్నారు. అడపాదడపా అధికారుల తనిఖీల్లో రేషన్ బియ్యం పట్టుబడుతున్నా, జరిమానా విధిలించి వదిలేయడం తప్ప.. కఠినచర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
జిల్లాలో యథేచ్ఛగా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా
మిల్లుల్లో పాలీష్ చేసి.. అధిక ధరకు విక్రయాలు
అక్రమాల నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
నరసన్నపేట, జూలై 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతూనే ఉన్నాయి. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి.. సన్నబియ్యం పేరిట వాటిని విక్రయిస్తూ రూ.కోట్లు సంపాదిస్తున్నారు. అడపాదడపా అధికారుల తనిఖీల్లో రేషన్ బియ్యం పట్టుబడుతున్నా, జరిమానా విధిలించి వదిలేయడం తప్ప.. కఠినచర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇదే అలుసుగా అక్రమార్కులు బియ్యాన్ని బొక్కేస్తున్నారు. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పి.కోనవలస చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో భాగంగా శ్రీకాకుళం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు శనివారం భారీగా రేషన్ బియ్యం పట్టుబడిన విషయం తెలిసిందే. కొత్తూరు మండలం కడుమలో రైస్‌మిల్లు నుంచి ఒడిశా రాష్ట్రం నవరంగపూర్‌కు లారీల్లో తరలిస్తున్న 34,800 కిలోల (700 బస్తాలు) పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. సుమారు రూ. 15.83 లక్షల బియ్యం పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతోనై రేషన్ మాఫియా ఆగడాలకు చెక్ పడుతుందా? లేదోనన్న చర్చ సాగుతోంది.
ఇదీ పరిస్థితి
జిల్లాలో 6,60,739 రేషన్‌కార్డులు ఉన్నాయి. 1,603 డిపోల ద్వారా ప్రతీ నెలా ఒక్కో కార్డుదారుడికి 5 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. చాలా మంది రేషన్ కార్డుదారులు ఈ బియ్యాన్ని వినియోగించకుండా స్థానిక వ్యాపారులకు కిలో రూ.17 నుంచి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. ఆయా వ్యాపారులు పెద్ద మొత్తంలో ఒకేసారి ఆ బియ్యాన్ని మిల్లుకు తరలిస్తున్నారు. నరసన్నపేటలోని జగన్నాథపురం, బొరిగివలసలో వ్యాపారులు అధికంగా రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్నారు. నరసన్నపేట, బొరిగివలస, మడపాం తదితర ప్రాంతాల్లో మిల్లులకు ఇతర ప్రాంతాల నుంచి బియ్యం దిగుమతి అవుతున్నాయి. వాటిని పాలీష్ చేసి.. మెరుపు వచ్చేందుకు నూనె వేస్తూ మిల్లింగ్ చేస్తారు. సన్నబియ్యం మాదిరి వాటిని ప్యాకింగ్ చేసి కిలో 60 నుంచి రూ.65 చొప్పున విక్రయిస్తున్నారు. జిల్లాలో చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. కొంతమంది అధికారులకు మామూళ్లు ముట్టచెప్పడంతో బియ్యం అక్రమ రవాణా చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒకవేళ పట్టుకున్నా 6ఏ కేసులు నమోదు చేసి.. జరిమానా విధించి వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కాగా, రేషన్ బియ్యం అక్రమ రవాణా నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎక్కడికక్కడ నిఘా పెంచాలని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహన్ ఇటీవల అధికారులకు ఆదేశించారు. రేషన్ బియ్యం పట్టుబడితే 6ఏతోపాటు పీడీయాక్ట్, బీఎన్‌ఎస్ చట్టాల కింద కూడా కేసులు నమోదు చేసి అక్రమార్కుల ఆట కట్టించాలని స్పష్టం చేశారు. దీనిపై అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారో వేచిచూడాలి.
Updated Date - Jul 13 , 2025 | 11:46 PM