‘ఉపాధి’ పనులపై అలసత్వం ఎందుకు?
ABN, Publish Date - Jun 01 , 2025 | 12:29 AM
గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పనులంటే అంత అలుసెందుకని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణరావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
గ్రామీణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణరావు
బొరిగివలస రోడ్డు పనులపై అసంతృప్తి
పీఆర్ ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం
నరసన్నపేట, మే 31(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పనులంటే అంత అలుసెందుకని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం ఆయన చిన్న బొరిగివలస వద్ద రూ.30 లక్షల ఉపాధి నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. పోలాకి రోడ్డు నుంచి చిన్నబొరిగివలస గ్రామానికి వెళ్లే మార్గంలో సీసీ రోడ్డును పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. బెర్ములపై నిల్చునేందుకు ప్రయత్నించిన ఆయనకు అక్కడ నిల్చుంటే కుంగుతుందని పంచాయతీరాజ్ ఈఈ చెప్పడంతో అసంతృప్తి వ్యక్తంచేశారు.
కలెక్టర్ గారూ మీరూ చూడండి..
కొంత దూరంలో బెర్ములు వర్షాలకు కొట్టుకుపోయిన విషయాన్ని గమనించిన ప్రిన్సిపల్ సెక్రటరీ.. కలెక్టర్ గారూ రోడ్డు పరిస్థితి చూడండంటూ ఆ దృశ్యాన్ని చూపించారు. సీసీ రోడ్డు కిందకు కొంత మట్టి కొట్టుపోవడాన్ని పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులపై మండిపడ్డారు. డీఈఈ, ఏఈఈలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రోడ్డుకు ఇరువైపులా ఎన్ని ప్రాంతాల్లో పైపులు వేశారో తెలియజేయాలని కోరగా ఇంజనీరింగ్ అధికారులు తెల్లముఖం వేశారు. చిన్నబొరిగివలస వద్ద ఇదే రోడ్డుకు వేసిన కల్వర్టు పనులను పరిశీలించి పైపులు రెండు వైపులా సరిగా లేకపోవడంతో అసహనం వ్యక్తంచేశారు. పీఆర్ ఈఈ నరసన్నపేటలో పనిచేసిన డీఈఈ చాలా సమర్థుడని పదేపదే చెప్పడంతో ఆయనపై మండిపడ్డారు.
మన మంత్రి ఎవరు?
అనంతరం బొరిగివలస గ్రామంలో ఉద్యాన వనశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మామిడితోటల పెంపకం, ఫాంపాండ్‌ను పరిశీలించారు. అక్కడ ఉపాధి వేతనదారులతో మాట్లాడుతూ.. మన మంత్రి పేరు చెప్పండని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ అని వారు చెప్పగానే ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఫాంపాండ్‌ను పరిశీలించి అక్కడి పనులపై అసంతృప్తి చెందారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆవరణలో తీసిన ఇంకుడు గుంతను పరిశీలించారు. అనంతరం నియోజకవ ర్గంలో చేపట్టిన ఉపాధి పనులపై అధికారులు ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా దానిని ప్రిన్సిపల్ సెక్రటరీ పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, డీపీవో భారతి సౌజన్య, శ్రీకాకుళం ఆర్డీవో సాయిప్రత్యూష, జడ్పీ సీఈవో శ్రీధర్ రాజా, డ్వామా పీడీ సుధాకర్, ఏపీడీలు, పీఆర్, ఆర్‌డబ్య్లూఎస్ అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి పథంలో నడిపించాలి
రణస్థలం, మే 31(ఆంధ్రజ్యోతి): పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత సర్పంచులదేనని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషనరావు అన్నారు. బుంటుపల్లి గ్రామంలో శనివారం చేపట్టిన ఎన్‌టీఆర్ భరోసా పిఛన్ పంపిణీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఇంటి వద్ద ఎరువుల గుంత, పశువుల తొట్టే ఏర్పాటు చేయించాలని ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. బంటుపల్లి పంచాయతీ అభివృద్ధిని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు వివరించారు. సచివాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, జేసీ పర్మాన్ అహ్మద్‌ఖాన్, సర్పంచ్ నడుకుదిటి రజిని తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 01 , 2025 | 12:29 AM