collecter: అభివృద్ధి పనుల్లో జాప్యమెందుకు?
ABN, Publish Date - Apr 10 , 2025 | 11:47 PM
Development works టెక్కలిలో పట్టుమహాదేవి కోనేరు అభివృద్ధి పనుల్లో తాత్సారం ఎందుకు చేస్తున్నారంటూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం టెక్కలిలోని మొఖలింగాపురం పంచాయతీలో గడిమెట్ట జగన్నాథపురం, మొఖలింగాపురం తదితర గిరిజన గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు.
‘పట్టుమహాదేవి కోనేరు’ తాత్సారంపై కలెక్టర్ ఆగ్రహం
గిరిజన గూడల్లో పర్యటన.. సమస్యలపై ఆరా
చిన్నకేదారి రిజర్వాయర్‌ను నిర్మించాలని రైతుల విజ్ఞప్తి
టెక్కలి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): టెక్కలిలో పట్టుమహాదేవి కోనేరు అభివృద్ధి పనుల్లో తాత్సారం ఎందుకు చేస్తున్నారంటూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం టెక్కలిలోని మొఖలింగాపురం పంచాయతీలో గడిమెట్ట జగన్నాథపురం, మొఖలింగాపురం తదితర గిరిజన గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. పట్టుమహాదేవి కోనేరు అభివృద్ధి పనుల్లో జాప్యంపై మండల ఇంజనీరింగ్ అధికారి లక్ష్ముంనాయుడు, పంచాయతీ ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఎందుకు చేపట్టడం లేదని వారిని ప్రశ్నించారు. అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దని హెచ్చరించారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. ముఖలింగాపురంలో గిరిజనులతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నకేదారి రిజర్వాయర్ నిర్మించి.. తమకు సాగునీరు అందించాలని గిరిజనులు కలెక్టర్‌ను కోరారు.
అనంతరం మొఖలింగాపురంలో దుర్గగెడ్డ సమీపాన ఉన్న చెరువును పరిశీలించి చెక్‌డ్యామ్ నిర్మించాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. దుర్గగెడ్డలో పిచ్చిమొక్కలు, పూడికలతో పాటు ఆక్రమణలు తొలగించాలని స్పష్టం చేశారు. ఈ ప్రాంత గిరిజనులతో గ్రామసభ నిర్వహించి.. ఏఏ పనులు అవసరమో వారి ద్వారా గుర్తించాలని సూచించారు.
గడిమెట్ట జగన్నాథపురంలో ఫాంపాండ్‌ను పరిశీలించి ఆ ప్రాంతంలో అటవీ భూముల వివరాలు, గ్రౌండ్‌వాటర్ పరిస్థితిపై ఆరాతీశారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో కన్వర్జెన్స్ ద్వారా ఆయా శాఖలతో ఏఏ పనులు చేపట్టాలో తెలుసుకున్నారు. గోశాల పరిస్థితులు, బిల్లులు చెల్లింపులపై ఆరాతీశారు. సోలార్ వాటర్‌ప్లాంట్ పాడై.. తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని గ్రామస్థులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ మాట్లాడి మరమ్మతులు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, డ్వామా పీడీ సుధాకర్, వంశధార ఈఈ శేఖర్, పీఆర్ డీఈఈ సుధాకర్, తహశీల్దార్ రవికుమార్, ఎంపీడీవో లక్ష్మీభాయి, ఏపీవో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 10 , 2025 | 11:47 PM