ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్లాస్టిక్‌ నిషేధం ఎక్కడ?

ABN, Publish Date - Jul 18 , 2025 | 11:59 PM

జిల్లాలో ప్లాస్టిక్‌ నిషేధం కానరావడం లేదు. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్లాస్టిక్‌ వినియోగం విచ్చలవిడిగా పెరిగింది.

శ్రీకాకుళం నగరంలో రోడ్డుపై పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు

- జిల్లాలో పెరుగుతున్న వినియోగం

- పర్యావరణానికి తీవ్ర ముప్పు

- జూట్‌, కాగిత సంచులు ఉపయోగించాలంటున్న నిపుణులు

శ్రీకాకుళం క్రైం, జూలై 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్లాస్టిక్‌ నిషేధం కానరావడం లేదు. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్లాస్టిక్‌ వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. దీంతో ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ వ్యర్థాలే దర్శనమిస్తోన్నాయి. శ్రీకాకుళం నగరంలో ప్రతిరోజూ రెండు టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు వస్తున్నాయి. నగరం చెంతనే ఉన్న నాగావళి నదిలో సగటున రోజుకు టన్నుల రూపంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు కలుస్తున్నాయి. ఉదయం పాల ప్యాకెట్ల నుంచి రాత్రి వరకు దయనందిన జీవితంలో ప్రతి వినియోగానికి ప్లాస్టిక్‌ వాడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఆరు నెలల కిందట ప్లాస్టిక్‌ కవర్లను విక్రయిస్తున్న 110 మంది వ్యాపారులను గుర్తించి రూ.3 లక్షల అపరాధ రుసుం వసూలు చేశారు. ఆ తర్వాత తనిఖీలు లేకపోవడంతో నగరంలో ప్లాస్టిక్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో ప్లాస్టిక్‌ విక్రయాలు అధికంగా ఉన్నాయి. ప్రతి నెల టన్ను మేర ప్లాస్టిక్‌ వస్తువులు విక్రయాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆమదాలవలసలో సైతం రోజుకు 26 టన్నుల చెత్తను సేకరిస్తుండగా అందులో రెండు టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉంటున్నాయి. పలాస, కాశీబుగ్గ, మున్సిపాలిటీలో 29 టన్నుల చెత్త సేకరణ జరుగుతుండగా నాలుగు టన్నులు ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉన్నట్టు తెలుస్తోంది.

నిబంధనలు బేఖాతరు..

జిల్లాలో ప్లాస్టిక్‌ వినియోగం, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. విక్రయదారులు కనీస నిబంధనలు పాటించడం లేదు. వాస్తవానికి 2022లో ప్లాస్టిక్‌ను కేంద్రం పూర్తిగా నిషేధించింది. కానీ, జిల్లాలో అదెక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. నగర పాలకసంస్థలు, మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్‌ ఉత్పత్తులను విక్రయించాలంటే ట్రేడ్‌ లైసెన్స్‌ తప్పనిసరి. కానీ, కొందరు ఆ లైసెన్స్‌లు లేకుండానే విక్రయాలు చేపడుతున్నారు. అయినా సరే యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 125 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ వస్తువులనే వినియోగించాలి. ఆలోపు ఉన్నవి పూర్తిగా వినియోగించకుండా నిషేధం విధించింది. కానీ, జిల్లాలో మాత్రం ఆ నిబంధనలు పట్టించుకోవడం లేదు. పురపాలక, కాలుష్య నియంత్రణ మండలి, తూనికలు కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాల్సి ఉంది. అయితే, ఆ శాఖలు మాత్రం నిద్దరోడుతున్నట్టు విమర్శలు ఉన్నాయి.

మానవాళికి ముప్పు..

ప్లాస్టిక్‌ వస్తువులను మితిమీరి వినియోగించడం వల్ల పర్యావరణంతో పాటు మానవాళికి ముప్పు ఏర్పడుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. గోనె, కాగిత సంచులు వినియోగించాలని మొరపెట్టుకుంటున్నా ప్రజల చెవికెక్కడం లేదు. అల్పాహార, మాంసాహార హోటళ్లు, ఫుట్‌పాత్‌, టీ దుకాణాల్లో వేడి టీ, కాఫీ, పాలు, కూరలను పాలిథిన్‌ సంచుల్లో పార్శిల్‌ చేస్తున్నారు. ఈ పదార్థాలు తినడం వల్ల క్యాన్సర్‌, జీర్ణకోశ సంబంధిత వ్యాధుల బారిన పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్లాస్టిక్‌ నిషేధంపై యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అవసరంఉంది.

కఠిన చర్యలు తీసుకుంటాం

శ్రీకాకుళం నగరంలో ప్లాస్టిక్‌ నిషేధాన్ని పక్కాగా అమలు చేస్తున్నాం. తనిఖీలు పెంచుతాం. పట్టుబడితే భారీ జరిమానాలు విధిస్తాం. వ్యాపారులు, ప్రజలు సహకరించాలి. జూట్‌ బ్యాగ్‌లను వినియోగించాలి. ఇప్పటికే దీనిపై వ్యాపారులకు అవగాహన కల్పించాం. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలకు ఉపక్రమిస్తాం.

- ప్రసాద్‌, కమిషనర్‌, శ్రీకాకుళం నగరపాలక సంస్థ

Updated Date - Jul 18 , 2025 | 11:59 PM