Lands problames: మా భూములకు దారేదీ?
ABN, Publish Date - Jul 04 , 2025 | 12:14 AM
Land Access Issues పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ మూడో రైల్వేలైన్ పనుల కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా జంగిల్ క్లియరెన్స్ చేపడుతున్నారు. రైల్వేభూముల పరిధిని నిర్దేశిస్తూ శాశ్వత స్తంభాలను ఏర్పాటు చేసి కంచె వేస్తున్నారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
‘పలాస - ఇచ్ఛాపురం’ మూడో రైల్వేలైన్‌కు కసరత్తు
రైల్వేట్రాక్‌కు ఇరువైపులా స్తంభాలు
వంతెనలు, ఖానాలు ఉన్నచోట సైతం ఏర్పాటు
పొలాలకు వెళ్లేందుకు అడ్డంకులు
ఆందోళనలో 100 గ్రామాల రైతులు
హరిపురం, జూలై 3(ఆంధ్రజ్యోతి):
మందస మండలం హరిపురం గ్రామానికి చెందిన రైతులకు బాలిగాం, భిన్నలమదనాపురం పంచాయతీల పరిధిలో భూములు ఉన్నాయి. ఆ భూములకు వెళ్లాలంటే రైల్వేట్రాక్ దాటాల్సి వస్తోంది. మధ్యలో చిన్నచిన్న ఖానాలు, గెడ్డ నీరు ప్రవహించే కాలువలు ఉన్నాయి. వాటి గుండా పొలాలకు వెళ్తుండేవారు. ప్రస్తుతం రైల్వేట్రాక్ ఇరువైపులా రైల్వేశాఖ స్తంభాలు పాతి దారి మూసివేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
............
సోంపేట మండలం తాళ్లభద్ర గ్రామ రైతులకు అంబుగాం రెవెన్యూ పరిధిలోని భిన్నళ మదనాపురంలో భూములు ఉన్నాయి. మధ్యలో ఉన్న రైల్వేట్రాక్ దాటితే కానీ తమ పొలాలకు రైతులు వెళ్లలేరు. వ్యవసాయ పనులు చేసుకోవడానికి, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు తప్పనిసరిగా రైల్వేలైన్ దాటాల్సిందే. ప్రస్తుతం రెండు వైపులా స్తంభాలతో కప్పేస్తుండడంతో రాకపోకలు ఎలా సాగించాలని రైతులు మదనపడుతున్నారు.
...............
...ఈ రెండు గ్రామాలే కాదు. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ ఉన్న 45 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 100 గ్రామాల వరకూ ఇదే పరిస్థితి. పంచాయతీలు, రెవెన్యూ భూములను విభజిస్తూ రైల్వేట్రాక్ ఉండేది. రైతులకు సాగునీరుకు సంబంధించి కాలువలపై భారీ వంతెనలు, కల్వర్టులు, ఖానాలను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. దశాబ్దాలుగా రైతులు వాటిపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ మూడో రైల్వేలైన్ పనుల కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా జంగిల్ క్లియరెన్స్ చేపడుతున్నారు. రైల్వేభూముల పరిధిని నిర్దేశిస్తూ శాశ్వత స్తంభాలను ఏర్పాటు చేసి కంచె వేస్తున్నారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేట్రాక్ దాటేందుకు వీలులేకుండా ఎక్కడికక్కడే స్తంభాలు ఏర్పాటు చేస్తుండడంతో పొలాలకు ఎలా రాకపోకలు సాగించాలో తెలియక సతమతమవుతున్నారు.
అప్పుడు హైవే.. ఇప్పుడు రైల్వే..
విశాఖ నుంచి భువనేశ్వర్ వరకూ మూడో రైల్వేలైన్ నిర్మాణానికి రైల్వేశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మార్గంలో వస్తు రవాణా అధికం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌తోపాటు ఇతర పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున ముడిసరుకులు, పారిశ్రామిక ఉత్పత్తులు ఈ మార్గంలో తరలిస్తుంటారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున పారిశ్రామిక ఉత్పత్తులు ఈ మార్గంలోనే ఎక్కువగా రవాణా జరుగుతోంది. ఈ తరుణంలో సూపర్‌ఫాస్ట్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పైగా రైలు ప్రమాదాలు, సాంకేతిక సమస్యలు, వాతావరణ ప్రతికూల పరిస్థితులు తలెత్తినప్పుడు రెండు లైన్లతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే మూడోలైన్ ప్రతిపాదన తెచ్చారు. గూడ్స్ రైళ్లకు ప్రత్యేక మార్గం ఉంచి.. మిగతా సూపర్‌ఫాస్టు రైళ్లకు మార్గం సుగమం చేయనున్నారు. ఈ మార్గంలో రైల్వేకు చెందిన భూములే ఉండడంతో వాటిలో ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ పనులు చేస్తున్నారు. అందులో భాగంగానే విద్యుత్ స్తంభాలతో మూసివేస్తున్నారు. దీంతో పలాస నియోజకవర్గంలోని మందస, ఇచ్చాపురం నియోజకవర్గంలోని సోంపేట, కంచిలి, ఇచ్చాపురం మండలాల్లో 100 గ్రామాల రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు. గతంలో జాతీయ రహదారి నిర్మాణ సమయంలో కూడా ఇటువంటి పరిస్థితే తలెత్తింది. అప్పట్లో ఇలానే వ్యవసాయ భూములకు సంబంధించి అడ్డంగా జాతీయ రహదారి నిర్మించారు. ఆ సమయంలో సైతం వ్యవసాయ ఉత్పత్తులు తెచ్చేందుకు అండర్ టన్నెల్, కల్వర్టులు వంటివి నిర్మించలేదు. దీంతో ఏటా ఖరీఫ్, రబీ సమయంలో రైతులు పడే బాధలు వర్ణనాతీతం. తాజాగా రైల్వేలైన్ నిర్మాణంలో కూడా తమకు అన్యాయం జరుగుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తమకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఖుర్దా డివిజన్ రైల్వే ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాళం అశోక్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆందోళనగా ఉంది
పొలాలకు వెళ్లేందుకు వీలు లేకుండా రైల్వేట్రాక్‌కు ఇరువైపులా స్తంభాలు ఏర్పాటు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. దశాబ్దాలుగా రైల్వేట్రాక్ దాటుకొని.. ఖానాల కింద నుంచి రాకపోకలు సాగిస్తున్నాం. వాటిని కూడా స్తంభాలతో మూసివేస్తుండడంతో ఇబ్బంది పడుతున్నాం.
- సారి వెంకటరావు, రైతు, తాళ్లభద్ర
రైల్వే అధికారులు స్పందించాలి
నాకు అంబుగాం రెవెన్యూ పరిధిలోని భిన్నళ మదనాపురంలో వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయ పనుల నిమిత్తం దశాబ్దాలుగా రైల్వే వంతెన కింద నుంచి రాకపోకలు సాగిస్తున్నాం. ఇప్పుడు స్తంభాలు పాతేస్తుండడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి.
- సీర చంద్రరావు, రైతు, బిన్నల
Updated Date - Jul 04 , 2025 | 12:14 AM