new police stations: కొత్త పోలీస్‌స్టేషన్లు ఎప్పుడు?
ABN, Publish Date - Jul 14 , 2025 | 11:56 PM
police station inauguration జిల్లాలో కొత్త పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు జాప్యమవుతోంది. ముఖ్య పట్టణాల్లో రెండో స్టేషన్ ప్రతిపాదనలు దశాబ్దాలుగా కార్యరూపం దాల్చడం లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో 12 పోలీస్ సర్కిల్స్ ఉండేవి. మొత్తం 44 పోలీస్‌స్టేషన్లు కొనసాగేవి. కానీ జిల్లా విభజనతో పాలకొండ సర్కిల్ పార్వతీపురం మన్యం జిల్లాలోకి.. రాజాం సర్కిల్ విజయనగరం జిల్లాలోకి చేరింది.
ప్రతిపాదనల్లోనే రెండో స్టేషన్ ఏర్పాటు
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
కాశీబుగ్గ, జూలై 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్త పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు జాప్యమవుతోంది. ముఖ్య పట్టణాల్లో రెండో స్టేషన్ ప్రతిపాదనలు దశాబ్దాలుగా కార్యరూపం దాల్చడం లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో 12 పోలీస్ సర్కిల్స్ ఉండేవి. మొత్తం 44 పోలీస్‌స్టేషన్లు కొనసాగేవి. కానీ జిల్లా విభజనతో పాలకొండ సర్కిల్ పార్వతీపురం మన్యం జిల్లాలోకి.. రాజాం సర్కిల్ విజయనగరం జిల్లాలోకి చేరింది. దీంతో జిల్లాలో పోలీస్‌స్టేషన్లు తగ్గుముఖం పట్టి.. 38కి చేరుకుంది. జిల్లాలో ప్రతి మండలానికి ఒక పోలీస్‌స్టేషన్ ఉంది. కానీ పాతపట్నం నియోజకవర్గంలోని ఎల్‌ఎన్‌పేట మండలానికి మాత్రం లేదు. ఆ మండలం సరుబుజ్జిలి పోలీస్‌స్టేషన్ పరిధిలో కొనసాగుతోంది. చాలా మండలాల్లో జనాభా ప్రతిపాదికన రెండు పోలీస్‌స్టేషన్లు కొనసాగుతున్నాయి. కానీ కీలకమైన పట్టణాల్లో మాత్రం ఒకటే పోలీస్‌స్టేషన్ ఉంటోంది. ముఖ్యంగా పలాస, పాతపట్నం, నరసన్నపేట, ఆమదాలవలస, పైడిభీమవరం, ఎల్.ఎన్.పేట వంటి ప్రాంతాల్లో రెండో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరిగింది. డీజీపీ, డీఐజీ వంటి ఉన్నతస్థాయి అధికారులు వచ్చిన ప్రతిసారి దీనిపై ప్రస్తావన వస్తోంది. కానీ, తరువాత మాత్రం బుట్టదాఖలవుతోంది. జిల్లాలో పెరుగుతున్న నేరాలు, రోడ్డుప్రమాదాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణపై కూటమి ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.
డివిజన్ కేంద్రంగా ఉన్నా...
ప్రస్తుతం కాశీబుగ్గ సర్కిల్ పరిధిలో కాశీబుగ్గ, వజ్రపుకొత్తూరు, నందిగాం పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. కాశీబుగ్గ సబ్ డివిజన్ కేంద్రంగా కొనసాగుతోంది. అయితే ఇక్కడ డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులతో పాటు 50 మంది వరకూ సిబ్బంది ఉండాలి. కానీ అరకొరగా ఉండడంతో విధుల నిర్వహణ కష్టమవుతోంది. జిల్లాలో శ్రీకాకుళం నగరం తరువాత అతి పెద్దది పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ. ఈ జంట పట్టణాల్లో జనాభాతోపాటు వాహన రద్దీ పెరుగుతోంది. నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌తోపాటు పలాస కేంద్రంగా మరో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం రెండు పట్టణాలతో పాటు పలాస రూరల్ ప్రాంతానికి ఏకైక పోలీస్‌స్టేషన్ ఉండడంతో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కష్టతరంగా మారుతోంది. ఒకవైపు రైల్వేస్టేషన్, మరోవైపు ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాలకు సరిహద్దున ఉన్న పలాస-కాశీబుగ్గలో మరో పోలీస్‌స్టేషన్ ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం స్పందించి పలాస కేంద్రంగా రూరల్ పోలీస్‌స్టేషన్ కానీ.. కాశీబుగ్గ కేంద్రంగా టౌన్ పోలీస్ స్టేషన్ కానీ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.
Updated Date - Jul 14 , 2025 | 11:56 PM