ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీసీఆర్‌ కార్డులు ఎప్పుడిస్తారో?

ABN, Publish Date - Jun 22 , 2025 | 12:00 AM

జిల్లాలోని కౌలు రైతులు పంట సాగుదారు హక్కు కార్డులకు (సీసీఆర్‌) నోచుకోవడం లేదు. ఇప్పటి వరకు 25 శాతం మందికి కూడా ఈ కార్డులు అందలేదు.

కౌలు రైతుల ఎదురుచూపు

ఇప్పటి వరకు 25 శాతం కూడా ఇవ్వలే!

సాంకేతిక సమస్యలతో సతమతం

‘అన్నదాత సుఖీభవ’ అందని ద్రాక్షేనా!

కంచిలి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కౌలు రైతులు పంట సాగుదారు హక్కు కార్డులకు (సీసీఆర్‌) నోచుకోవడం లేదు. ఇప్పటి వరకు 25 శాతం మందికి కూడా ఈ కార్డులు అందలేదు. సాంకేతిక సమస్యల కారణంగా సీసీఆర్‌ కార్డుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో కౌలు రైతులు ప్రభుత్వ పథకాలు, రాయితీలకు దూరమవుతున్నారు. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకం అందని ద్రాక్షగా మిగులుతుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో పరిస్థితి..

ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాలు పొందాలంటే ప్రతి కౌలు రైతుకూ సీసీఆర్‌ కార్డు ఉండాలి. ఈ కార్డు కాల పరిమితి 11 నెలలు ఉంటుంది. కాల పరిమితి పూర్తయిన వెంటనే మరలా వాటిని పునరుద్ధరించుకోవాలి. లేదంటే ప్రభుత్వ గుర్తింపును కోల్పోయినట్లు అవుతుంది. అయితే, ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం అయినప్పటికీ ఇప్పటి వరకు జిల్లాలో 25 శాతం మందికి కూడా సీసీఆర్‌ కార్డులు జారీ కాలేదు. జిల్లాలో 656 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 9,800మంది కౌలు రైతులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు ఎల్‌పీఎం ప్రాతిపదికన 278 మందికి, సర్వే నెంబర్ల ఆధారంగా 1,802 మందికి మొత్తం 2,080 మందికి సీసీఆర్‌ కార్డులను అధికారులు జారీ చేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గం కంచిలి మండలంలో 186 మంది కౌలు రైతులకు గాను 111 మందికి, ఇచ్ఛాపురం మండలంలో 149 మందికి గాను 18 మందికి, కవిటి మండలంలో 327 మందికి గాను 246 మందికి, సోంపేట మండలంలో 396 మందికిగాను 108 మంది కౌలు రైతులకు మాత్రమే గుర్తింపు కార్డుల మంజూరు చేశారు. పలాస డివిజన్‌ పరిధిలోని నాలుగు మండలాల్లో 1,428 మంది కౌలు రైతులు ఉండగా 558 మందికి మాత్రమే కార్డులు ఇచ్చారు. టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, రణస్థలం, కొత్తూరు డివిజన్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అత్యల్పంగా శ్రీకాకుళం మండలంలో 91 మంది కౌలు రైతులకే సీసీఆర్‌ కార్డులు మంజూరు చేశారు. ఇప్పటికైనా అధికారులు కౌలు దారులను గుర్తించి, వారికి సాగు హక్కు పత్రాలను మంజూరు చేయాల్సిన అవసరం ఉంది.

సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు

సాంకేతిక సమస్యల కారణంగా కౌలు రైతులకు సీసీఆర్‌ కార్డులు మంజూరు కావడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన భూ సర్వే లోపభూయిష్టంగా ఉంది. ఒకే ఎల్‌పీ నెంబర్లకు రెండు వేర్వేరు భూ యజమానులకు ఇచ్చారు. అలాగే, భూ యజమాని ఆధార్‌కార్డును తప్పుగా నమోదు చేయడం, ఒకరి భూమికి వేరొకరి ఆధార్‌ నెంబర్‌ను అనుసంధానం చేయడం వంటి సమస్యల కారణంగా ప్రస్తుతం సీసీఆర్‌ కార్డుల మంజూరు ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ తప్పులను సరిదిద్దితే తప్ప, కార్డుల మంజూరు పూర్తికాదనేది స్పష్టమవుతోంది.

కౌలు గుర్తింపు కార్డుతో ప్రయోజనాలివే..

కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఉంటే అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం అందుతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో తమ పంటలను నేరుగా విక్రయించుకోవచ్చు. బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతింటే వారికి నష్ట పరిహారం, బీమా సదుపాయం అందుతుంది. ఎరువులు, విత్తనాలపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు సైతం వర్తిస్తాయి.

సాగు కోసం అప్పు చేశా

ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నా. ఇంతవరకు దాని గురించి ఎటువంటి సమాచారం లేదు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైంది. మూడు ఎకరాల భూమి కౌలుకు సాగు చేస్తున్నాను. పెట్టుబడుల కోసం మళ్లీ అప్పులు చేశా. ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించాలి.

-కేశవరావు, రైతు, కంచిలి

నిబంధనలు సడలించాలి

కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం అందేలా నిబంధనలు సడలించాలి. కౌలు రైతులందరికీ పథకం వర్తింపచేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.

-కప్ప గోపీనాథ్‌, మండల రైతు సంఘం నాయకుడు, కంచిలి

Updated Date - Jun 22 , 2025 | 12:00 AM