Suspicious box: ఆ పెట్టెలో ఏముంది?
ABN, Publish Date - Jul 09 , 2025 | 12:05 AM
Mysterious package box వారం క్రితం నరసన్నపేట మండలం చోడవరం గ్రామానికి చెందిన సైలాడ బుచ్చయ్య, మడ్డి రామకృష్ణ అనే జాలర్లు గెడ్డవానిపేట- కోమనాపల్లి గ్రామాల మధ్య వంశధార నదిలో చేపల వేటకు వెళ్లారు. వేట సాగిస్తుండగా పురాతన ఇనుపపెట్టె వారి వలకు చిక్కింది.
జాలర్లకు చిక్కిన ఐరన్ బాక్స్
ఓ ఆసామికి రూ.3వేలకు విక్రయం
గుప్తనిధులు ఉన్నాయని ప్రచారం
సురవరంలో చోరీ చేసి.. నదిలో పడేసిన దొంగలు
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
నరసన్నపేట/జలుమూరు, జూలై 8(ఆంధ్రజ్యోతి): వారం క్రితం నరసన్నపేట మండలం చోడవరం గ్రామానికి చెందిన సైలాడ బుచ్చయ్య, మడ్డి రామకృష్ణ అనే జాలర్లు గెడ్డవానిపేట- కోమనాపల్లి గ్రామాల మధ్య వంశధార నదిలో చేపల వేటకు వెళ్లారు. వేట సాగిస్తుండగా పురాతన ఇనుపపెట్టె వారి వలకు చిక్కింది. ఎంత ప్రయత్నించినా ఇనుపపెట్టె తాళం తెరచుకోలేదు. దీంతో ఆ పెట్టెను వారిద్దరూ గ్రామంలోకి తీసుకువచ్చారు. అందులో గుప్త నిధులు (బంగారం, వెండి ఆభరణాలు) ఉన్నాయని ప్రచారం సాగింది. దీంతో గ్రామానికి చెందిన ఒక ఆసామి ఆ పెట్టెను జాలర్ల వద్ద రూ.3వేలకు కొనుగోలు చేశారు. ఈ విషయం చుట్టుపక్కలా వ్యాపించడంతో అసలు ఆ పెట్టె ఎవరిది? అందులో బంగారు ఆభరణాలు, డబ్బులు ఏమైనా ఉన్నాయా? అనే చర్చ సాగింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
దొంగలు తెరవలేక.. నదిలో పడేశారు
నెల రోజుల కిందట జలుమూరు మండలం నదీ తీర గ్రామమైన సురంవరం గ్రామానికి చెందిన సురవరపు శివప్రసాద్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ ఇంట్లో లాకర్ ఇనుపపెట్టే చోరీకి గురైంది. దీనిపై శివప్రసాద్ జలుమూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. తాజాగా చోడవరం గ్రామానికి చెందిన జాలర్లకు ఓ ఇనుపపెట్టె దొరికిందనే ప్రచారం సాగడంతో.. బాధితులు వచ్చి ఆరా తీశారు. దొంగలు తెరవలేక ఆ పెట్టెను నదిలో పడేశారని, జాలర్లకు దొరికిన పెట్టె తమదేనని నిర్ధారణకు వచ్చారు. ఈ విషయమై జలుమూరు పోలీసులకు శివప్రసాద్ సమాచారం ఇచ్చారు.
రంగంలోకి దిగిన పోలీసులు
ఇనుపపెట్టె విషయమై జలుమూరు పోలీసులు ఆరా తీశారు. చోడవరం గ్రామానికి చెందిన ఒక ఎం.అప్పారావు అనే ఆసామికి రూ.3వేలకు విక్రయించినట్టు జాలర్లు తెలిపారు. ఆ ఆసామి శ్రీకాకుళంలో ఒక వెల్డర్ వద్ద లాకర్ కట్ చేయించి ఓపెన్ చేయించారు. అందులో బంగారం, వెండి ఆభరణాలతోపాటు తడిసి ముద్దయిన నగదు కూడా బయట పడినట్లు సమాచారం. కాగా ఆసామి బంగారం, వెండి ఆభరణాలను భద్రపరిచి.. ఖాళీ పెట్టెను గ్రామానికి తీసుకొచ్చాడు. అందులో ఇనుప వస్తువులే ఉన్నాయని గ్రామస్థులకు చెప్పి.. దానిని ఉల్లిపాయలు విక్రయించేవాడికి ఇచ్చేశాడు. దీనిపై ఎస్‌ఐ అశోక్‌బాబు ఆధ్వర్యంలో పోలీసులు మరింత ఆరా తీయగా.. జాలర్లకు వలలో చిక్కిన ఇనుపపెట్టే సురంవరంలో చోరికి గురైనదిగా గుర్తించారు. అందులో ఉన్న వెండి, నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే నగదు నీటిలో తడిసిపోవడంతో పోయినట్లు చెబుతున్నారు. ఏదిఏమైనప్పటికీ చోరికి గురై నదిలో దొంగలు పడేసిన ఇనుప పెట్టె జాలర్లకు దొరికి.. ఎక్కడెక్కడకో తిరిగి.. పోలీసుస్టేషన్‌కు చేరడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై సీఐ శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా జాలర్లకు దొరికిన పెట్టెలో నగదు, కొన్ని ఆభరణాలు ఉన్న మాట వాస్తవమేనన్నారు. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.
Updated Date - Jul 09 , 2025 | 12:05 AM